మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని ఆనందపూర్ శివారులో పిడుగుపాటుకు రైతు మేకల మల్లయ్య(40) మృత్యువాతపడ్డాడు.
భీమిని(బెల్లంపల్లి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని ఆనందపూర్ శివారులో పిడుగుపాటుకు రైతు మేకల మల్లయ్య(40) మృత్యువాతపడ్డాడు. వీగాం గ్రామానికి చెందిన మల్లయ్య అత్తగారి ఊరైన గొల్లగొడెంలో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. శుక్రవారం కలుపు తీయడానికి వెళ్లాడు. వర్షం రావడంతో కూలీలతో కలసి చెట్టు కిందికి వెళ్లాడు. ఆ చెట్టుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కన్నెపల్లి మండలంలోని దాంపూర్ గ్రామంలో అర్కం బొందయ్యకు చెందిన రెండు ఎద్దులపై శుక్రవారం పిడుగుపడి మృతి చెందాయి.
పిడుగు పాటుకు 39 మేకలు మృతి
రెబ్బెన (ఆసిఫాబాద్): కుమ్రం భీం జిల్లా రెబ్బెన మండలం నంబాలలో పిడుగుపడి 39 మేకలు శుక్రవారం మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన దుర్గం వెంకటి, శనిగరపు చంద్రయ్య, శనిగరపు పోషం, రామడుగుల లక్ష్మణ్, గాందర్ల బాపు, పూదరి బానేశ్‌లకు చెందిన మేకలను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా మేకలమంద మంగళి చెరువు సమీపంలో మందపై పిడుగుపడటంతో 39 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి.