ఆసుపత్రిపై కమాండ్‌ & కంట్రోల్‌

Surveillance was Increasing for Hospitals - Sakshi

వైద్య ఆరోగ్య శాఖలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ.. పీహెచ్‌సీ నుంచి అన్ని ప్రభుత్వాసుపత్రులతో అనుసంధానం

కోఠిలోని కమిషనర్‌ కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు.. మందుల నుంచి వైద్య సేవల వరకు పర్యవేక్షణ.. నిఘా పెంపు 

సాక్షి, హైదరాబాద్‌: పోలీస్‌శాఖలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా శాంతిభద్రతలను ఎలాపర్య వేక్షిస్తున్నారో అలాగే వైద్యఆరోగ్యశాఖలోనూ ఏర్పాటు చేయాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు ఏరియా ఆసుపత్రి, సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ), జిల్లా ఆసుపత్రి, బోధనాసు పత్రి ఇలా అన్ని రకాల ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల కు అందుతున్న సేవలన్నింటిపైనా నిరంతర పర్య వేక్షణకు ఈ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఈటల రాజేం దర్‌ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే బయోమెట్రిక్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాల ని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు మంగళవారం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థపైనా సూత్ర ప్రాయ నిర్ణయం తీసుకున్నారు.

ఆసుపత్రులు ఎన్నింటికి తెరుస్తున్నారు? సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా? డాక్టర్లు ఎన్ని గంటలకు వస్తున్నారు? రోగులు ఎంత సేపటి నుంచి వేచి చూస్తున్నారు? రోగుల పట్ల వైద్య సిబ్బంది తీరు ఎలా ఉంటుందో మొత్తం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా వీక్షించవచ్చు. అందుకోసం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిఘా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. వాటినన్నింటినీ హైదరాబాద్‌ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసే కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. అవసరమైతే సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాంబర్‌లోనూ ఈ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీ లిస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందించాలన్నదే ఉద్దేశమని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. 

మందుల ట్రాకింగ్‌...
రాష్ట్రంలో 900 పైగా పీహెచ్‌సీలున్నాయి. 31 జిల్లా ఆసుపత్రులున్నాయి. ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ బోధనాసు పత్రులున్నాయి. ఏజెన్సీ ఏరియా ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మొదలుపెడితే హైదరాబాద్‌ గాంధీ, ఉస్మానియా బోధనాసుపత్రి వరకు మొత్తం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులనూ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకు అనుసంధానం చేస్తారు. వైద్య ఆరోగ్యశాఖలోని జిల్లా, రాష్ట్రస్థాయి పరిపాలనా వ్యవస్థలనూ అనుసంధానం చేసే వీలుం ది. ఉదాహరణకు హైదరాబాద్‌ నీలోఫర్‌లో చిన్న పిల్లలకు పడకలు లేక అనేక సందర్భాల్లో ఆరుబయట ఉంచడం, కింద పడుకోబెట్టడం వంటివి జరుగుతున్నాయి.

ఇలాంటి వాటిపై పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేసే పరిస్థితి ఉండటం లేదు. కానీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా  చూసి తక్షణమే సంబంధిత వైద్యాధికారితో పరి స్థితిని చక్కదిద్దుతారు. డ్రగ్‌ కంట్రోల్‌ కేంద్రాల నుంచి ఏఏ మందులు ఎన్నె న్ని ఆసుపత్రులకు వెళ్తున్నాయో కూడా జీపీఎస్‌  ద్వారా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థకూ అనుసంధా నం చేస్తారు. ఎక్కడికైనా తరలి వెళుతున్నాయా? నిర్దేశిత ఆసుపత్రికే వెళుతున్నాయా? వెళితే ఎంతెంత వెళుతున్నాయో కూడా ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.

ఇక ఇండెంట్‌ ప్రకారమే మందులు వెళుతున్నాయా లేదో కూడా చూస్తారు. ఆస్పత్రుల్లో రోగులకు అవసరమైన మందులున్నాయా అని రోజూ ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు. ఇటీవల నాంపల్లి యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అనంతరం వేసిన ట్రెమడాల్‌ మాత్ర వికటించి ఇద్దరు పిల్లలు చనిపోయిన నేపథ్యంలో అనవసర మాత్రలు ఉన్నాయా అన్నది కూడా పరిశీలిస్తారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ ద్వారా రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సేవలు అందాలన్నదే ఉద్దేశమని ఒక ఉన్నతాధికారి తెలిపారు. 

ఉన్నతాధికారిపై సర్కార్‌ సీరియస్‌
లక్ష్యం మేరకు వైద్య ఆరోగ్యశాఖలోని ఒక ఉన్నతాధికారి సరిగా పనిచేయక పోవడంతో సర్కారు సీరియస్‌గా ఉంది. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్‌ నిర్వ హించిన సమీక్షలోనూ ఆ అధికారి వ్యవహార శైలిపై సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే మనస్తాపానికి గురై ఆ అధికారి సెలవుపై వెళ్లినట్లు వైద్య ఆరోగ్య శాఖలో చర్చ జరుగుతోంది. ప్రధానంగా కేసీఆర్‌ కిట్‌ అమలు తీరులో సరిగా వ్యవహ రించకపోవడం, ఇప్పటికీ చాలాచోట్ల కిట్‌ సొమ్ము అం దకపోవడం, నాంపల్లి యూపీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అనం తరం వేసిన ట్రెమడాల్‌ మాత్ర వికటించిన ఘటనలో ఇద్దరు పసి పిల్లలు చనిపోవడం తదితర అంశాలపై ఆ అధికారి వ్యవహరించిన తీరుపట్ల సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలి సింది. పైగా ఉద్యోగులతోనూ కఠినంగా ఉంటున్నారని, కొందరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించడం వంటి అంశాలూ కూడా ఈ పరిస్థితికి కారణమని తెలి సింది. అయితే ఆ అధికారి పేషీకి సంబంధించిన సిబ్బంది మాత్రం వేసవి సెలవులకు వెళ్లారని చెబుతున్నారు. ఉన్నతస్థాయి వర్గాలు మాత్రం దీనిపై స్పందించడంలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top