టీఆర్‌ఎస్‌కు అభివృద్ధే ముఖ్యం | TRS Dive Development In Nizamabad | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు అభివృద్ధే ముఖ్యం

Mar 24 2019 2:46 PM | Updated on Mar 24 2019 2:47 PM

TRS Dive Development In Nizamabad - Sakshi

కమ్మర్‌పల్లిలో మాట్లాడుతున్న ఎంపీ కవిత 

కమ్మర్‌పల్లి(బాల్కొండ): టీఆర్‌ఎస్‌కు రాజకీయాలు అవసరం లేదని, కేవలం అభివృద్ధే కావాలనే లక్ష్యంగా ముందుకెళుతోందని నిజామాబాద్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 16 ఎంపీ స్థానాలు కట్టబెడితే, కేంద్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా మన ఎజెండానే అమలు అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో బీడీ కార్మికులకు ఇస్తున్న పింఛన్లు, అమలవుతున్న రైతుబంధు పథకం, అమలు కాబోతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పథకం కూడా దేశమంతా అమలు కావాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారన్నారు. శనివారం బాల్కొండ నియోజ కవర్గంతో పాటు జగిత్యాల జిల్లాలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమ్మర్‌పల్లి, హాసాకొత్తూర్, చౌట్‌పల్లి, బషీరాబాద్‌ గ్రామాల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన దీవెనలు, ఆశీర్వాదాలు ఏప్రిల్‌ 11న కురిపించాలని ఎంపీ కోరారు. బీడీల పరిశ్రమ, కార్మికుల సంక్షేమం కోసం ఏ పార్టీ ఆలోచన చేయలేదన్నారు. సీఎం కేసీఆర్‌ మంచి ఆలోచన చేసి బీడీ కార్మికులకు జీవన భృతితో న్యాయం చేశారన్నారు. తర్వాత వచ్చిన అత్తా కోడళ్ల పింఛన్‌ సమస్యను మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. పెంచిన పింఛన్లు మే 1న లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి, లేని వారికి న్యాయం చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని, ఐదేళ్లలో పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామన్నారు.

రాష్ట్రానికి ఏమి చేయాలన్నా గులాబీలే చేయాలి
రాష్ట్రానికి ఏమి చేయాలన్నా గల్లీ నుంచి ఢిల్లీ వరకు గులాబీ కండువా కప్పుకున్న వారే చేయాలని ఎంపీ కవిత అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ విడిపోయినపుడు ఢిల్లీ ఇచ్చిన వాగ్ధానాల నెరవేర్చడానికి టీఆర్‌ఎస్‌ ఎంపీలమంతా కొట్లాడారని తెలిపారు. హై కోర్టు విభజన, రైల్వేలైన్, ఎయిమ్స్, నేషనల్‌ హైవే ప్రాజెక్ట్‌లు రావాలనే ఆలోచనతో పార్లమెంట్‌లో ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డామన్నారు. దీనికి తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కలిసి రాలేదన్నారు.

అసత్య ప్రచారాలను నమ్మొద్దు
కాంగ్రెస్, బీజేపీలు పార్టీలు సోషల్‌ మీడియా వేదికగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలను ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు వాటిని నమ్మొద్దని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. రూ. 1000 ఇస్తున్న పింఛన్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.800 అని, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ. 200 అని ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.800 కాగా, కేంద్రం వాటా రూ. 200 ఉందన్నారు. ప్రజలు దీన్ని గమనించాలన్నారు. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో గెలవలేకనే దుష్ప్రచారం సాగిస్తున్నాయని ఆ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని కవిత పేర్కొన్నారు.

రాహుల్, మోదీలపై నామినేషన్లు వేస్తే మద్దతు ధర
బలం లేని కాంగ్రెస్, తిరగడానికి గల్లీలో ఎవరూ లేని బీజేపీ కలిసి తమ కార్యకర్తలను రైతులుగా చూపి తనపై నామినేషన్‌ వేయిస్తున్నాయని, నామీద వేస్తే ఎర్రజొన్న రైతుల సమస్యలు తీరితే అంతకుమించిన సంతోషం ఏదీ లేదని కవిత అన్నారు. తనపై నామినేషన్‌ వేయించే కంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అమేథి వెళ్లి రాహుల్‌పై, వారణాసి వెళ్లి మోదీపై వెయ్యి నామినేషన్లు వేయిస్తే ఎర్రజొన్నలకు జాతీయ స్థాయిలో మద్దతు ధర లభించే అవకాశం ఉందన్నారు. రైతులందరూ గమనించి ఎప్పుడైనా అండగా ఉండేది టీఆర్‌ఎస్‌ పార్టీనేనని గుర్తించాలన్నారు. ఎన్నికలైన వెంటనే బోనస్‌ వస్తుందన్నారు. ఇదివరకు టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చిన విధంగానే ఈ ఎన్నికల్లో కూడా మద్దతిచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

శక్తి మేరకు పనిచేశా.. మళ్లీ చేసి చూపిస్తా..

20 ఏళ్లలో పసుపు రైతులకు ఎవరూ చేయలేని పని తాను చేశానని, వారి కోసం తన శక్తి మేరకు కృషి చేశానన్నారు. మళ్లీ అవకాశమిస్తే దేశ అత్యున్నత సభలో గళం మరింత వినిపిస్తానన్నారు. పసుపు ఉడకబెట్టడానికి ఉపయోగించే బాయిలర్లలో 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement