మోగిన బడిగంట

Telangana Defers Reopening Of Schools - Sakshi

జనగామ: నూతన విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతూ విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టారు. బుధవారం బడిగంట మోగడంతో పుస్తకాల బ్యాగులు వీపున వేసుకుని హడావిడిగా స్కూళ్లకు బయలు దేరారు. జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల వద్ద విద్యార్థుల సందడి నెలకొంది. సెలవుల్లో తాము చేసిన అల్లరిని స్నేహితులతో పంచుకుంటూ తొలిరోజు పాఠశాలలో అడుగుపెట్టారు. ఉపాధ్యాయులకు గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ సరదాగా గడిపారు. పలువురు విద్యార్థులు కొత్తగా కొనుగోలు చేసిన సైకిళ్లపై పాఠశాలకు చేరుకోగా.. మరికొందరు తల్లిదండ్రులతో కలిసి వచ్చారు. ప్రభుత్వ పాఠశాలల వద్ద విద్యార్థులు శ్రమదానం చేపట్టి పాఠశాల ఆవరణతో పాటు తరగతి గదులను శుభ్రం చేసుకున్నారు. తరగతి గదుల్లోకి వస్తున్న స్నేహితులను విష్‌ చేస్తూ తొలిరోజు సరలదాగా గడిపారు.

జిల్లాలోని 12 మండలాల పరిధిలో ప్రభుత్వ ప్రైమరీ, ప్రాథమికోన్నత, ఉన్నత, ట్రైబల్, సాంఘిక, బీసీ సంక్షేమ, ఎయిడెడ్‌ పాఠశాలలు 571 ఉన్నాయి. వీటిలో ప్రైమరీ 349, ప్రాథమికోన్నత 71,  ఉన్నత పాఠశాలలు 151 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి 54 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. అనేక సమస్యలతో నూతన విద్యా సంవత్సరం స్వాగతం పలికింది. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగునీరు, వంటగదుల నిర్మాణం, టాయిలెట్స్‌ సమస్య విద్యార్థులను వెంటాడుతోంది. అయితే జిల్లాలోని ప్రతి పాఠశాలలో టాయిలెట్స్‌ ఉన్నప్పటికీ నిర్వహణ లేక సగం స్కూళ్లలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది.

ఉపాధ్యాయుల ఇంటిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య ఆదేశాల మేరకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నారు. తల్లిదండ్రులకు అవగాహన కలిగిస్తూ.. ప్రైవేటు కాదని ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరుతున్నారు. కాగా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు ప్రైవేటు స్కూళ్లకు పంపించబోమని పలువురు తల్లిదండ్రులు సర్కారు స్కూళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. 

రేపటి నుంచి బడిబాట
ఈ నెల14 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేటుకు వెళ్లే విద్యార్థులతో పాటు బడిబయట ఉన్న వారిని గుర్తిస్తారు. మన ఊరు–మనబడిబాట ద్వారా స్థానిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సర్పంచ్, వార్డు సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్లడం జరుగుంది. ఇంటింటికీ ప్రణాళిక రూపొందించుకుని, పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. పిల్లల ప్రవేశాలు, ఆధార్‌ కార్డుల సేకరణపై దృష్టి సారించనున్నారు. బడిమధ్యలో మానేసిన పిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారికి అవగాహన కలిగిస్తారు. బాలికలను కేజీవీబీలో చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top