దగ్ధ పుత్రుడు

Woman Tahsildar burnt alive inside office in Abdullapurmet  - Sakshi

హటాత్తుగా అమానుష జ్వాలలు బుసలు కొట్టాయి. ‘అమ్మ’ చుట్టూ మంటలు. అమ్మ ఆక్రందనలు. ‘గురూ.. ఎక్కడా..’.. అమ్మ పిలుపు! అమ్మను అంటుకున్న మంటలపైకి గురునాథం ఎగబాకాడు. అమ్మను కాపాడే ప్రయత్నంలో తనూ దగ్ధమయ్యాడు. విజయారెడ్డి కారు డ్రైవర్‌ గురునాథం. అధికారిలా కాకుండా ‘అమ్మ’లా చూసింది అతడిని. ఆగ్రహావేశాలకు ఆహుతై అమ్మ అక్కడిక్కడ చనిపోతే.. గురునాథం ఆ మర్నాడు ఆసుపత్రిలో కన్ను మూశాడు. దగ్ధ పుత్రుడిలా మిగిలాడు!

తాసీల్దార్‌ విజయారెడ్డిది మనసును కలచివేసే ఘటన అయితే.. ఆమె డ్రైవర్‌ గురునాథం కుటుంబానిది మనిషి మనిషినీ కదిలిస్తున్న వ్యథ! గురునాథానిది సూర్యాపేట జిల్లా, వెల్దండ మండలం, గరుడపల్లి గ్రామం. తల్లిదండ్రులు బ్రహ్మయ్య, రమణమ్మ. కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరికి ముగ్గురూ కుమారులే. పెద్ద కుమారుడే గురునాథం. నానమ్మ పేరు గురువమ్మ. ఆమె పేరు కలిసి వచ్చేలా గురునాథం అని పెట్టారు. రెండేళ్ల క్రితమే నేరేడు చర్ల మండలం వైకుంఠాపురానికి చెందిన సాలమ్మ, అముర్తయ్యల చిన్న కూతురు సౌందర్యతో గురునాథానికి వివాహం జరిగింది.

గురునాథానికి కారు డ్రైవింగ్‌ వచ్చు. పదేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌ వెళ్లాడు. తొలి రెండేళ్లు ఎల్బీనగర్‌లో స్నేహితుల వద్ద ఉంటూ గ్యారేజీల్లో రోజు వారి వేతనం తీసుకొని కారు డ్రైవింగ్‌ చేశాడు. విజయారెడ్డి భర్తకు తెలిసిన వ్యక్తి గురునాథం కుటుంబానికి తెలుసు. ఆయన ద్వారానే గురునాథం విజయారెడ్డి వద్ద కారు డ్రైవర్‌గా కుదిరాడు. అలా ఎనిమిదేళ్లుగా ఆమె వద్దే పని చేస్తున్నాడు.

‘గురూ... ఎప్పుడొస్తావ్‌?’
గురునాథం విజయారెడ్డికి నమ్మకస్తుడిగా ఉండేవాడు. అతడి వివాహానికి విజయారెడ్డి.. భర్త, పిల్లలతో కలిసి వెల్దండకు వచ్చి వెళ్లారు కూడా. గురునాథం తల్లిదండ్రులను ఆమె పిన్ని, బాబాయి అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గురునాథానికి ఏ ఇబ్బంది రాకుండా తానే చూసుకుంటానని చెప్పేవారు. ‘‘మేడమ్‌.. నా కొడుకును తల్లిలా చూసేది. తను ఏం తింటున్నా  నా కొడుకుకూ పెట్టేది. గురునాథం ఒక్కరోజు ఊరికి వచ్చినా మేడమ్‌ ఫోన్‌ చేసేది. ‘‘గురు... హైదరాబాద్‌లో కారు తోలడం మాటలు కాదు.

నువ్వు ఉండాల్సిందే’’ అని మేడమ్‌ అంటే.. మేము వెంటనే గురునాథంను డ్యూటీకి తోలేవాళ్లం. నాకే ఫోన్‌ చేసి.. ‘బాబాయ్‌ గురును పంపించు’ అని చెప్పేది’’ అని గురునాథం తండ్రి బ్రహ్మయ్య కన్నీటిని దిగమింగుకుంటూ చెప్పాడు. ‘‘డబ్బులు అయినా, ఇంకే సహాయానికైనా అన్నింటికి గురునాథాన్ని మేడమ్‌  ఆదుకునేది. వాళ్లిద్దరూ తల్లీకొడుకుల్లా ఉండేవాళ్లు. అందుకే ఆ తల్లికి ఆ కొడుకు పాణం ఇవ్వాల్సి వచ్చిందేమో’’ అని వలవలమన్నాడు బ్రహ్మయ్య. దసరాకు భార్య, కొడుకుతో కలిసి వెల్దండకు వచ్చిండు.

ఒక్కరోజు ఉండి తెల్లారే మళ్లీ డ్యూటీకి హైద్రాబాద్‌ పోయిండు. మళ్లీ హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలకు గ్రామానికి వచ్చి ఓటేసి పోయిండు. వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల ఉన్న వారినందరినీ పలకరించేవాడు. గ్రామంలో స్నేహితులు, ఇంటి చుట్టు పక్కల ఉన్న వాళ్లంతా ‘గురు’ అని పిలిచేవారు. తన వద్ద ఏళ్లుగా నమ్మకంగా డ్రైవర్‌గా పని చేస్తుండడంతో విజయారెడ్డి మేడమ్‌ కూడా  ‘గురు’ అని అప్యాయంగా పిలిచేది’’ అని గుర్తు చేసుకున్నాడు బ్రహ్మయ్య

‘మా మేడమ్‌ని బతికించండి’
గురునాథం భార్య సౌందర్య మనో వేదన వర్ణనాతీతం. ఎవరూ ఆమె దుఃఖాన్ని పట్టలేకపోతున్నారు. ‘‘బాబుకు ఇప్పుడు ఏడాదిన్నర వయస్సు. సిద్దార్థ అని బావే పేరు పెట్టిండు. నాకు ఇప్పుడు ఎనిమిదో నెల. వాళ్లు ముగ్గురు అన్నదమ్ములు కావడంతో ‘మనకు అమ్మాయి పుట్టాలి’ అని బావ ఎప్పుడూ అంటుండేవాడు. మేము ఎల్బీనగర్‌ మన్సురాబాద్‌లో, మేడమ్‌ వాళ్లు కొత్తపేటలో ఉంటారు. ఉదయం తొమ్మిదిన్నరకు డ్యూటీకి వెళ్తే రాత్రి తొమ్మిది గంటల తర్వాతే ఇంటికి వచ్చేవాడు. మేడమ్‌ గృహ ప్రవేశానికి మేము వెళ్లితే మంచిగా చూసుకుంది.

బాబు పుట్టిన రోజు మార్చి 15న మా ఇంటికి మేడమ్‌ వచ్చింది. బావ కూడా మేడమ్‌ మంచిదని, మనకు ఏ ఇబ్బంది లేకుండా మేడమ్‌ చూసుకుంటుంది అని చెప్పేవాడు. సోమవారం ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిండు. మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి ఒకరు ఫోన్‌ చేసి.. ‘మేడమ్‌ కాలిపోయింది, మీ ఆయన కూడా కాలిపోయాడు’ అని నాకు చెప్పిండ్రు. నేను ఇంటి దగ్గర ఉన్న ఒకళ్లను తీసుకొని ఆస్పత్రికి పోయా. బావ కాలిపోయి బెడ్‌పై ఉండేసరికి  చూడలేకపోయా. తను కాలిపోతూ కూడా ‘మా మేడమ్‌ను బతికించండి’ అని అరిచాడట’’ అని సౌందర్య బోరుమంది.

‘‘డ్యూటీకి వెళ్తే మేడమ్‌ పెట్టిందే బావ తినేవాడు. బాబు కోసం వాళ్ల నాయినమ్మ నెయ్యి పంపితే.. ఆ నెయ్యి బాగుంటుందో ఉండదోనని.. ‘గురు మా అమ్మవాళ్లు నెయ్యి పంపారు. మా పిల్లలకు అదే పెడుతున్నా. మీ బాబుకు తీసుకపో’ అని మేడమ్‌ నెయ్యి పంపించింది. అంత మంచిగా గురునాథంను మేడమ్‌ చూసుకుంది’’ అని సౌందర్య ఒక్కో సంగతినీ గుర్తు చేసుకుంటోంది. గురునాథం కుటుంబ సభ్యుల కన్నీటి మంటలు ఇప్పట్లో ఆరేలా లేవు.
బొల్లం శ్రీనివాస్, సాక్షి, సూర్యాపేట
ఫొటోలు : అనమాల యాకయ్య

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top