‘వజ్ర’కు సెలవు!

TSRTC Says Bye To Vajra Bus Services - Sakshi

కనుమరుగు కానున్న ఏసీ మినీ బస్సులు

రెండున్నరేళ్లకే సర్వీసు ఉపసంహరణ

సీట్లు తొలగించి సరుకు రవాణా విభాగానికి బదిలీ

1,200 బస్సులతో ప్రత్యేకంగా గూడ్స్‌ విభాగం

సాక్షి, హైదరాబాద్‌: బస్టాండ్ల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కాలనీల్లోనే బస్సు ఎక్కే వసతి కల్పిస్తూ ప్రవేశపెట్టిన వజ్ర ఏసీ బస్సుకు ఆర్టీసీ టాటా చెప్పేసింది. వజ్ర సర్వీసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఏసీ వసతితో ఉండే ఈ మినీ బస్సులను ఇక సరుకు రవాణా బస్సులుగా మార్చాలని నిర్ణయించింది.

మరికొద్ది రోజుల్లో వాటి సేవలను నిలిపివేయనుంది. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు సదుద్దేశంతో ప్రారంభించిన ఆ సర్వీసులు కొన్ని లోపాల వల్ల ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదు. ఖాళీగా పరుగుపెడుతూ చివరకు రూ.12 కోట్ల మేర నష్టాలు మోసుకురావటంతో వాటిని వదిలించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతితో వజ్ర సర్వీసులను ఆర్టీసీ ఉపసంహరించుకుంటోంది.

సరుకు రవాణాకు.. 
ఆర్టీసీని నిర్వహించటం సాధ్యం కాదని దాదాపు తేల్చేసి ఆ తర్వాత మనసు మార్చుకుని సంస్థను కొనసాగించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇప్పుడు దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు సరుకు రవాణా సేవలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రైవేటు సంస్థతో కలసి పార్శిల్‌ సర్వీసును ఆర్టీసీ కొనసాగిస్తోంది. దాన్ని పూర్తిస్థాయి సరుకు రవాణాగా మార్చాలని సీఎం ఆదేశించారు. ఇందుకోసం తొలుత 1,200 బస్సులను సరుకు రవాణాకు కేటాయించాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించింది.

నగరంలో నష్టాలు మోసుకొస్తున్నాయన్న ఉద్దేశంతో వేయి సిటీ బస్సులను ఉపసంహరించుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ వేయి బస్సులను సరుకు రవాణా విభాగానికి మార్చాలని దాదాపు నిర్ణయించింది. వాటికి మరో 200 బస్సులను చేర్చనుంది. అందులో భాగంగా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న 58 వజ్ర ఏసీ బస్సులను కూడా వాటికే కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. వాటిల్లోని సీట్లను తొలగించి సరుకు రవాణాకు వీలుగా మార్చనున్నారు.

ప్రభుత్వ గోదాములకు అనుబంధంగా.. 
రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసేందుకు పెద్ద సంఖ్యలో గోదాములను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వీటిల్లోకి సరుకు తరలించేందుకు వందల సంఖ్యలో లారీలను వినియోగిస్తున్నారు. ఇవన్నీ ప్రైవేటు వాహనాలే. ఇప్పుడు ఈ సరుకు రవాణాలో ఆర్టీసీ బస్సు సేవలను తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత విభాగాలకు ఈమేరకు ఆదేశాలు అందనున్నాయి.

ప్రైవేటు వాహనాలు బుక్‌ చేసుకుంటున్నట్టుగానే ఆర్టీసీ సరుకు రవాణా బస్సులను కూడా బుక్‌ చేసుకోబోతున్నారు. ఈ రూపంలో ఆర్టీసీకి భారీగానే ఆదాయం వస్తుందని అంచనా. దీంతోపాటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా నేరుగా సంబంధిత డిపోలకు వెళ్లి సరుకు రవాణా బస్సులను బుక్‌ చేసుకోవచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన ధరలను నిర్ణయించనున్నారు.

వజ్ర స్వరూపం ఇది..
నగరం నుంచి ప్రధాన పట్టణాలకు కాలనీల మీదుగా నడిపేందుకు వజ్ర పేరుతో ఏసీ మినీ బస్సు సేవలను ఆర్టీసీ 2017 మే నెలలో ప్రారంభించింది. తొలుత 40, ఆ తర్వాత మరో 20 బస్సులు కొన్నారు. ముందుగా మెహిదీపట్నం, కుషాయిగూడ, మియాపూర్‌ డిపోలకు వీటిని కేటాయించారు. నగరం నుంచి వరంగల్, నిజామాబాద్‌కు ప్రారంభించారు. ఆ తర్వాత కరీంనగర్, గోదావరిఖనిలకు విస్తరించారు. కండక్టర్, టిమ్‌ యంత్రం లేకుండా నేరుగా ఆర్టీసీ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకునే విధానం ప్రవేశపెట్టారు.

కానీ దీన్ని జనం ఆదరించలేదు. బస్సుల నాణ్యత కూడా సరిగా లేదని, ప్రయాణం ఇబ్బందిగా ఉందని ఫిర్యాదులొచ్చాయి. బస్టాండ్లకు వెళ్లకపోవటం పెద్ద మైనస్‌గా మారింది. ఇక గరుడ బస్‌ కంటే దీని టికెట్‌ ధర ఎక్కువగా ఉండటం మరో ప్రధాన ఫిర్యాదు. సిటీ డిపోల నుంచి తొలగించి వరంగల్, నిజామాబాద్‌ డిపోలకు కేటాయించినా తీరు మారలేదు. శ్రీశైలం, యాదగిరిగుట్ట, కర్నూలు లాంటి ప్రాంతాలకు నడిపినా.. చివరకు డిపోలకు వెళ్లేలా చేసినా.. యాప్‌తో సంబంధం లేకుండా నేరుగా డ్రైవరే టికెట్‌ ఇచ్చినా జనం వాటిని పట్టించుకోలేదు.  వాటి రూపంలో రూ.12 కోట్ల మేర నష్టాలు రావడంతో వాటికి సెలవు చెప్పాల్సిన సమయం వచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top