జమీన్‌.. జంగ్‌!

Tahsildar Murder Case: Accused Suresh Wife Talk Media - Sakshi

బాచారం భూ వివాదానికి 2004లోనే బీజం

సాక్షి, హైదరాబాద్‌/పెద్ద అంబర్‌పేట: ఆ భూమే వారికి జీవనాధారం. స్వేదం చిందిస్తూ, సేద్యం చేస్తూ హాయిగా జీవితం నెట్టుకొస్తున్న రైతాంగానికి ఆ భూమి తమది కాదని తెలియదు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూమిపై సర్వహక్కులు మావేననే ధీమా వారిలో కనిపించేది. వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ కొందరు రావడం.. ఈ భూమి మాది.. కౌలుదారులమని తేలి్చచెప్పడంతో పేద రైతుల గుండెల్లో పిడుగు పడినట్లయింది.

ఇలా అప్పటివరకు సాఫీగా సాగిన వారి వ్యవసాయం కాస్తా చిన్నాభిన్నమైంది. ఈ కథ అంతా ఎక్కడిదో కాదు.. రెండు రోజుల క్రితం అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ హత్యకు కారణంగా భావిస్తున్న భూ వివాదం గురించి. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం గ్రామంలోని ఈ భూవివాదానికి 2004 సంవత్సరంలోనే బీజం పడిందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు.  

భూ పోరాటానికి అంకురం
ఇక అప్పటి నుంచి మొదలైంది భూ పోరాటం. రైతులు, కౌలుదారుల మధ్య నెలకొన్న ఈ వివాదం రెవెన్యూ, కోర్టుల్లో కొనసాగుతూ వస్తోంది. ప్రతి చోటా రైతులకు వ్యతిరేకంగా, కౌలుదారులకు అనుకూలంగా తీర్పులు రావడంతో భూములు దక్కవేమోననే ఆందోళన రైతాంగంలో మొదలైంది. నగర శివారు కావడం, ఔటర్‌ రింగ్‌రోడ్డుకు అనుకుని ఉన్న ఈ భూమికి భారీగా డిమాండ్‌ ఉండడం కూడా గంపెడాశకు కారణమైంది. ఇదే సర్వేనంబర్‌లో పలువురికి పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు జారీ చేసిన రెవెన్యూ యంత్రాంగం.. వివాదాస్పద భూమి పేరిట కొందరికి ఇవ్వకుండా నిలిపివేసింది.

బాచారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 90 నుంచి 101 వరకు విస్తరించిన దాదాపుగా 412 ఎకరాలు గౌరెల్లి, బాచారం గ్రామాలకు చెందిన 53 మంది యాభై సంవత్సరాల నుంచి సాగుచేస్తున్నారు. వాస్తవానికి ఈ భూమి వంశపారంపర్యంగా వచి్చంది కాదు. ఇందులో 412 ఎకరాలు రాజానందరావుదికాగా, 1980 తర్వాత ఆయన మహారాష్ట్రకు వలస పోయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అప్పటికే పొజిషన్‌లో ఉన్న రైతులు సాదా బైనామా కింద రాజానందరావు నుంచి కొనుగోలు చేశామని, 1998లో 1–బీ రికార్డులో కూడా తమ పేర్లను నమోదు చేయడమేగాకుండా.. ఆర్‌ఓఆర్‌ ఇచ్చి పట్టా పాసుబుక్కులు కూడా ఇచ్చారని చెబుతున్నారు.

రైతుల గుండెల్లో కుదుపు
అప్పటివరకు భూములు సాగు చేసుకుంటున్న రైతాంగానికి 2004లో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఝలక్‌ ఇచ్చారు. సదరు సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల భూమిపై తమకు హక్కులున్నాయని కోర్టు మెట్లెక్కారు. ఊరు విడిచి ఎప్పుడో నగరానికి వలస వెళ్లిన వీరికి స్థానికంగా కొందరు రియల్టర్లు తోడయ్యారు. దీనికితోడు అప్పటి రెవెన్యూ అధికారులు కూడా సహకరించడంతో ఈ వ్యవహారం ముందుకు సాగింది. ఇదే అదనుగా బడాబాబులు.. భూమి తమ ఆ

దీనంలో లేకున్నా డాక్యుమెంట్ల ద్వారా విక్రయిస్తూ వచ్చారు. అప్పటివరకు కౌలుదారులు, రైతులకు మధ్య నడుస్తున్న వివాదాల్లో భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా రంగప్రవేశం చేయడంతో వివాదం కాస్తా మరింత క్లిష్టంగా తయారైంది. ఈ క్రమంలోనే 2016లో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ ఇచి్చన ఉత్తర్వుల మేరకు వివాదాస్పద 130 ఎకరాల భూమికి సంబంధించిన పాస్‌పుస్తకాలను కౌలుదారుల నుంచి కొనుగోలు చేసిన వారి పేరిట రెవెన్యూ అధికారులు జారీ చేశారు.

పహాణీల్లో కూడా నమోదు చేశారు. దీంతో జేసీ ఉత్తర్వులపై.. తహసీల్దార్‌ హత్య కేసులో నిందితుడైన సురేశ్‌ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించి స్టే పొందారు. ఈ క్రమంలోనే తమ ఆ«దీనంలో ఉన్న భూమికి పాసుపుస్తకాలు ఎందుకు ఇవ్వరంటూ తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న సురేశ్, పాస్‌ పుస్తకాలు రాకపోవడానికి తహసీల్దార్‌ విజయారెడ్డే కారణమని కక్ష పెంచుకొని ఈ దురాగతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ హత్య చేయడానికి సురేశ్‌ను కుటుంబసభ్యులు ఎవరైనా ఉసిగొల్పారా లేదా భూ మాఫియా ప్రేరేపించిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

ఎవరో ఉసిగొల్పారు
నా భర్త అమాయకుడు. భూమి ఎక్కడ ఉందో కూడా అతనికి తెలియదు. కూలీనాలి చేసుకుంటున్న ఆయన రెండు నెలలుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలోకి దిగి పూర్తిగా మారిపోయాడు. మాతో కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. ఏమీ తెలియని అమాయకుడు, అంతపెద్ద అధికారిణిని అలా చేశాడంటే నమ్మలేకపోతున్నాను. ఆయనను వెనుక ఉండి ఎవరో రెచ్చగొట్టారు. మేడం లాగే నాకూ పిల్లలు ఉన్నారు. సురేశ్‌ చేసింది తప్పే.

– లత, నిందితుడు సురేశ్‌ భార్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top