‘రైతుబంధు’తో సామాజిక ఆర్థిక భద్రత 

Social finance security with Rythu Bandhu - Sakshi

ఐరాస వేదికగా వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉద్ఘాటన 

సాక్షి, హైదరాబాద్‌: రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాయని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. రోమ్‌లో శుక్రవారం ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏవో) నిర్వహించిన ‘వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సింపోజియంలో పార్థసారథి ప్యానల్‌ స్పీకర్‌ హోదాలో మాట్లాడారు. తెలంగాణ నాలుగున్నరేళ్ల క్రితం ఏర్పాటైన కొత్త రాష్ట్రమని, వర్షాభావ పరిస్థితులతో నిరంతరం కరువు కాటకాలతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కువమంది సన్న,చిన్నకారు రైతులేనని, ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు.  

అప్పులకు పోకుండా నిరోధించాం
రైతుబంధు పథకం ద్వారా రైతులు ప్రైవేటు అప్పులకు పోకుండా నిరోధించగలిగామని పార్థసారథి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేస్తున్నామని, ఈ మొత్తం వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 51 లక్షలమంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా రూ.5,200 కోట్లు ఇచ్చామన్నారు. మరోవైపు రైతు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని సర్కారు తీసుకొచ్చిందని పార్థసారథి తెలిపారు. ఇప్పటివరకు రైతుబీమా కింద లబ్ధిపొందిన వారిలో 90% సన్న,చిన్నకారు రైతులేనని స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు పది రోజుల్లోగా రూ.5 లక్షలు బీమా పరిహారం ఆ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top