అవి సహేతుక కారణాలు కావు

They are not rational reasons - Sakshi

స్వల్ప కారణాలతో తండ్రి నుంచి పిల్లలను దూరం చేయలేరు

ఒంటరిగా ఉండటం, హోటల్‌ ఆహారం తినిపించడం సాకుగా చూపొద్దు

ఓ తల్లి తీరును తప్పుబట్టిన హైకోర్టు.. కింది కోర్టు ఉత్తర్వులకు సమర్థన  

సాక్షి, హైదరాబాద్‌: స్వల్ప కారణాలతో పిల్లల సందర్శన, సంరక్షణ హక్కు నుంచి తండ్రిని దూరం చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒంటరిగా ఉండటం, సంరక్షణ సమయంలో పిల్లలకు హోటల్‌ ఆహారం తినిపిస్తుండటం వంటి కారణాలను సాకుగా చూపుతూ తండ్రి సందర్శన, సంరక్షణ నుంచి తన బిడ్డను వేరు చేయడానికి చూసిన ఓ తల్లి తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఈ కారణాలు ఎంత మాత్రం సహేతుకమైనవి కావని తేల్చి చెప్పింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఎ.శ్రీనివాస్‌ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. పాఠశాల సెలవు రోజుల్లో పిల్లలు తండ్రితో ఉండేందుకు అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ పిల్లల తల్లి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, సెలవు దినాల్లో పిల్లలతో గడపాల్సిన తండ్రి ఆఫీసుకు వెళుతున్నారని, అంతేకాక ఆయన ఒంటరిగా ఉంటున్నారని, పిల్లలకు హోటల్‌ నుంచి తెప్పించిన ఆహారాన్ని తినిపిస్తున్నారని తెలిపారు. దీనివల్ల పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందన్నారు. అయితే ధర్మాసనం ఈ వాదనలను తోసిపుచ్చింది. పిల్లల సంరక్షణ బాధ్యతలను శాశ్వతంగా తనకే అప్పగించాలన్న ఆ తండ్రి అభ్యర్థనను కింద కోర్టు తోసిపుచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

సెలవు రోజుల్లో పిల్లలతో గడిపేందుకు ఆ తండ్రికి కింది కోర్టు అనుమతినిచ్చిందని, పిల్లలు తల్లి, తండ్రి ప్రేమకు దూరం కాకూడదన్న ఉద్దేశంతోనే కింది కోర్టు అలా చేసిందని వివరించింది. హోటల్‌ ఆహారం తినడంవల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యారనేందుకు తల్లి ఎటువంటి ఆధారాలు చూపలేదని ధర్మాసనం తెలిపింది. తండ్రి తాను ఉద్యోగానికి వెళ్లినప్పుడు పిల్లల సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. ఇలాంటి స్వల్ప కారణాలను సాకుగా చూపుతూ తండ్రి నుంచి పిల్లలను వేరు చేయడానికి వీల్లేదంది. ఈ విషయంలో కింది కోర్టు ఉత్తర్వులు సబబేనని తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top