ఆ ఒక్కటీ ఉంటే..!

Want To Join Blood Group In Driving Licence - Sakshi

డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీలో అమలుకు నోచుకోని బ్లడ్‌ గ్రూప్‌ నిబంధన  

అది పరిగణనలోకి తీసుకోకుండానే లైసెన్స్‌లు  

ప్రమాదాల వేళ క్షతగాత్రులకు వైద్యం అందడంలో జాప్యం  

లైసెన్స్‌లో బ్లడ్‌గ్రూప్‌ వివరాలుంటే సకాలంలో అందించే అవకాశం  

అదేం తప్పనిసరి కాదంటున్న ఆర్టీఏ   

సాక్షి, సిటీబ్యూరో: వందలకొద్దీ ప్రమాదాలు.. వేల సంఖ్యలో క్షతగాత్రులు. ఒక్క చిన్న లోపం కారణంగా సకాలంలో వైద్యం లభించక అనేక మంది మృత్యువాతపడుతున్నారు. వాహనదారుల డ్రైవింగ్‌ లైసెన్సులలో ఆధార్‌ నెంబర్‌తో పాటు వ్యక్తిగత వివరాలను పక్కాగా నమోదు చేసే రవాణాశాఖ  మరో ముఖ్యమైన అంశాన్ని మాత్రం విస్మరిస్తోంది. అదే బ్లడ్‌ గ్రూప్‌. ఈ ఒక్క అంశం డ్రైవింగ్‌ లైసెన్సుల్లో ప్రస్తావించకపోవడంతో ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సత్వరమే వైద్యం లభించడం లేదు. క్షతగాత్రుల రక్తనమూనా వివరాలు వైద్యులకు వెంటనే తెలుసుకొనే అవకాశం లేకపోవడంతో ప్రమాదాల్లో పెద్ద ఎత్తున రక్తస్రావమైన వారికి వెంటనే రక్తం ఎక్కించలేకపోతున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాల తీవ్రత, బాధితుల సంఖ్య పెరుగుతోందని రహదారి భద్రతా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన సుమారు 1209 రోడ్డు ప్రమాదాల్లో  1,221 మంది వరకు గాయపడ్డట్లు అధికారులు చెబుతున్నారు. 154 మంది మృత్యువాత పడ్డారు. సకాలంలో వైద్యసేవలు అందితే మృతుల సంఖ్య ఇంకా తగ్గేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు తీవ్ర రక్తస్రావానికి గురైన వారికి సకాలంలో వైద్యం లభించకపోవడంతో చివరకు కాళ్లు, చేతులు కోల్పోయి శాశ్వత వికలాంగులుగా మారుతున్నారు. ‘ఎక్కడో ఊరికి దూరంగా ప్రమాదం జరుగుతుంది. ఆ సమయంలో బంధువులు, తెలిసినవాళ్లు  ఎవ్వరూ ఉండరు. క్షతగాత్రులను పోలీసులు, 108 సిబ్బంది ఆసుపత్రుల్లో చేర్పిస్తారు. కానీ ఆ సమయంలో బాధితుల రక్త నమూనా తెలిస్తే తప్ప వైద్యం చేయలేం. అప్పటికే  గాయపడి రక్తస్రావమవుతున్నవాళ్లు, రక్త నమూనా తెలుసుకొనే వరకు మరింత రక్తాన్ని కోల్పోవాల్సి వస్తోంద’ని ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌  రామ్‌కమల్‌ ‘సాక్షి’తో చెప్పారు. మరోవైపు రహదారి భద్రతా రంగంలో పనిచేసే సంస్థలు సైతం ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి. ‘అనేక దేశాల్లో  వాహనదారుల పూర్తి వివరాలు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు కూడా డ్రైవింగ్‌ లైసెన్సుల్లో నమోదై ఉంటాయి. కానీ మన దగ్గర మాత్రం అది తప్పనిసరి కాకపోవడం  గమనార్హం’ అని ఇండియన్‌ రోడ్‌ సేఫ్టీ సంస్థ ప్రతినిధి వినోద్‌ కనుముల పేర్కొన్నారు. 

లైసెన్సుల జారీ ఇలా...  
గ్రేటర్‌లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ప్రతిరోజు 1000 నుంచి 1500 వరకు లెర్నింగ్‌ లైసెన్సులు, డ్రైవింగ్‌ లైసెన్సులు అందజేస్తారు. లైసెన్సులు తీసుకొనే అభ్యర్థులు మొదట ఆన్‌లైన్‌లో స్లాట్‌ నమోదు చేసుకోవాలి. ఈ స్లాట్‌ సమోదు సమయంలోనే అభ్యర్ధులు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, ఆధార్‌ నెంబర్, విద్యార్హతలు నమోదు చేయాలి. వీటిలో ఏ ఒక్కటీ నమోదు చేయకపోయినా స్లాట్‌ లభించదు. అన్ని వివరాలకు ప్రత్యేకంగా ఒక కాలమ్‌ కేటాయించినట్లుగానే బ్లడ్‌ గ్రూపు కోసం కూడా కేటాయించారు. కానీ అభ్యర్థులు తమ బ్లడ్‌ గ్రూపు వివరాలను నమోదు చేయకపోయినా సరే స్లాట్‌ లభిస్తుంది. మోటారు వాహన చట్టంలో బ్లడ్‌ గ్రూపు తప్పనిసరి అనే నిబంధన లేకపోవడంతోనే, దానిని ఒక ఆప్షన్‌గా ఉంచామని రవాణాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ‘బ్లడ్‌గ్రూపును తప్పనిసరి చేస్తే మంచిదే. కానీ అభ్యర్థులు నమోదు చేసిన వివరాలు సరైనవా కాదా తెలుసుకొనేందుకు డాక్టర్ల ధ్రువీకరణ అవసరం. ఇది చాలా పెద్ద పని. కేంద్ర మోటారు వాహన నిబంధనల్లో ఆ అంశం తప్పనిసరి అని లేకపోవడంతో పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని మరో అధికారి చెప్పారు.  

గవర్నర్‌ చెప్పినా...
డ్రైవింగ్‌ లైసెన్సుల్లో  బ్లడ్‌గ్రూపు తప్పనిసరిగా ప్రస్తావించకపోవడాన్ని గవర్నర్‌ నరసింహన్‌ గతంలోనే గుర్తించారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లో బ్లడ్‌ గ్రూపు ఉంటే మంచిదని సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు డాక్టర్లకు పని తేలికవుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఆర్టీఏ అధికారులు ఈ సలహాను సీరియస్‌గానే పరిగణించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు.

ఉంటే మంచిది...  
డ్రైవింగ్‌ లైసెన్సులో బ్లడ్‌ గ్రూపు ఉంటే  చాలా మంచిది. వెంటనే వైద్యం చేయగలుగుతాం. చాలామంది తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరుతారు. అలాంటి సమయంలో వెంటనే రక్తం ఎక్కించలేం కదా. పరీక్ష చేయాల్సిందే. అప్పటి వరకు పేషెంట్‌ మరింత నష్టపోవాల్సి వస్తుంది.– డాక్టర్‌ రామ్‌ కమల్, ఆర్థోపెడిక్‌ సర్జన్‌

తప్పనిసరి చేయాలి..  
స్లాట్‌ నమోదులో బ్లడ్‌గ్రూపు కోసం ఒక కాలమ్‌ ఉంచినప్పుడు దానిని తప్పనిసరి చేస్తే  మరింత బాగుండేది. నిజానికి డ్రైవింగ్‌ లైసెన్సు ఒక కీలకమైన ధ్రువీకరణ. దానిని ఎవరైనా, ఎప్పుడైనా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రామాణికంగా ధ్రువీకరించే వెసులుబాటు ఉండాలి.– వినోద్‌ , ఇండియన్‌ రోడ్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top