‘ముందస్తు’ జోష్‌!

Telangana Assembly Elections Karimnagar Politics - Sakshi

ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ సన్నద్ధం కావడంతో విపక్షాలు సైతం సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఓట్లు సీట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ పావులు కదుపుతుండడంతో సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఓటు అనే ఆయుధంతో అధికార, విపక్ష పార్టీలకు తమ రుచి చూపించేందుకు జనం ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న కరీంనగర్‌లో గత ఎన్నికల్లో గులాబీ దళం పాగా వేసి ప్రజాబలం పెంచుకుంది. కాస్త బలహీనంగా ఉన్న విపక్షాలు ఏకమై పట్టు సాధించేందుకు సర్వసన్నద్ధమవుతున్నాయి. కారు రేసుకు బ్రేకులు వేసే పనిలో విపక్ష పార్టీల నేతలు నిమగ్నమయ్యారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు పార్లమెంట్, 13 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌ స్థానాలతోపాటు 12 అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాత్రమే కాంగ్రెస్‌ దక్కించుకుంది. మరో రెండు చోట్ల బీజేపీ రెండో స్థానానికి వచ్చి వెనుకబడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన 2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ మధ్య గట్టి పొటీ నెలకొన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యం అంటూ ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు. కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు మరింత చేరువై బలమైనశక్తిగా ఎదిగింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణే టీఆర్‌ఎస్‌ గెలుపునకు మార్గమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక విపక్ష పార్టీల నేతలు మాత్రం ఎన్నికల ముందు కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అరకొరగానే అమలు చేయడంతో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పక తప్పదని అంటున్నారు.

రాజకీయ పార్టీల మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఓట్లు సీట్లే లక్ష్యంగా పావులు కదుపుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే పనిలో అన్ని పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రజాబలం పెంచుకునేందుకు ఆరాటపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, వైఎస్‌ఆర్‌ సీపీ, తెలంగాణ జన సమితి, టీడీపీ, సీపీఐ, సీపీఎంతోపాటు చోటామోటా పలు పార్టీలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలు పోటీ చేసి తమ సత్తా చాటేపనిలో పడ్డాయి. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ నెలకొనే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌–టీడీపీ–సీపీఐలు ఏకమై ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరికొన్ని పార్టీలు ఐక్యకూటమిగా ఏర్పడి కారు రేసుకు బ్రేకులు వేస్తామనే ధీమాతో ఉన్నాయి.

అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్‌.. అదే పనిలో విపక్షాలు..
ముందుస్తు ఎన్నికల్లో సత్తాచాటడం అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మకం కాగా.. ఈసారి అభ్యర్థుల ఎంపి క సైతం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారనుం ది. తెలంగాణ రాష్ట్ర సమితి 13 నియోజకవర్గాలకు గాను 12 చోట్ల అభ్యర్థులను ప్రకటించినప్పటికీ అక్కడక్కడా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అయినా అభ్యర్థులను ప్రచారం చేసుకోమ్మని అధి ష్టానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. పొత్తులా? మహాకూటమా? తేల్చుకునే పనిలో విపక్షాలు ఉన్నాయి. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌ తదితర పార్టీలతో సమాలోచనలు చేస్తోంది. పొత్తులు, సర్దుబాట్లు కుదిరినా టీఆర్‌ఎస్‌తో పాటు మిగతా పార్టీలకు రెబల్స్‌ బెడద తప్పదంటున్నారు.

ఇదిలా వుంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి ‘ముందస్తు’ వ్యూహంతో సాగుతుంటే, కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల మంతనాలు కొలిక్కి రావాల్సి ఉం ది. పొత్తులో కొలిక్కి వస్తే ఉమ్మడి కరీంనగర్‌లో రెండు సీట్లు టీడీపీ, ఒకటి సీపీఐకి వదిలేయాల్సి ఉంటుంది. తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించేందుకు ఓ నిర్ణయానికి కూడా వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాగా.. బీజేపీ, వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం, ఎంఐఎంలు కూ డా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నద్ధం అవుతుం డటం.. విస్తృతస్థాయి సమావేశాలు, సమాలోచనలు చేస్తుండటంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. త్వరలోనే ఎన్నికల నిర్వహణ, నోటిఫికేషన్లపై తేలుస్తామని ఎన్నికల సంఘం ప్రకటిం చడంతో రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూ హం రూపొందించడంలో నిమగ్నమయ్యాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top