కన్నబిడ్డను చూడకుండానే.. | Women Died In Gandhi Hospital Due To Swine Flu | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డను చూడకుండానే..

Feb 25 2020 2:51 AM | Updated on Feb 25 2020 2:52 AM

Women Died In Gandhi Hospital Due To Swine Flu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నవమాసాలు మోసి, బిడ్డను కని.. అమ్మతనాన్ని ఆనందించకుండానే ఆ తల్లి కన్నుమూసింది. మరోపక్క పుట్టిన బిడ్డ కనీసం ముర్రుపాలకూ నోచుకోలేదు. తల్లి స్పర్శకు నోచుకోక ఆస్పత్రి ఎన్‌ఐసీయూలో ప్రస్తుతం ఆ శిశువు క్షేమంగా ఉన్నా.. తల్లిని కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది. కరీంనగర్‌కు చెందిన గర్భిణి షహనాజ్‌ (24) తీవ్ర జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతుండటంతో వరంగల్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. స్వైన్‌ఫ్లూగా అనుమానించిన వైద్యులు.. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న ఆమెను బంధువులు వెంటిలేటర్‌ సాయంతో ఈ నెల 18న రాత్రి పొద్దుపోయాక గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు.

వైద్యులు ఆమెకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, స్వైన్‌ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. అప్పటికే ఆమెకు నెలలు నిండటం, పరిస్థితి విషమంగా ఉండటంతో 19వ తేదీన సిజేరియన్‌ చేశారు. ఆడశిశువు జన్మించింది. శిశువుకు పరీక్షలు నిర్వహించగా, ఫ్లూ నెగటివ్‌ రావడంతో బిడ్డను ఇదే ఆస్పత్రి పీడియాట్రిక్‌ విభాగంలోని ఎన్‌ఐసీయూకు తరలించారు. వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉండటంతో తల్లిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ఫ్లూ బారి నుంచి కాపాడేందుకు వైద్యులు ఎంతగా ప్రయత్నించినా.. పరిస్థితి విషమించి షహనాజ్‌ సోమవారం కన్నుమూసింది. బిడ్డను కళ్లారా చూడకుండానే మృతి చెందడం, తల్లిపాల కోసం బిడ్డ గుక్కపట్టి ఏడవటం కలచివేసింది.

విజృంభిస్తోన్న వైరస్‌
చలికాలంలో విజృంభించే హెచ్‌1ఎన్‌1 స్వైన్‌ఫ్లూకారక వైరస్‌.. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా విస్తరిస్తోంది. జనవరి నుంచి రాష్ట్రంలో 148 కేసులు నమోదు కాగా, వీరిలో హైదరాబాద్‌ జిల్లావాసులే యాభై మందికిపైగా ఉన్నారు. బాధితుల్లో ఇప్పటికే ఒకరు మృతిచెందగా, తాజాగా బాలింత మృతితో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గాలి ద్వారా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ప్రస్తుతం గాంధీలో మౌలాలికి చెందిన బాలిక (11)తో పాటు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మరో నలుగురు ఫ్లూ పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు.

ముందు జాగ్రత్తే మందు..
– డాక్టర్‌ శ్రీధర్, స్వైన్‌ఫ్లూ నోడల్‌ ఆఫీసర్, ఉస్మానియా ఆస్పత్రి
– సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఒకేలా ఉంటాయి. కాబట్టి జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపించగానే స్వైన్‌ఫ్లూగా అనుమానించాల్సిన పనిలేదు.
– రోగ నిరోధకశక్తి తక్కువుండే మధుమేహులు, గర్భిణులు, పిల్లలు, వృద్ధులు, కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారు ఫ్లూ బారినపడే అవకాశాలు ఎక్కువ.
– స్వైన్‌ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, 101, 102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు మూడు రోజుల కంటే ఎక్కువ వేధిస్తే వైద్యులను సంప్రదించాలి.
– వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం. బయటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పిల్లలకు ఇది నేర్పించాలి.
– స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న వారు తుమ్మినా, దగ్గినా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement