అడవికాసిన నిధులు

There is no funds and development to the tribal's - Sakshi

రాష్ట్రంలో అభివృద్ధికి నోచని ఐటీడీఏలు  

ఇచ్చే నిధులే తక్కువ.. అవీ సరిగా ఖర్చు చేయని వైనం

అక్కడ ఎవరికైనా జబ్బు చేస్తే డొల్లలు.. కావడే దిక్కు.. లేదా రోగిని మంచానికి కట్టుకొని ప్రధాన రహదారి వరకు మోసుకుంటూ వెళ్లాలి.. ఈలోపు పరిస్థితి విషమించితే ప్రాణాలు కోల్పోవాల్సిందే!ఆ గూడేల్లో ఎవరికైనా పురిటి నొప్పులొస్తే జీవన్మరణ సమస్యే.. అంబులెన్సులు అందుబాటులో ఉండవు.. ఉన్నా అవి వచ్చేందుకు రోడ్డు ఉండదు.. అష్టకష్టాలు పడి ఆసుపత్రికి వెళ్లినా డాక్టర్‌ ఉండడు.. నొప్పులతో ఆసుపత్రికి వెళ్తూ మార్గం మధ్యలోనే కన్నుమూసిన అభాగినులు ఎందరో..!!అభివృద్ధి పేరిట కోట్లకు కోట్లు నిధులు వెచ్చిస్తారు.. కానీ ఖర్చంతా కాగితాలకే పరిమితం.. రోడ్లు.. విద్యుత్‌.. విద్య.. వైద్యం.. తాగునీరు వంటి మౌలిక వసతులు ఇప్పటికీ గగనమే!!!  
 – సాక్షి నెట్‌వర్క్‌    

దట్టమైన అడవులు, కొండకోనల్లో నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్న గిరిజనుల అభివృద్ధి కోసం నెలకొల్పిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా గిరిజన ఆవాసాలు కనీస మౌలిక వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నాయి. ఐటీడీఏలు నెలకొల్పి మూడు దశాబ్దాలు పూర్తయినా గిరిజనుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్, జయశంకర్‌ జిల్లా ఏటూరునాగారం, భద్రాద్రి జిల్లా భద్రాచలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూర్‌లలో నాలుగు ఐటీడీఏలు ఉన్నాయి. వీటికి గ్రూప్‌–1 లేదా ఐఏఎస్‌ కేడర్‌ అధికారులను ప్రాజెక్టు అధికారి (పీవో)గా నియమించి వారి పర్యవేక్షణలో పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, ఇంజనీరింగ్, ఉద్యానవనం, ఇరిగేషన్, గిరిజన సహకార సంస్థ, పట్టుపరిశ్రమ, వ్యవ సాయం తదితర విభాగాలను ఏర్పాటు చేసి పథకాలు అమలు చేస్తు న్నారు. నిధుల లేమి, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, పాలకుల పట్టింపులేనితనం, అవినీతి అక్రమాలు వంటి కారణాలతో పథకాల ఫలాలు గిరిజనులకు పూర్తిస్థాయిలో దక్కడం లేదు. గిరిజనుల కష్టాలు, వారి ఆవాసాల్లో వసతుల లేమిపై ఈవారం ఫోకస్‌...    

అందని ద్రాక్షగా హక్కు పత్రాలు
అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం.. పోడు చేసుకుంటున్న గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలి. కానీ ఇది గిరిజనులకు అందని ద్రాక్షగానే మారింది. ఏటూరునాగారం ఐటీడీఏలో మొదటి దశ కింద 2010–11లో 14,016 మందికి 41,314.59 ఎకరాలకు హక్కు పత్రాలు జారీ చేశారు. వీఎస్‌ఎస్‌ కింద 134 మందికి 1,18,122 ఎకరాలకు పత్రాలు అందించారు. 
∙భద్రాచలం ఐటీడీఏలో 31,961 మంది గిరిజనులకు 2.10 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలు అందించారు. వైఎస్సార్‌ మరణం తర్వాత ఇప్పటివరకు 456 మంది గిరిజనులనే అర్హులుగా తేల్చారు. వారిలో ఇప్పటివరకు 265 మందికే పట్టాలను పంపిణీ చేశారు. ∙మన్ననూర్‌ ఐటీడీఏ పరిధిలో వైఎస్సార్‌ హయాంలో దాదాపు 2,630 కుటుంబాలకు 4,412 ఎకరాల భూమికి హక్కు పత్రాలు జారీ చేశారు. 2008–09లో 291 మంది గిరిజనులు 864 ఎకరాల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ హక్కు కల్పించలేదు. ఇంకా తండాల్లో 5 వేల కుటుంబాలు పోడు భూములు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. అటవీ అధికారులు దాడుల పేరిట వారి పంటలను నాశనం చేçస్తూ కేసులు పెడుతున్నారు. ∙ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలో 56,358 వేల మంది 2,25,569.82 ఎకరాల పోడు భూములపై హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 37,712 మందినే అర్హులుగా గుర్తించి 1,35,997.85 ఎకరాలకు హక్కు పత్రాలు అందించారు.

అటవీ ఉత్పత్తులకు ధర ఏది?
గిరిజనులు సేకరించే వివిధ రకాల అటవీ ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, వారి ఆర్థికాభి వృద్ధికి దోహదపడేందుకు ఏర్పాటు చేసిన గిరిజన సహ కార మార్కెటింగ్‌ సొసైటీ (జీసీసీ)లు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. మన్ననూర్‌ ఐటీడీఏ పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతం అటవీ ఉత్పత్తులకు పుట్టినిల్లు. ఈ ప్రాంత గిరిజనులు జిగురు, తేనె, కుంకుడుకాయలు, కరక్కాయలు, సుగంధ పాలవేర్లు, చీపుర్లు, విషముష్టి గింజలు, కానుగ పలుకు, చింతపండు, మైనం, నర్రమామిడి చెక్క, మారెడు గడ్డలు, జిల్ల గింజలు, సారెపప్పు, చింతగింజలు వంటి వివిధ రకాల అటవీ ఉత్పత్తులు సేకరిస్తున్నారు. ఉట్నూర్, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలో ఇప్పపువ్వు, తేనె, చీపుర్లు ఎక్కువగా సేకరిస్తుంటారు. కానీ వీటికి సరైన ధర రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కానరాని వైద్య సేవలు
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. ఐటీడీఏల ఆధ్వర్యంలో వైద్య విభాగం పనిచేస్తున్నా ఎక్కడా తగిన సౌకర్యాలు లేవు. డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు ఉన్నాయి. అయితే చాలాపోస్టులు ఖాళీగా ఉండడం, కొన్నిచోట్ల ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గిరిజనుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. కాంట్రాక్టు పద్ధతిన నియమితులైన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లను సైతం అద్దెకు నడుపుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పైపెచ్చు వాటిని వైద్య సేవలకు వాడినట్లుగా రికార్డులు సృష్టించి బిల్లులను తీసుకుంటున్నారు. ఏటూరు నాగారంలో గతంలో ఓ అంబులెన్స్‌ను ఇలాగే బయట అద్దెకు నడుపుతుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఉట్నూర్‌ ఐటీడీఏ పరిధిలో 3 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 32 పీహెచ్‌సీలు, 186 సబ్‌సెంటర్లు ఉన్నాయి. వాటిలో 795 పోస్టులకుగాను 150 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే వైద్య విధాన పరిషత్‌ అధీనంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో రెగ్యులర్‌ వైద్యాధికారులు లేక కాంట్రాక్ట్‌ ఎంబీబీఎస్‌లతో వైద్యం అందిస్తున్నారు. 16 అంబులెన్స్‌లు అరకొరగా సేవలందిస్తున్నాయి. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో నాలుగు ఏరియా వైద్యశాలలు, ఐదు సీహెచ్‌సీలు, 38 పీహెచ్‌సీలు, 340 ఉపకేంద్రాలు ఉన్నాయి. వాటిలో 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీలు 21 ఉన్నా.. ఒక్కదానికి కూడా అంబులెన్స్‌ సదుపాయం లేదు. 108 వాహనాలు 16, 104 వాహనాలు 15 ఉన్నా వాటి నిర్వహణ అధ్వానంగా ఉంది.

24 గంటల ఆస్పత్రి.. ఒక్కరే వైద్యాధికారి
ఇది భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని చర్ల మండలం సత్యనారాయణ పురంలో 24 గంటలపాటు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దీని పరిధిలో వాస్తవానికి ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, పీహెచ్‌ఎస్, హెచ్‌వీ, సూపర్‌వైజర్, ఏపీఎంఓ, డీపీఎంఓ, ఫార్మసిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌తోపాటు ఆస్పత్రి పరిధిలో ఉన్న ఆరు సబ్‌ సెంటర్లలో ఆరుగురు ఫస్ట్‌ ఏఎన్‌ఎంలు, మరో ఆరుగురు సెకండ్‌ ఏఎన్‌ఎంలు ఉండాలి. కానీ చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యాధికారులకు ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సబ్‌ సెంటర్ల పరిధిలో సెకండ్‌ ఏఎన్‌ఎంలే ఉన్నారు.

సారథుల్లేరు.. పోస్టులు ఖాళీ
- ఐటీడీఏల్లో ప్రాజెక్టు అధికారితోపాటు పలు కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఖాళీలు భర్తీ చేయకపోవడంతో కార్యకలాపాలు స్తంభించి పోతున్నాయి. రాష్ట్రంలో 4 ఐటీడీఏలు ఉంటే ఇందులో మూడింటికి ఇన్‌చార్జి పీవోలే కొనసాగు తుండడం గమనార్హం. ఉట్నూర్‌ ఐటీడీఏ పీవోగా ఉన్న ఐఏఎస్‌ అధికారి ఆర్‌వీ కర్ణన్‌ను కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లాకు కలెక్టర్‌గా నియమించారు. ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో బాధ్యతలనూ ఆయనకే అప్పగించారు. కలెక్టర్‌గా బిజీగా ఉండే కర్ణన్‌ ఐటీడీఏకు సమయం కేటాయించలేకపోతు న్నారు.
భద్రాచలం ఐటీడీఏలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ పీవోగా ఉన్న రాజీవ్‌గాంధీ హన్మంతును కొత్తగా ఏర్పడిన జిల్లాకు కలెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆయనే ఐటీడీఏ ఇన్‌చార్జి పీవోగా వ్యవహరిస్తున్నారు.
- మన్ననూర్‌ ఐటీడీఏ కూడా ఇన్‌చార్జి పీవోతో నడుస్తోంది. గ్రూప్‌–1 అధికారి అయిన మంగ్యానాయక్‌ డీటీడీవోగా బాధ్యతలు నిర్వహిస్తూనే పీవోగా వ్యవహరిస్తున్నారు. ఏటూరునాగారంలో మాత్రమే చక్రధర్‌రావు రెగ్యులర్‌ పీవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
​​​​​​​- ఐటీడీఏల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటూరునాగారం ఐటీడీఏ లో అన్ని విభాగాల్లో 1,532 పోస్టులు ఉండగా.. 1,127 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 408 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి.
​​​​​​​- భద్రాచలం ఐటీడీఏలో 152 పోస్టు లకు 42 ఖాళీలుగా ఉన్నాయి. పశు సంవర్థక శాఖ, పట్టు పరిశ్రమ, మత్స్యశాఖలను ఐటీడీఏ నుంచి తరలించారు. కొండరెడ్ల విభాగానికి అధికారి లేరు. జిల్లాల విభజన తర్వాత ఐటీడీఏకు నిధుల కొరత తీవ్రంగా ఉంది.  
​​​​​​​- ఉట్నూర్‌ ఐటీడీఏ ప్రధాన కార్యాలయంలో 107 పోస్టులుండగా 76 ఖాళీలున్నాయి. ​​​​​​​
-
మన్ననూర్‌ ఐటీడీఏ కార్యాలయంలో 20 పోస్టులకు 17 ఖాళీగానే ఉన్నాయి.

ఆర్థిక చేయూత ఏదీ?
గిరిజనులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రవేశపెట్టిన ‘ఎకనామికల్‌ సపోర్ట్‌ స్కీం’ (ఈఎస్‌ఎస్‌) వారిని ఏమాత్రం ఆదుకోవడం లేదు. ఈ పథకం కింద స్వయం ఉపాధి కోసం కిరాణాలు, జిరాక్స్‌ సెంటర్లు, టెంట్‌హౌజ్‌లు, ఫొటో స్టూడియోలు, బుక్‌స్టాళ్లు, చికెన్‌ సెంటర్, వాహనాలు ఇస్తుంటారు. రైతులకు దుక్కిటెద్దులు, మేకలు, గొర్రెల పెంపకం, పాడి గేదెల యూనిట్లు మంజూరు చేస్తారు. అలాగే ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ బోర్లు, కరెంట్‌ మోటార్లు, పైపులైన్లు అందజేస్తారు. ఏటా వందల సంఖ్యలో యూనిట్లు కేటాయిస్తున్నా.. వాటిలో సగం కూడా గ్రౌండింగ్‌ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్‌ పెడుతున్నారు. 

మత్స్య, పట్టు పరిశ్రమలు నిర్వీర్యం 
ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 14 గిరిజన మత్స్య సహకార సంఘాలున్నాయి. చేపల పెంపకం శిక్షణ కేంద్రం పదేళ్ల కిందట మూతపడింది. ట్రైకార్‌ యాక్షన్‌ ప్లాన్‌లో ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నా.. ఐటీడీఏ ఖర్చు చేయడం లేదు. పట్టు పరిశ్రమ విభాగం ప్రధాన కార్యాలయం చెన్నూరుకు తరలిపోయింది. ఏటూరునాగారంలో పట్టుగూళ్ల పెంపకం పూర్తిగా బంద్‌ అయ్యింది. మిగిలినచోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది.

రోడ్డు లేక ప్రాణాలు పోతున్నయ్‌
మా ఊరి రోడ్డులో రాజుగూడ వద్ద ఉన్న కల్వర్టు వానలకు కొట్టు కుపోయినప్పటి నుంచి దారిలేక ఇబ్బందులు పడుతున్నాం. మేలో ఐటీడీఏ ఎదుట ఆందోళన కూడా చేశాం. జూన్‌ 28న పెందోర్‌ సోంబాయి అనే గర్భిణికి పురుటి నొప్పులు వచ్చాయి. అంబులెన్సు లేక ఆమె ప్రాణాలు వదిలేసింది. ఆ ఘటన తర్వాత ప్రభుత్వం దొంగచింత, సోనాపూర్‌ గ్రామాల మధ్య రోడ్డు నిర్మించేందుకు రూ.89 లక్షలు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు.          
– కె. జుగాదిరావ్, దొంగచింత పటేల్, ఉట్నూర్‌ మండలం 

దశాబ్దాలుగా అభివృద్ధి శూన్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించిననాడే అభివృద్ధి సాధ్యం. ఐటీడీఏలు ఏర్పాటు చేసి ముప్పయ్యేళ్లు గడుస్తున్నా గిరిజనుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగానే ఉందంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది..
– జాదవ్‌ రమణనాయక్, ఎల్‌హెచ్‌పీఎస్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు

హక్కు పత్రాలు ఇచ్చినా దక్కని భూమి
ఈయన పేరు బొద్దిల సమ్మయ్య, ఏటూరునాగారం మండలం ఎక్కెల గ్రామం. ఈయనకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ కింద ఎకరం పది గుంటల స్థలం ఇచ్చారు. అటవీ హక్కుల చట్టం కింద హక్కుపత్రం అందజేశారు. ఇందులో ఇరవై గుంటల స్థలం అటవీశాఖ అధీనంలోనే ఉంది. భూసర్వే సక్రమంగా చేయకపోవడంతో ఇరవై గుంటలను కోల్పోవాల్సి వచ్చింది. చేసేదేమీలేక ఉన్న భూమినే సాగు చేసుకుంటున్నాడు.

సాగుకు సాయమేదీ?
ఏటూరు నాగారం పరిధిలో ఇంది ర జలప్రభ పథకం కింద 673 మంది రైతులు పొలాల్లో బోర్లు వేసుకున్నా విద్యుత్‌ మోటా ర్లు, త్రీఫేజ్‌ కరెంటు కనెక్షన్‌ ఇవ్వక నిరుపయోగంగా మారాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా తాడ్వాయి, మంగ పేట, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు, గోవిందరావుపేట మండలాలకు నాలుగేళ్ల కిందట రూ.55.45 కోట్లతో చెక్‌డ్యాం పనులు మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. భద్రా చలం ఐటీడీఏ పరిధిలోని మండలాల్లో  ఐటీడీఏ గిరిజనులకు  సబ్సిడీ విత్తనాలు ఇవ్వటం లేదు. 

​​​​​​​

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top