వైరల్‌.. హడల్‌

Viral Fevers Case Files on Gandhi Hospital - Sakshi

వణికిస్తున్న విషజ్వరాలు  

ఆస్పత్రులకు బాధితుల క్యూ

ఫీవర్‌ ఆస్పత్రి ఓపీ రోజుకు 2వేల నుంచి 3వేలు  

‘గాంధీ’లో ఐదు రోజుల్లో 555 వైరల్‌ ఫీవర్‌ కేసులు నమోదు  

వీటిలో 121 డెంగీ పాజిటివ్‌

నల్లకుంట/గాంధీ: విషజ్వరాలు నగరవాసులను వణికిస్తున్నాయి. ఎప్పడూ లేని విధంగా నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో వైరల్‌ ఫీవర్‌ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రికి బాధితులు క్యూ కడుతుండడంతో రెండు వారాల క్రితం అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రోజుకు 2వేల నుంచి 3వేల మంది రోగులు వస్తున్నారు. అయితే ఆస్పత్రిలో 20 మంది వైద్యులే అందుబాటులో ఉండడంతో... ఒక్కో వైద్యుడు సగటున 120–150 మందిని చూడాల్సి వస్తోంది. దీంతో రోగులు గంటల తరబడి లైన్‌లో నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం స్పందించి అదనపు వైద్యులను ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు. మరోవైపు ల్యాబ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. రక్త పరీక్షల కోసం రోగులు బారులుతీరుతున్నారు. ఇక్కడ క్యూలైన్‌ పాటించకపోవడంతో ఒక్కోసారి తోపులాట జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.  

‘గాంధీ’లో డెంగీ డేంజర్‌  
సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో డెంగీ పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఐదు రోజుల్లో 555 విషజ్వరాల కేసులు నమోదు కాగా... వాటిలో 121 డెంగీ పాజిటివ్‌ కేసులు కావడం గమనార్హం. బాధితుల్లో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 11, 12 తేదీల్లో ఇద్దరు డెంగీతో మరణించగా... ఇప్పటి వరకు ఆరుగురు చిన్నారులు డెంగీతో మృతి చెందారు.  

నేలపైనే వైద్యం  
గాంధీకి రోగుల తాకిడి పెరగడంతో బెడ్స్‌ సరిపోవడం లేదు. దీంతో రోగులను వరండాలో నేలపైనే పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో స్ట్రెచర్లు, వీల్‌చైర్లపైనే వైద్యం అందించాల్సి వస్తోంది. 1,062 పడకలున్న ఆస్పత్రిలో సుమారు 3వేల మందికి వైద్యం అందించడం గమనార్హం. విషజ్వరాల బాధితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైరల్‌ ఫీవర్‌ వార్డు రోగులతో కిటకిటలాడుతోంది. ప్రభుత్వం స్పందించి రోగుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని బాధితులు కోరుతున్నారు.  

సంఖ్య పెరిగింది  
సీజనల్‌ వ్యాధులతో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధిచెందుతాయి. తాగునీరు కలుషితం కావడం వల్ల కూడా ప్రజలు రోగాల బారినపడుతున్నారు. అధికంగా జ్వరాలు, డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఎవరూ సొంతంగా వైద్యం చేసుకోకుండా వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.      – డాక్టర్‌ పద్మజ, ఫీవర్‌ సీఎస్‌ ఆర్‌ఎంఓ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top