మంత్రులు, ఎమ్మెల్యేలు గాలికబుర్లు మాని ప్రజలు, రైతు సమస్యలపై దృష్టిసారించాలని బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి హితవుపలికారు.
బీజేపీ నేత నాగం హితవు
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: మంత్రులు, ఎమ్మెల్యేలు గాలికబుర్లు మాని ప్రజలు, రైతు సమస్యలపై దృష్టిసారించాలని బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యుడు నాగం జనార్ధన్‌రెడ్డి హితవుపలికారు. నిర్ధిష్టమైన ప్రణాళిక, ఆలోచనలు లేకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని సూచించారు.
బుధవారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ప్రాజెక్టులపై సీఎం, మంత్రి హరీష్‌రావులు చిన్నచూపు చూస్తూ ద్రోహం చేస్తున్నారని నాగం మండిపడ్డారు. కులాలు, మతాలకు బిల్డింగ్‌లు నిర్మిస్తే సమస్యలు తొలగిపోతాయా? అని ప్రశ్నించారు. జిల్లాలో పంటలు ఎండిపోతుంటే కనీసం కరువు మండలాలను ప్రకటించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వం పనులు చేయకుండా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తుందన్నారు. రైతుల రుణమాఫీ, మొక్కజొన్న, మద్దతు ధర కల్పించకుండా ప్రభుత్వం రైతుల నడ్డివిరుస్తోందని ప్రభుత్వ నిర్లక్ష్యంతో బంగారు తెలంగాణ నిర్మించలేరన్నారు.
వాజ్‌పేయి, మదన్‌మోహన్ మాలావ్యలకు భారతరత్న కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ నేత రావుల రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల గోస సీఎం కేసీఆర్‌కు పట్టడం లేదన్నారు. జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. సమస్యలను పట్టించుకోని ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య, నింగిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగపాండురెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.