బతుకు జట్కా బండి | tanga workers special story | Sakshi
Sakshi News home page

బతుకు జట్కా బండి

Oct 4 2017 12:40 PM | Updated on Oct 4 2017 12:40 PM

tanga workers special story

సీఎం కేసీఆర్‌ సారు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు ఒక్కసారి మా టాంగా ఎక్కాలె.. మా కష్టాలు చెప్పుకుంటాం. గుట్టను బాగా అభివృద్ధి చేస్తున్న సీఎం.. మా టాంగా కార్మికులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకుని మాకు బతుకుదెరువు చూపాలె.   – యాదగిరిగుట్ట టాంగా కార్మికులు

అభివృద్ధి మాట ఎలా ఉన్నా రయ్యిరయ్యిమని తిరిగే బస్సులు, ఆటోల వల్ల మా ఉపాధి దెబ్బతిన్నది. యాదాద్రికి వచ్చే భక్తులు సరదాకైనా మా టాంగాలో ప్రయాణిస్తే మా కుటుంబాలు పస్తులుండే బాధ తప్పుతుంది. – టాంగా కార్మికులు

యాదాద్రి నుంచి యంబ నర్సింహులు : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యంలేని రోజుల్లో ప్రధాన రవాణా వ్యవస్థగా ఉన్న టాంగాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ వృత్తినే నమ్ముకున్న టాంగా కార్మికులు ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉన్నారు. టాంగాలో ఎక్కి ఒక్కసారైనా ప్రయాణం చేయాలని ఆశపడే కొందరు భక్తుల వల్ల కొద్దోగొప్పో ఉపాధి పొందుతున్నారు.  గుట్టకు పెరుగుతున్న భక్తుల రద్దీతో గిరాకీ పెరుగుతుందని భావించిన టాంగా కార్మికుల ఆశలు అడియాసలవుతున్నాయి. తరతరాలుగా టాంగాలనే నమ్ముకున్న వీరు మరో పనిచేయలేక కుటుంబాలను పోషించుకోవడానికి జవసత్వాలను కూడదీసుకుని బతుకు బండి లాగుతున్నారు. విశాలమైన రోడ్లు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు టాంగాల వృత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

ఇప్పటితరం ఇబ్బందులు..
తెలంగాణ తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నర్సింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు సుమారు 60 సంవత్సరాలు టాంగాలే ప్రధాన రవాణా సౌకర్యం. యాదగిరిగుట్టలో ఆర్టీసీ డిపోలేని రోజుల్లో.. హైదరాబాద్, వరంగల్‌ మధ్య గల రాయగిరి రైల్వే స్టేషన్‌లో దిగే వందలాది మంది భక్తులు స్వామి వారిని చేరుకోవాలంటే టాంగాలనే ఆశ్రయించే వారు. యాదగిరిగుట్ట బస్‌ డిపో ఏర్పాటు తర్వాత కూడా ప్రయాణికులు టాంగాల్లోనే ప్రయాణం చేశారు. రాయగిరి, యాదగిరిపల్లి, గుండ్లపల్లి, యాదగిరిగుట్ట, సైదాపురం, మల్లాపురం.. ఇలా చుట్టుపక్కల గ్రామాలకు చెందిన సుమారు 100 మంది టాంగాలను నడిపే  చాలా కుటుంబాల్లో రెండో తరమూ టాంగాలపైనే ఆధారపడింది.  

మా కష్టాలు తీరాలంటే సీఎం సారు
మా టాంగా ఎక్కాలి. ఏళ్ల నుంచి టాంగాలు నడుపుకుంటున్నా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. టాంగాలు, గుర్రాలు కొనుక్కోవడానికి బాకీలు ఇస్తే బాగుండు. సీఎం కేసీఆర్‌ సారు మా టాంగా ఎక్కితే మా కష్టాలు చెప్పుకుందుము.  – అంజయ్య, టాంగాల యూనియన్‌ అధ్యక్షుడు

చారాణా కిరాయి నుంచి టాంగా..
నా వయసు 65 ఏళ్లు. యాబై ఏళ్లుగా టాంగా కొడుతున్నా. రాయగిరి స్టేషన్‌ నుంచి గుట్ట వరకు మా నాయిన టాంగా కొట్టేవాడు. గుర్రాల్ని మేపుకుంట ఆడుకుంటున్న సమయంలో మా నాయనకు చేతకాకుండా అయింది. నేను 15 ఏళ్ల వయసులో టాంగా ఎక్కిన. అప్పట్ల టాంగా లో ప్రయాణిస్తే 25 పైసలు. రోజుకు రూ.10 నుంచి రూ.12 సంపాదించే వాడిని. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని బతికించుకున్నా. ఇప్పుడు చానా కష్టమైతున్నది.     – దూడల కృష్ణ, గుండ్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement