నానో టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు

నానో టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు - Sakshi


 ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియా ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్

 

- కేన్సర్‌ను సులభంగా గుర్తించే లేజర్ల అభివృద్ధి

- ముద్రించి వాడుకునేలా ‘సోలార్ సెల్స్’ టెక్నాలజీ

- వేగంగా సమాచార ప్రసారానికి తోడ్పాటు

 

 సాక్షి, హైదరాబాద్ : భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ నానో టెక్నాలజీ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురానుందని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెన్నుపాటి జగదీశ్ చెప్పారు. రెండు మూడు దశాబ్దాల క్రితం పరిచయమైన ఈ టెక్నాలజీ ఇప్పటికే కంప్యూటర్లు, సౌందర్య సాధనాలతోపాటు పలు ఇతర రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిపై జరుగుతున్న పరిశోధనలను గమనిస్తే.. భవిష్యత్తులో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరగడం ఖాయమని పేర్కొన్నారు.



ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో ఉన్న ఓ కుగ్రామంలో పుట్టిన జగదీశ్... ఖమ్మంలో ప్రాథమిక విద్య, ఢిల్లీలో స్నాతకోత్తర విద్య అభ్యసించారు. ఢిల్లీలోని శ్రీవెంకటేశ్వర కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. 26 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇటీవలే ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ అవార్డు కూడా అందుకున్నారు. ప్రస్తుతం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మరింత సహకారానికున్న అవకాశాలను పరిశీలించేందుకు ఇటీవలే భారత్‌కు వచ్చిన చెన్నుపాటి జగదీశ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..



 కేన్సర్‌ను గుర్తించే లేజర్లు

 ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీలో అతి సూక్ష్మమైన లేజర్లను తయారుచేసే ప్రయత్నాల్లో ఉన్నాం. దాదాపు 300 నానోమీటర్ల వెడల్పు, ఐదు మైక్రాన్ల పొడవు మాత్రమే ఉండే ఈ లేజర్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయంటే.. మూలకాల స్థాయిలో మార్పులను కూడా గుర్తించవచ్చు. అలాంటి లేజర్లు పూర్తిస్తాయిలో అందుబాటులోకి వస్తే కేన్సర్‌ను చాలా తొందరగా గుర్తించవచ్చు. తద్వారా మెరుగైన చికిత్స అందించడం వీలవుతుంది. అంతేకాదు ఈ నానోలేజర్లను చాలావేగంగా ఆన్/ఆఫ్ చేయవచ్చు. ఫలితంగా వీటిని మరింత వేగంగా పనిచేసే కంప్యూటర్ మైక్రో ప్రాసెసర్ల తయారీకి కూడా ఉపయోగించుకోవచ్చు.



 సెకన్లలో జీబీల్లో సమాచారం డౌన్‌లోడ్

 టెరాహెర్ట్జ్ తరంగాలను వాడడం ద్వారా భవిష్యత్తులో వైర్‌లెస్ కమ్యూనికేషన్ చాలా వేగంగా జరుగుతుంది. గిగాబైట్ల సమాచారాన్ని కూడా అతి తక్కువ సమయంలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు టెరాహెర్ట్జ్ పౌనఃపున్యాలను మరింత సమర్థమైన భద్రతా ఏర్పాట్లకు కూడా వాడుకోవచ్చు. విమానాశ్రయాల్లో ఎక్స్‌రేలకు బదులుగా వీటిని వాడడం ద్వారా ప్రమాదకరమైన వస్తువులు, పదార్థాలను గుర్తించడం సులువు అవుతుంది.



 విద్యార్థులకు అండగా..

 నా (జగదీశ్) చిన్నప్పుడు కిరోసిన్ దీపాల వెలుతురులో చదువుకున్నా. చదువుకోవాలని ఉన్నా తగిన అవకాశాలు ఉండేవి కావు. ఇలాంటి పరిస్థితి ఇతరులకు రాకూడదన్న ఉద్దేశంతో గతేడాది చెన్నుపాటి విద్య, జగదీశ్‌ల పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాం. అభివృద్ధి చెందుతున్న దేశాల విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు దాని ద్వారా సాయం అందిస్తున్నాం. ఐదు లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా ఈ ఏడాది నలుగురు భారత విద్యార్థులు కూడా స్కాలర్‌షిప్ అందుకున్నారు. ఒకొక్కరికీ ఆరు వేల ఆస్ట్రేలియన్ డాలర్ల సాయంతోపాటు అత్యున్నత స్థాయి పరిశోధనశాలల్లో పనిచేసేందుకు వారికి అవకాశం కల్పించాం.

 

 నానో టెక్నాలజీతో సౌర విద్యుత్

 నానో టెక్నాలజీ ద్వారా పూర్తిస్థాయి ఫలితాలు అందుకునేందుకు మరికొంత కాలం పట్టే అవకాశముంది. అయితే సౌరశక్తిని మరింత సమర్థంగా వాడుకునే విషయంలో ఎంతో ప్రగతి సాధించాం. భవనాల కిటికీలే సౌరశక్తిని గ్రహించి విద్యుత్‌గా మార్చేలా కొన్ని పరిశోధనలు చేస్తున్నాం. కార్బన్ నానోట్యూబ్‌ల సాయంతో కాగితంపై అక్షరాలను ముద్రించినట్లుగా.. సోలార్ సెల్స్‌ను కూడా ముద్రించి వాడుకునే సమయం దగ్గరలోనే ఉంది. సేంద్రియ పదార్థాలతో తయారయ్యే ఈ సోలార్ సెల్స్ సామర్థ్యాన్ని మెరుగైన స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 

 స్టార్టప్‌లపై దృష్టి పెట్టాలి

 భారత దేశంలో యువత ఏదో ఉద్యోగం కోసం చదవడం కాకుండా.. సొంతంగా తామే నలుగురికి ఉద్యోగం కల్పించేం దుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ప్రభుత్వాలు కూడా ఇందుకు తగ్గట్టు తగిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. అవకాశాలు కల్పించాలి. అమెరికాలో ఉన్న స్మాల్ బిజినెస్ రీసెర్చ్ ప్రోగ్రామ్‌లాంటివి అన్నిదేశాల్లో ఉండాలి. ఇతర రంగాల్లో అవకాశాలు తక్కువగా ఉండటం వల్ల చాలామంది విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వైపు మళ్లుతున్నప్పటికీ.. ఏదో ఒక కంపెనీకి పనిచేయడం కంటే, సొంతంగా కంపెనీ స్థాపిస్తే వచ్చే సంతృప్తి వేరన్నది యువత గుర్తించాలి. ఓడిపోతామన్న భయంతో చాలా మంది రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడరు. కానీ ఇవే విజయానికి మెట్లు. నేను కూడా ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాకే ఈ స్థాయికి చేరగలిగాను.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top