
స్పేస్‌వీక్ ప్రదర్శనను వీక్షిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): ఇటీవల కాలంలో పేపర్లు, టీవీల్లో మార్మోగిన చంద్రయాన్–2 ప్రయోగం, శ్రీహరికోట ద్వారా ప్రయోగించిన రాకెట్లు, సాటిలైట్స్ వంటి అబ్బురపర్చే ప్రదర్శనలు వీక్షిస్తే ఇస్రో ఇందూరుకు దిగొచ్చినట్లు అన్పిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో నాసాకు తలదన్నే రీతిలో ప్రయోగాలను ఆవిష్కరిస్తూ ఇస్రో ముందుకు సాగుతోంది. రానున్నరోజుల్లో చంద్రయాన్–3, గగన్‌యాన్ వంటి ప్రయోగాలకు సిద్ధమౌతోంది. అటువంటి నూతన ఆవిష్కరణకు నిలయంగా మారిన ఇస్రో ఆధ్వర్యంలో నగరంలోని నిర్మల హృదయ స్కూల్‌లో స్పేస్ వీక్ కార్యక్రమంలో ప్రదర్శనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అబ్బురపరుస్తున్నాయి. స్పేస్ వీక్‌లో ప్రదర్శనలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, డీఈవో దుర్గాప్రసాద్ శనివారం సందర్శించారు. ప్రదర్శనల గురించి వీరికి ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. నగరంలో మొదటిసారిగా ప్రదర్శనను ఏర్పాటు చేయడంతో రెండ్రోజుల్లో సుమారు 10 వేల మంది విద్యార్థులు రాకెట్లు, ఉపగ్రహాలను తిలకించారు.
45 ప్రయోగాల ప్రదర్శనలు
స్పేక్ వీక్ కార్యక్రమంలో భాగంగా మొత్తం 45 ప్రదర్శనలు ఉంచారు. దేశంలో ఇప్పటివరకు చేపట్టిన ఆవిష్కరణలను విజ్ఞాన సదస్సులో ప్రదర్శించారు. ప్రపంచం మెచ్చుకునేలా భారత శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారని, ఇలాంటి ప్రదర్శనల ద్వారా యువ శాస్త్రవేత్తలకు అవకాశం లభిస్తుంది. ఎన్నో ఆవిష్కరణలతోపాటు విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ఇక్కడి నుంచి ప్రయోగించి విజయవంతం చేసిన తీరును విద్యార్థులకు వివరించారు. ముఖ్యంగా రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలను ప్రదర్శనలో ఉంచడంతో వాటి గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపారు. అంతేగాకుండా చంద్రయాన్–2, పీఎస్‌ల్వీ, జీఎస్‌ఎల్వీ, తదితర ఉపగ్రహాలు, రాకెట్ల తయారీ, వాటి పనితీరు, తదితర అంశాల గురించి విద్యార్థులు వలంటీర్లను అడిగి తెలుసుకున్నారు.
నేడు ముగింపు కార్యక్రమం
నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో కొనసాగుతున్న స్పేస్ వీక్ కార్యక్రమం ఆదివారంతో ముగియనుంది. మధ్యాహ్నం వరకు మాత్రమే ప్రదర్శనలను తిలకించే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్, ఎగ్జిబిట్స్‌లను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జాన్ శాంసన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.