గంభీరావుపేటలో స్వచ్ఛంద ‘లాక్‌డౌన్‌’

Special Lockdown For Three Days In Gambhiraopet At Rajanna Sircilla - Sakshi

వ్యాపారాల నిర్వహణ బంద్‌

నిర్మానుష్యంగా మారిన రహదారులు

గంభీరావుపేట(సిరిసిల్ల): కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మండలకేంద్రంలోని ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర దుకాణాలు బంద్‌ చేసి లాక్‌డౌన్‌లో పాల్గొంటున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండడంతో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం నుంచి బుధవారం వరకు లాన్‌డౌన్‌ అమలు చేయనున్నారు. మండలకేంద్రం కావడంతో చాలా మంది వివిధ పనుల నిమిత్తం నిత్యం గంభీరావుపేటకు వచ్చి వెళ్తుంటారు. కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రైమరీ కాంటాక్టుల ద్వారా వైరస్‌ ప్రబలే అవకాశం ఉందని పలువురు భయాందోళనకు గురవుతున్నారు.

ఇటీవల గంభీరావుపేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రాగా.. అందులో ఒక మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో వైరస్‌ ప్రబలకుండా ఉండేందుకు ఏం చేయాలన్న విషయమై సర్పంచ్‌ కటకం శ్రీధర్‌ పంతులు గ్రామస్తులు, అధికారులతో చర్చించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. ‘మనకు మనమే లాక్‌డౌన్‌ విధించుకుందాం’ అనే ఆలోచనను ఆచరణలో పెట్టారు. సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చారు. వణికిస్తున్న మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులు తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. (అమ్మా.. అనే పిలుపుకు నోచుకోకుండానే..)

స్వీయ రక్షణే శ్రీరామరక్ష
స్వీయ రక్షణతోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వానాకాలం ప్రారంభమైంది. అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కరోనా వైరస్‌ విజృంభించేందుకు అనుకూల సమయమిది. ఆపై కోవిడ్‌–19 మరింత భయపెడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిబంధనలు పాటించకపోయినా కరోనా వైరస్‌ మనల్ని చుట్టేయడం ఖాయం. (కరోనా 2.0 పంజా!)

అసలే వానాకాలం..
సాధారణంగానే వానాకాలం అంటే వ్యాధుల సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. కరోనాకు సైతం ఇవే లక్షణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది జలుబు, దగ్గు వస్తే భయపడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి తుమ్ము, దగ్గు వచ్చినా మిగతా వారు వణికిపోతున్నారు.

బేఖాతర్‌ చేస్తే..
లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో చాలామంది కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. కొందరు కనీసం మాస్క్‌లు కూడా ధరించడం లేదు. భౌతిక దూరం కానరావడం లేదు. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో ఇవే అధికంగా ఉన్నాయి.

జిల్లాలో..కరోనా కేసులు 22
జిల్లాలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వేములవాడకు చెందిన ఒక్కరితో కరోనా మొదలైంది. ఆ తర్వాత ముంబయి, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి వలసజీవులు రావడంతో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 22 పాజిటివ్‌ కేసులు న మోదయ్యాయి. 1,798మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. గంభీరావుపేటలో ఒక కరోనా మరణం నమోదైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top