వైద్యుడు లేక తల్లీబిడ్డ బలి | Sakshi
Sakshi News home page

వైద్యుడు లేక తల్లీబిడ్డ బలి

Published Mon, May 8 2017 3:33 AM

The pregnant woman died due to neglect by the doctor

సాక్షి, కామారెడ్డి: ‘సర్కారు డాక్టర్‌’ నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. సకాలంలో వైద్యం అందక కడుపులోనే బిడ్డ మరణించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృత్యువాతపడింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన గర్భిణి బొల్లి రేణుకకు ఆదివారం పురుటి నొప్పులు వచ్చాయి. ఆమెను స్థానిక ఏఎన్‌ఎం అన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సాధారణ కాన్పు జరగకపోవడంతో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో సిజేరియన్‌ చేసే గైనకాలజిస్టులు అందుబాటులో లేరు.

దీంతో ఆస్పత్రి సిబ్బంది ప్రైవేటు వైద్యులను రప్పించి ఆపరేషన్‌ చేయించారు. ఈ క్రమంలో కొంత ఆలస్యం జరగడంతో కడుపులోనే బిడ్డ మరణించింది. తల్లి గర్భసంచి దెబ్బతిని ఉండటంతో తీవ్రరక్తస్రావం అయ్యింది. రక్తం ఎక్కించినా పరిస్థితి మెరుగుకాకపోవడంతో ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక మరణించింది. కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో గైనకాలజిస్టుల కొరత ఉంది. ఆదివారం కావడంతో ప్రత్యేక వైద్యులు కూడా అందుబాటులో లేరు. దీంతో సకాలంలో సరైన వైద్యం అందక తల్లీబిడ్డ మృత్యువాతపడ్డారు. ఆస్పత్రిలో వైద్య పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనన్న
అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

Advertisement
Advertisement