చావాలనుకున్నా.. కానీ బతికా!
రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి, తానూ అందులోనే దూకి మృతి చెందాడని భావించిన తండ్రి అర్జున్ అనూహ్యంగా గురువారం సిద్దిపేట జిల్లా
♦ ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసి అదృశ్యమైన అర్జున్
♦ గాలిస్తుండగా.. సిద్దిపేట జిల్లా గౌరారంలో ప్రత్యక్షం
♦ కరెంట్ తీగలు పట్టుకొని ఆత్మహత్యాయత్నం
♦ తీవ్రగాయాలు.. ఆస్పత్రికి తరలింపు
వర్గల్/శామీర్‌పేట: రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట చెరువులో ఇద్దరు పిల్లలను తోసేసి, తానూ అందులోనే దూకి మృతి చెందాడని భావించిన తండ్రి అర్జున్ అనూహ్యంగా గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో ప్రత్యక్షమ య్యాడు. అయితే, సాయంత్రం మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ‘ఇద్దరు పిల్లలను చంపేసి తానూ చావాలనుకున్నా.. కానీ బతికా’అని అర్జున్ పేర్కొన్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా చేగూరు గ్రామానికి చెందిన కొయ్యాడ అర్జున్ (36) భార్యాపిల్లలతో కలసి సికింద్రాబాద్ రసూల్‌పుర కట్టమైసమ్మ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
మంగళవారం ఇద్దరు పిల్లలు పూజిత, ధనుశ్‌లకు ఈత నేర్పించేందుకు వెళుతున్నట్లు భార్యకు చెప్పి ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయల్దేరిన విషయం విదితమే. శామీర్‌పేట పోలీసులు అక్కడి పెద్దచెరువు కట్ట వద్ద లభించిన ఆధారాలు, ఫోన్ నంబర్ ద్వారా ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసి అర్జున్ అందులోనే దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు భావించారు. పిల్లల మృతదేహాలు పైకి తేలగా అర్జున్ ఆచూకి మాత్రం దొరకలేదు. చెరువులో అర్జున్ మృతదేహం దొరకకపోవడంతో బంధుమిత్రులు కృష్ణ, బాబురావు, శ్రీను, రవి తదితరులు సిద్దిపేట వైపు వెళ్లే మార్గంలో అతని కోసం వెతకడం ప్రారంభించారు.
ఈ క్రమంలో గురువారం సాయంత్రం వర్గల్ మండలం గౌరారం వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న హోటల్‌లో వారంతా టీ తాగేందుకు తమ వాహనాన్ని ఆపారు. అదే సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న అర్జున్ కన్పించాడు. వెంటనే అతన్ని హోటల్లోకి తీసుకొచ్చి నిలదీశారు. పిల్లలను చెరువులోకి తోసేసిన తాను చావాల నుకు న్నప్పటికీ బతికానని వారితో విలపిస్తూ చెప్పాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే టాయిలెట్‌కు వెళ్లొస్తానని వారితో చెప్పి హోటల్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ట్రాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకున్నాడు.
అతను వైర్లను తగలడంతోనే షాక్‌కు గురికాగా ఆ వెంటనే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటనే గమనించిన మిత్రులు అతన్ని గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత కొంపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు అతని సమీప బంధువులు తెలిపారు.


