ఓట్లు ఎన్ని రకాలో!

Vote For Right Person Special Story - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరూ పేరు నమోదు చేసుకుంటే ఓటు హక్కు వస్తుంది. ఎన్నికలప్పుడు వారు పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేస్తారు. దీంతోపాటు మరి కొన్ని రకాల ఓట్లు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. వాటిలో చాలా మందికి ‘పోస్టల్‌ బ్యాలెట్‌’ గురించి మాత్రమే తెలుసు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, రక్షణ దళాల్లో ఉండే సిబ్బందికి ఈ పోస్టల్‌ బ్యాలెట్‌ ఇస్తారు. మరికొన్ని ఓట్లు లెక్కింపులోకి రానప్పటికీ వాటికీ ప్రత్యేకతలున్నాయి. ఆ ఓట్లు పలు సందర్భాల్లో అభ్యర్థి విజయంపై ప్రభావం చూపుతాయి. వాటిని ‘నమూనా ఓట్లు, టెండర్‌ ఓట్లు, చాలెంజ్‌ ఓట్లు, టెస్టు ఓట్లు’ అని అంటారు.   

టెస్ట్‌ ఓటు: ఓటరు తన ఓటు వేశాక తాను వేసిన ఓటు గుర్తు వీవీప్యాట్‌లోని స్లిప్‌లోని గుర్తు సరిగాలేదని నిర్ణయిస్తే పోలింగ్‌ ఆపించవచ్చు. అది ఎలా అంటే.. తన ఓటు తాను కోరుకున్న
అభ్యర్థికి పడనట్లుగా వీవీప్యాట్‌ స్లిప్పులో కనిపిస్తే మొదట ఫిర్యాదు చేయాలి. ప్రిసైడింగ్‌ అధికారి అతనితో మాట్లాడి.. తప్పుడు అభియోగం అయితే జరిగే పరిణామాలను హెచ్చరిస్తారు. ఓటరు నుంచి రాతపూర్వకంగా ఆమోదం తీసుకొని పోలింగ్‌ ఏజెంట్‌ ముందు ఓటింగ్‌ మిషన్‌లో టెస్ట్‌ ఓటు వేసేందుకు అనుమతి ఇస్తారు. మళ్లీ టెస్ట్‌ ఓటు వేసే సమయంలో ఓటరు కోరుకున్న అభ్యర్థి గుర్తు కాకుండా ఇతరుల గుర్తు వీవీ ప్యాట్‌ స్లిప్పులో కనిపిస్తే ఓటింగ్‌ నిలిపివేస్తారు. ఒకవేళ సదరు ఓటరు చేసిన ఆరోపణ తప్పుగా తేలితే  రెండో ఎంట్రీకి ఎదురుగా సంబంధిత ఓటరు ఏ అభ్యర్థి పక్షాన ఓటు వేసిందీ రాసి, అతడి సంతకం కాని వేలిముద్రను తీసుకుని పోలీసులకు అప్పగిస్తారు.  

నమూనా ఓటు : పోలింగ్‌ బూత్‌లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి గంట ముందు ఈవీఎం చెకింగ్‌ చేయడానికి వివిధ రాజకీయ పార్టీల పోలింగ్‌ ఏజెంట్లు 50 ఓట్లు వేస్తారు. అ ఓట్ల లెక్కింపు వెంటనే పూర్తి చేసి ఈవీఎంల నుంచి తొలగిస్తారు. అనంతరం అసలైన పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈవీఎంను చెకింగ్‌ చేయడానికి వేసే ఈ ఓట్లను నమూనా ఓట్లు అంటారు.  

టెండర్‌ ఓటు : ఓ వ్యక్తి ఓటు వేసేందుకు పోలింగ్‌ బూత్‌కు వెళ్లినప్పుడు అతని ఓటు అంతకు ముందే ఎవరైనా వేసి ఉంటే అప్పుడు అతడు ‘టెండర్‌ ఓటు’ వేయవచ్చు. ఆ వ్యక్తి నిజమైన ఓటరుగా నిర్ధారించుకున్నాకే అక్కడి పోలింగ్‌ అధికారి అతనికి బ్యాలెట్‌ ఇస్తాడు. ఇలాంటి వారికి ఈవీఎంలో బటన్‌ నొక్కే అవకాశం ఉండదు. అతడి బ్యాలెట్‌ను సీల్డ్‌ కవర్‌లో భద్రపరుస్తారు. ఒకవేళ ఆ నియోజకవర్గంలో అభ్యర్థుల ఓట్ల లెక్కింపు అనంతరం సమానంగా ఓట్లు వస్తే ఈ టెండర్‌ ఓటును పరిగణనలోకి తీసుకుంటారు.   
చాలెంజ్‌ ఓటు:  ఇది కూడా అతి ముఖ్యమైనదే. ఓటరు పోలింగ్‌ బూత్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న పోలింగ్‌ ఏజెంట్ల నుంచి అసలు ఇతను ఓటరు కాదని అభ్యంతరం చెబితే.. సదరు వ్యక్తి ‘చాలెంజ్‌ ఓటు’ వేయవచ్చు. అభ్యంతరం చెప్పిన ఏజెంట్‌ నుంచి పోలింగ్‌ అధికారి రూ.2 తీసుకొని రసీదు ఇస్తారు. ఓటరు, ఏజెంట్‌ అక్కడ ఉన్నత ఇతర ఓటర్ల నుంచి పోలింగ్‌ అధికారి వివరాలు తీసుకుంటారు. అసలైన ఓటరుగా నిర్ధారణ అయితే అతనికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అసలైన ఓటరుగా నిర్ధారణ కాకుంటే పోలీసులకు అప్పగిస్తారు. చాలెంజ్‌ ఓటు వేసిన వ్యక్తి  పేరు అతని చిరునామాను ‘ఫారం 14’లో నమోదు చేస్తారు.  

ఓట్‌..రైట్‌!
మన హక్కు ఓటు. సరైన వ్యక్తికి వేస్తేనే అది రైట్‌ అంటున్నారు నగరానికి చెందిన స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌ స్వాతి విజయ్‌. పోలింగ్‌ రోజున క్యూలో నుంచుని బాధ్యతగా ఓటేయడం అవసరం. అంతేకాదు.. మనం వేసే ఓటు సరైన వ్యక్తికి వేస్తున్నామా లేదా అనేది కూడా పూర్తి స్పష్టత ఉండాలి. అప్పుడే దానికి సార్థకత. లేదంటే  టాయిలెట్‌లోని కమోడ్‌లో వేసినట్టే అవుతుంది. ఇదే సందేశంతోగచ్చిబౌలిలోని ఓ గోడపై వీరు గీసిన చిత్రం ఆలోచింపజేసేదిగా ఉంది. ఓటర్లూ.. ఆలోచించండి మరి!

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top