గూగుల్‌ గుప్పిట్లో డేంజర్‌ స్పాట్స్‌ | Telangana Police Department To Take Google Assistant For Control Road Accidents | Sakshi
Sakshi News home page

గూగుల్‌ గుప్పిట్లో డేంజర్‌ స్పాట్స్‌

Jan 21 2020 2:58 AM | Updated on Jan 21 2020 9:09 AM

Telangana Police Department To Take Google Assistant For Control Road Accidents - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదాలు, వాటిలో మృతుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి రాష్ట్ర పోలీసు విభాగం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. బ్లాక్‌స్పాట్‌లపై శాస్త్రీయ అధ్యయనం, ప్రమాదాలకు గల కారణాల గుర్తింపు, గోల్డెన్‌ అవర్‌లో వైద్య సేవలు అందించడం, అలర్ట్‌ల కోసం గూగుల్‌ మ్యాప్స్‌ వినియోగం వంటి చర్యలకు ఉపక్రమించింది. దీనికి ఉద్దేశించిన వెబ్‌ అప్లికేషన్‌ను గస్తీ బృందాలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది ఈ ఏడాది చివరి నాటికి గూగుల్‌ అలర్ట్‌ విధానం అమలు చేసేలా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తోంది. దీని కోసం డీజీపీ ఆఫీస్‌ కేంద్రంగా బృందం పనిచేస్తోంది. 

అందుబాటులోకి వెబ్‌ అప్లికేషన్‌..
ప్రస్తుతం రాష్ట్రంలో 3 రకాలైన గస్తీలు నడుస్తున్నాయి. ద్విచక్ర వాహనంపై సంచరించే బ్లూకోల్ట్స్, తేలికపాటి వాహనాలపై తిరిగే పెట్రో మొబైల్స్‌తోపాటు ఎన్‌హెచ్‌ లపై హైవే పెట్రోలింగ్‌ నడుస్తోంది. ఈ గస్తీ బృందాలు ప్రమాదాలు, మృతుల సంఖ్య నిరోధంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇప్పటికే ఈ సిబ్బంది దగ్గర ట్యాబ్‌లు.. అందులో పోలీసు అధికారిక యాప్‌ టీఎస్‌ కాప్‌ ఉన్నాయి. ఇందులో ఓ వెబ్‌ అప్లికేషన్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఏ ప్రాంతంలోనైనా ప్రమాదం జరిగినా సమాచారమంద గానే తొలుత చేరుకునేవి గస్తీ బృందాలే. ఈ టీమ్‌లు ప్రమాదస్థలికి చేరుకోగానే క్షతగాత్రుల తరలింపు, రోడ్‌ క్లియరెన్స్‌పై దృష్టి పెడతాయి. ఆ తర్వాత ఆ ప్రమాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వెబ్‌ అప్లికేషన్‌లో 26 అంశాలను పూరిస్తాయి. అక్కడి అక్షాంశ, రేఖాంశాల నుంచి రహదారి స్థితిగతుల వరకు నమోదు చేస్తాయి. ఎవరికి వారు వేర్వేరుగా కాకుండా అందరూ ఓ ప్రొఫార్మా ప్రకారం రికార్డు చేసేలా డీజీపీ కార్యాలయం చర్యలు తీసుకుంటోంది. 

క్లిష్టమైన ప్రాంతాలు సైతం గుర్తింపు..
ఈ గస్తీ బృందాలు తమ ట్యాబ్‌ల ద్వారా ప్రమాదం జరిగినప్పుడు దాని వివరాలను మాత్రమే కాదు.. ఆయా ప్రాంతాల్లో ఉన్న క్లిష్టమైన ప్రాంతాలను గుర్తిస్తారు. వీరు తమ పరిధుల్లో సంచరిస్తున్నప్పుడు ఓ రోడ్డు అధ్వానంగా ఉందనో, తరచు రద్దీగా ఉండే ప్రాంతమనో, హఠాత్తుగా పక్క రోడ్ల నుంచి వాహనాలు దూసుకొస్తాయనో, ప్రమాదకరమైన మలుపు ఉందనో, రహదారి హఠాత్తుగా సన్నగా మారుతుందనో గుర్తిస్తారు. ఈ వివరాలను టీఎస్‌కాప్‌ యాప్‌లోని వెబ్‌ అప్లికేషన్‌లో పొందుపరుస్తారు. ఈ ప్రాంతాలకు చెందిన అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జీపీఎస్‌ లొకేషన్‌ను నమోదు చేస్తారు. వెబ్‌ అప్లికేషన్‌లోని అంశాలు నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా డీజీపీ కార్యాలయానికి చేరతాయి. వీటిని అధ్యయనం చేసే ప్రత్యేక బృందం ప్రాథమికంగా పోలీసు ఆధీనంలోని మ్యాప్‌లోకి అప్‌లోడ్‌ చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీసుస్టేషన్ల నుంచి ఈ వివరాలు వచ్చిన తర్వాత సమగ్ర మ్యాప్‌ను గూగుల్‌తో అనుసంధానించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా చేస్తే ఓ రహదారిలో ప్రయాణిస్తున్న స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుడికి యాక్సిడెంట్‌ స్పాట్, ప్రమాదకరమైన మలుపు, రద్దీ ప్రాంతానికి చేరుకోవడానికి 500 మీటర్ల ముందే గూగుల్‌ నుంచి అలెర్ట్‌ వస్తుంది. ప్రస్తుతం రోడ్ల పక్కన బోర్డులు ఉన్నప్పటికీ అవి సక్రమంగా లేకపోవడం, వాహనచోదకుల దృష్టి పడకపోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గూగుల్‌ అలెర్ట్‌లు ఇప్పించడం ద్వారా అప్రమత్తం చేయించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది. 

గోల్డెన్‌ అవర్‌ పరిరక్షణ కోసం..
ఇలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు గోల్డెన్‌ అవర్‌గా పిలిచే తొలి గంటలో క్షతగాత్రుల్ని అంబులెన్స్‌ ద్వారా సంబంధిత ఆస్పత్రులకు తరలించగలిగితే మృతుల సంఖ్య గణనీయంగా తగ్గే ఆస్కారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న డీజీపీ కార్యాలయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంబులెన్స్‌లు, ఆస్పత్రుల వివరాలను జీపీఎస్‌ అంశాలతో సహా సేకరిస్తోంది. వీటిని ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చి టీఎస్‌ కాప్‌ యాప్‌కు అనుసంధానిస్తారు. ఫలితంగా గస్తీ సిబ్బంది ఓ యాక్సిడెంట్‌ స్పాట్‌కు వెళ్లినప్పుడు జీపీఎస్‌ ఆధారంగా దానికి సమీపంలో ఉన్న అంబులెన్స్‌లు, ఆస్పత్రుల వివరాలు కాంటాక్ట్‌ నంబర్లతో సహా అతడి ట్యాబ్‌లో పాప్‌అప్‌ ద్వారా తెలుస్తాయి.

న్యూరో, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్‌.. ఇలా ఆయా ఆస్పత్రుల్లో ఉండే ప్రత్యేకతల్ని కూడా టీఎస్‌ కాప్‌ యాప్‌ ద్వారా గస్తీ సిబ్బంది తెలుసుకునేలా చేస్తున్నారు. ఫలితంగా తక్షణం సమీపంలో ఉన్న అంబులెన్స్‌ వివరాలు తెలుసుకుని సంప్రదించడంతోపాటు క్షతగాత్రులకు అయిన గాయాలను బట్టి ఆయా వైద్య సేవలు అందించే ఆస్పత్రులకు తరలించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా గోల్డెన్‌ అవర్‌లో వైద్యం అంది మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement