పొంచి ఉన్న ప్రాణాంతక నిమోనియా ..

Take Necessary Precautions Against Dangerous Pneumonia - Sakshi

     పడిపోయిన ఉష్ణోగ్రతలు  జాగ్రత్తలు తప్పనిసరి

     చిన్నారుల విషయంలో అప్రమత్తత అవసరం    

సాక్షి, ఆలేరు : చలిగాలుల తీవ్రత అధికమౌతుంది. దీంతో చిన్నారులతో సహా పెద్దలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు అస్తమయం కాకుండానే చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న ఈ మార్పులు చర్మ సంబంధ వ్యాధులను కలగచేస్తాయి. అరికాళ్లు, పెదవులు పగలడం, చర్మం తెల్లగా పొడిబారినట్టుగా మారిన లక్షణాలు కనిపిస్తాయి.  
పొంచి ఉన్న నిమోనియా ..
శీతాకాలంలో చిన్నారులకు ప్రాణాంతకమైన నిమోనియా వ్యాధి పొంచి ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా చిన్నారుల పాలిట ఈ వ్యాధి ప్రమాదకరంగా మారింది. మండలంలో ఇటీవల న్యుమోనియా కేసులు అక్కడ క్కడా నమోదవుతున్నాయి. ఇటీవల మండల పరిధిలో అనేక మంది చిన్నారులకు జలుబు, జ్వరం వచ్చి ఆస్పత్రిపాలు అయ్యారు. వైరస్‌ లేదా, బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. రోగ నిరోధక శక్తి, తక్కువగా ఉండే చిన్నారులను ఈ వ్యాధి వెంటాడుతుంది. మొదట జలుబుతో మొదలై దగ్గుతో చివరకు నిమోనియాగా మారుతుంది. న్యూమోనియా తీవ్రత పెరిగితే అస్తమా, ఫిడ్స్‌కు గురవుతారు. సూక్ష్మజీవుల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉండే పిల్లలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశముంది. పిల్లలకు తీవ్ర జ్వరం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, డొక్కలు ఎగరవేయడం, పెదాలు, చేతులు నీలం రంగులోకి మారడం తదితర వంటివి నిమోనియా లక్షణాలు. తేమశాతం తగ్గడం, పెరగడం వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహార నియమాలు పాటించకపోవడం కూడా నిమోనియా బారిన పడే అవకాశముందని వైద్యులు చెపుతున్నారు.  
అందుబాటులోకి పెంటావాలెంట్‌ వ్యాక్సిన్‌:
చిన్నారుల ప్రాణాంతక నిమోనియా బారిన పడకుండా పెంటావాలెంట్‌ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చారు. నిమోనియా కారణంగా ప్రపంచంలో ఇప్పటి వరకు 3.70 లక్షల మంది చిన్నారులు మరణించారని 2009లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్థారించింది. అప్పటి నుంచి వ్యాధి తీవ్రతను గుర్తించి దశల వారీగా అన్ని ప్రాంతాలకు ఈ టీకాలు సరఫరా చేస్తున్నారు. పెంటావాలెంట్‌ టీకాతో హిమోíఫిలస్‌ ఇన్‌ఫ్లూయెంజా టైప్‌ బీ (íß బ్‌) బ్యాక్టీరియా వలన కలిగే నిమోనియా పూర్తిగా తగ్గిస్తుంది. 
జాగ్రత్తలు తప్పనిసరి ..

  •  పిల్లలు బయట తిరగకుండా చూసుకోవాలి. 
  • కాలుష్యం, అపరిశుభ్రత, ఆహార కాలుష్యం, పౌష్టికాహారలోపం లేకుండా చూసుకోవాలి, 
  • నిద్ర సమయంలో గురక, ఎక్కువగా చాతి కదలడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
  • చల్లటి పదార్థాలు, చల్లటి నీరు తాగించవద్దు.
  • చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు అజాగ్రత్త వహించవద్దు.
  • గోరువెచ్చటి నీటిని చిన్నారులకు తాగించాలి
  • ఒకటి రెండు రోజుల్లో జలుబు, దగ్గు తగ్గకుంటే చిన్న పిల్లల వైద్యులను సంప్రదించాలి. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top