అమ్మకు తప్పని ప్రసవవేదన

Staff Shortage in Government Hospitals - Sakshi

కేసీఆర్‌ కిట్‌తో ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులకు పెరిగిన ఓపీ

సిబ్బంది కొరతతో అడ్మిట్‌ చేసుకునేందుకు నిరాకరిస్తున్న వైద్యులు

సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు ప్రసవవేదన తప్పడం లేదు. నెలలు నిండిన గర్భిణులకు ప్రసవాలు చేసేందుకు అవసరమైన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రోగుల నిష్పత్తికి తగినన్ని పడకలు, మౌలిక సదుపాయాలు, అల్ట్రాసౌండ్‌ మిషన్లు, థైరాయిడ్, హెచ్‌ఐవీ టెస్టులకు సంబంధించిన వైద్య పరికరాలు ఏర్పాటు చేయకపోవడంతో అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రికి చేరుకుంటున్న నిరుపేద గర్భిణులకు  ఇక్కడ చేదు అనుభవమే ఎదురవుతోంది.  మహబూబ్‌నగర్‌ అచ్చంపేట్‌ మండలం అమ్రాబాద్‌కు చెందిన చెంచు మణెమ్మ (33) నెలలు నిండటంతో ప్రసవం కోసం ఇటీవల సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చి ంది. ఆమె వద్ద నెలవారీ వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు లేకపోవడంతో చేర్చుకునేందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. తిరుగు ప్రయాణంలో ఆమెకు నొప్పులు రావడంతో ఇమ్లీబన్‌ బస్‌స్టేషన్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌ కిట్‌తో 40 శాతం పెరిగిన రద్దీ
కేసీఆర్‌ కిట్‌ను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు అమ్మ ఒడి కేసీఆర్‌ కిట్‌ పథకం కింద రూ.11.50 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో పది లక్షలకు పైగా గర్భిణులు ఉండగా, 1.42 లక్షల మంది తల్లులున్నారు. ఇప్పటి వరకు 6.70 లక్షల ప్రసవాలు నమోదయ్యాయి. 3.37 లక్షల కిట్లను పంపిణీ చేశారు. ఇనిస్టిట్యూషనల్‌ డెలివరీలకు ప్రభుత్వం పలు రకాల ప్రోత్సాహకాలు అందజేస్తుండటంతో ఆయా ఆస్పత్రుల్లో అవుట్‌ పేషంట్లతో పాటు ఇన్‌పేషెంట్ల సంఖ్య గతంతో పోలిస్తే 40 శాతం పెరిగింది. అయితే ఈ రోగుల నిష్పత్తికి తగినట్టు పడకల సంఖ్యను పెంచలేదు. 

ఖాళీలను భర్తీ చేయక పోవడం వల్లే..  
గ్రేటర్‌ పరిధిలో సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులు, గాంధీ, నిలోఫర్‌ బోధనాసుపత్రులతో పాటు కింగ్‌ కోఠి, మలక్‌పేట్, గోల్కొండ, వనస్థలిపురం, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రుల్లోనూ ప్రసవాలు జరుగుతున్నాయి. గ్రేటర్‌లో రోజుకు సగటున 700 నుంచి 750 ప్రసవాలు జరుగుతుండగా, వీటిలో అత్యధికం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. రోగుల నిష్పత్తికి తగినట్లుగా ఎప్పటికప్పుడు ఆయా ఆస్పత్రుల్లో పడకల సంఖ్యతో పాటు ఆల్ట్రా సౌండ్‌ మిషన్లు, లేబర్‌రూంలను పెంచాల్సిన అవసరం ఉంది. అంతే కాదు ఖాళీగా ఉన్న పారామెడికల్‌ స్టాఫ్, నర్సింగ్‌ స్టాఫ్‌ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం కొత్త నియామకాలు ఇప్పటి వరకు చేపట్టకపోవడంతో ఉన్న సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారి నుంచి అప్పటికప్పుడు నమూనాలు సేకరించి, రిపోర్టులు జారీ చేయడం కష్టంగా మారుతోంది. ప్రసవానికి ముందు కనీస రిపోర్టులు లేకపోవడంతో వైద్యులు కూడా చికిత్స అందించేందుకు నిరాకరించాల్సి వస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top