చదువు, పరీక్షలు మన ఇష్టం

Telangana Social Welfare Schools Society Launches New Concept For Teaching - Sakshi

 సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న స్కూళ్లు..

23 పాఠశాలల్లో ప్రయోగాత్మక అమలు

విద్యార్థుల అభీష్టాల మేరకే పాఠశాల నిర్వహణ

సక్సెసయితే రెండేళ్లలో అన్ని ఎస్సీ గురుకులాల్లోనూ..  

సాక్షి, హైదరాబాద్‌: ఫ్రీడం స్కూల్‌.. అక్కడ పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుండవు.. టీచర్లు గంటల తరబడి బ్లాకు బోర్డుపై బోధించే పద్ధతి కనిపించదు. బట్టీ పట్టే విధానం అస్సలుండదు. ఇదీ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) పాఠశాలల్లో తీసుకొచ్చిన సరికొత్త కాన్సెప్ట్‌. విద్యార్థులపై ఒత్తిడి లేని విధంగా బోధన, అభ్యసన సాగాలనే లక్ష్యంతో ఎస్సీ గురుకుల సొసైటీ సరికొత్తగా ‘ఫ్రీడం స్కూల్‌’విధానాన్ని తీసుకొచ్చింది. గురుకులం నిర్వహణంతా సొసైటీ ఆధ్వర్యంలోనే సాగినప్పటికీ.. ఇక్కడ నిర్వాహకులు, బోధకులు, పరీక్షల విధానం, కార్యాచరణ అంతా విద్యార్థుల అభీష్టం మేరకే నడుస్తుంది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడమే ఉపాధ్యాయుల పని. మిగతా కార్యక్రమాలన్నీ విద్యార్థుల ఆలోచనలు, సూచనల మేరకే నడుస్తాయి. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే అమల్లో ఉన్న ఈ విధానంపై పూర్తిగా అధ్యయనం చేసిన ఎస్సీ గురుకుల సొసైటీ.. రాష్ట్రంలో 23 గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. ఈ విధానం విజయవంతమైతే అన్ని గురుకుల పాఠశాలల్లో అమలు చేయాలని సొసైటీ భావిస్తోంది.

పెన్ను, పేపర్‌ లేని పరీక్షలు
సాధారణంగా బడికి వేళ్లే పిల్లలకు పాఠ్యాంశ పుస్తకాలుంటాయి. వీటి ప్రకారం నిర్దేశించిన తేదీల్లో బోధన చేపడతారు. ఆమేరకు అభ్యసన పూర్తి చేసిన విద్యార్థులకు నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. కానీ ఫ్రీడం స్కూల్‌ విధానంలో ఈ పద్ధతులేవీ కనిపించవు. ఒక్కో క్లాస్‌ 90 నిమిషాల పాటు ఉంటుంది. ప్రతి రోజూ 4 íపీరియడ్లు మాత్రమే ఉంటాయి. ప్రతి తరగతిలో 40 మంది విద్యార్థులుంటారు.

ప్రతి నలుగురు విద్యార్థులతో
ఒక బృందం చొప్పున క్లాస్‌రూముల్లో 10 బృందాలుంటాయి. ప్రతి బృందానికి ఒక లీడర్‌ ఉంటారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు బదులుగా మాడ్యూల్స్‌ ఉంటాయి. వీటిలోని అంశాలపై విద్యార్థులే పరస్పరం వేర్వేరుగా, బృందంగా చర్చలు జరపడం, లోతుగా పరిశోధించడం లాంటివి చేస్తారు. ప్రతి మాడ్యూల్‌లో అం శం, దాని తాలూకూ చరిత్ర ఉం టుంది. వీటిపై గ్రూప్‌ డిస్కర్షన్స్‌తో పాటు మాడ్యూల్‌లోని అంశాలపై స్కిట్లు రూపొందించడం, డిబేట్, క్విజ్‌ ఏర్పాటు చేయడం లాంటివి చేస్తారు. దీంతో ప్రతి అంశంపై విద్యార్థులకు లోతైన జ్ఞానం వస్తుంది. ఇక్కడి విద్యార్థులకు సాధారణ స్కూల్‌లో నిర్వహించే పరీక్షలుండవు. ఇక్కడ జరిగే పరీక్షల్లో విద్యార్థులు పెన్ను, పేపర్లను వినియోగించరు. స్కిట్స్, డిబేట్స్, క్విజ్, డ్రామా లాంటి అంశాలతోనే వారికి మార్కులు పడతాయి. బోధన, అభ్యసన అంశాలు, పరీక్షల నిర్వహణకు విద్యార్థుల ఆమోదం తప్పనిసరి. తరగతి గదిలో మెజార్టీ విద్యార్థుల అభిప్రాయం మేరకు ఆరోజు కార్యక్రమాలు సాగుతాయి.

ఈ స్కూళ్లు ఎక్కడెక్కడంటే..
రాష్ట్రవ్యాప్తంగా 23 గురుకుల పాఠశాలలను ఫ్రీడం స్కూల్‌ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. బోథ్, బెల్లంపల్లి, మంచిర్యాల, హయత్‌నగర్, సరూర్‌నగర్, కొందుర్గు, శంషాబాద్, ఆర్కేపురం, చేవెళ్ల, నార్సింగి, షేక్‌పేట్, చొప్పదండి, తిరుమలాయపాలెం, వెల్దండ, గద్వాల్, ఆర్‌.ఆర్‌.గూడెం, సిద్దిపేట్‌ రూరల్, ములుగు, చండూరు, వేల్పుర్, వరంగల్‌ ఈస్ట్, అడ్డగూడురు, చౌటుప్పల్‌ గురుకుల పాఠశాలల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల నిర్వహణపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తున్న సొసైటీ క్రమక్రమంగా వాటిని మెరుగుపర్చేందుకు సరికొత్త కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top