తమ్ముళ్ల తకమిక..!

Telangana TDP president Revanth Reddy may join Congress? - Sakshi

రేవంత్‌రెడ్డితోపాటు వెళ్లాలా..?వద్దా..?

ఆయనకు టచ్‌లో ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు

కాంగ్రెస్‌లో చేరికపై అనుచరులతో మంతనాలు

 డోలాయమానంలో నియోజకవర్గాల నేతలు

సాక్షిప్రతినిధి, నల్లగొండ : టీడీపీ.. టీఆర్‌ఎస్‌తో పొత్తు సంకేతాలపై ఉమ్మడి జిల్లాలోని ఆ పార్టీ సీనియర్‌ నేతలు తర్జనభర్జన పడుతున్నారు. పొత్తుంటే తమ భవిష్యత్‌ ఏం కావా లంటూ ఎవరికివారు చర్చించుకుంటున్నారు. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని కలిశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. ఉమ్మడి జిల్లాలోని టీడీపీలో రాజకీయం వేడెక్కింది. ఎవరు పార్టీని వీడుతారు.. ఎవరు పార్టీలోనే ఉంటారని విశ్లేషణల్లో మునిగారు. టీఆర్‌ఎస్‌తో పొత్తును టీడీపీలోని ఓవర్గం సమర్థిస్తుండడంతో మరోవర్గం తమ దారి వెతుక్కుంటోంది. ఇదే జరిగితే భవిష్యత్‌లో రాష్ట్రంలో, ఉమ్మడి జిల్లాలో టీడీపీ దుకాణం బంద్‌ కావడం ఖాయమని భావిస్తున్న నేతలు రేవంత్‌రెడ్డి బాటలో పయనించేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రేవంత్‌రెడ్డి అనుచర నేతలు ఆయనతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణను నిర్దేశించుకున్న తర్వాతే కాంగ్రెస్‌లో చేరేందుకు జైకొట్టినట్లు తెలుస్తోంది.

 ఆయన అనుచర నేతల నిర్ణయం, టీడీపీ.. టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే పార్టీలో తమకు ప్రాధాన్యత ఉండదని భావించిన రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకే మొగ్గుచూపి హస్తినబాట పట్టారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే ఉమ్మడి జిల్లాలో ఆయన వెంట ఎవరు వెళ్తారన్నది రాజకీయంగా చర్చసాగుతోంది. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పటేల్‌ రమేశ్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నేత కంచర్ల భూపాల్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి అత్యంత అనుచర నేతలుగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని టీడీపీలోని వర్గపోరుతో మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి ,ఆమె తనయుడు సందీప్‌రెడ్డి కూడా రేవంత్‌రెడ్డితో పార్టీ మారే విషయమై చర్చించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌తో పొత్తు సంకేతాలు వెలువడిన తర్వాత ఉమామాధవరెడ్డి భువనగిరి నియోజకవర్గంలో టీడీపీ ముఖ్యనేతలు, అనుచరలతో కాంగ్రెస్‌లోకి వెళ్లే విషయమై ప్రాథమికంగా చర్చించారని ప్రచారం జరుగుతోంది. వీరు రేవంత్‌బాట పయనిస్తే.. తమ పరిస్థితి ఎట్లా..? అని మిగిలిన నియోజకవర్గాల్లోని నేతలు డోలాయమానంలో పడ్డారు.

ఎటూ తేల్చుకోలేక..
గత సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాల వారీగా కాంగ్రెస్‌ పార్టీని పరిశీలిస్తే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఆ పార్టీ బలంగా ఉంది. అయితే తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరితే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ నుంచి టిక్కెట్లు దక్కుతాయా..? అని రేవంత్‌రెడ్డి అనుచర నేతల్లో సంశయం నెలకొంది. మిగత జిల్లాల కన్నా ఇక్కడే టిక్కెట్లు ఆశించే నేతలు, కేడర్‌ ఎక్కువగా ఉండడంతో ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉండే వారికి టిక్కెట్లు ఇస్తారని.. ఇప్పుడు వచ్చినా తమకు ప్రయోజనం ఉంటుందా..? అని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటే టీడీపీ మనుగడ కష్టమని.. ఇది కాదని కాంగ్రెస్‌తో వెళ్తే తమ రాజకీయ స్వప్నం చెదురుతుందా..? అని ఎటూతేల్చుకోలేని స్థితిలో రేవంత్‌ అనుచర నేతలున్నారు. కమ్యూనిస్టులతో పాటు టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో కాంగ్రెస్‌ పైనే ఆ పార్టీ రాజకీయంగా పోరాటం చేసింది. ప్రస్తుత పరిస్థితులతో కాంగ్రెస్‌లోకి వెళ్తే గ్రామం నుంచి పట్టణం వరకు కేడర్‌ తమతో కలిసినడుస్తందా..? అని ఆ పార్టీ నాయకులు అంచనావేస్తున్నారు. కేడర్‌లో ఎక్కువ భాగం కాంగ్రెస్‌లో చేరాలని సమ్మతం తెలిపితేనే వెళ్లాలని, లేకపోతే అటుఇటు కాకుండా పోతామన్న సందిగ్ధంలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top