రాష్ట్ర వ్యవసాయ పథకాలు ఆదర్శం

SK Joshi Praised Telangana State Programmes - Sakshi

మిషన్‌ కాకతీయ, రైతుబంధు అందరి దృష్టిని ఆకర్షించాయి 

వర్షాధారిత ప్రాంత అథారిటీ సీఈఓ డాక్టర్‌ అశోక్‌దళ్వాయ్‌  

హైదరాబాద్‌ : వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ వర్షాధారిత ప్రాంత అథారిటీ (నేషనల్‌ రెయిన్‌ ఫెడ్‌ ఏరియా అథారిటీ) సీఈఓ డాక్టర్‌ అశోక్‌దళ్వాయ్‌ అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ‘రిమాండేటింగ్‌ అగ్రికల్చర్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇట్స్‌ ఫార్మర్స్‌’అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల మరమ్మతులతో భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు.

రైతులకు పెట్టు బడి కోసం ఎకరాకు రూ.4వేలు ఇచ్చే రైతుబంధు పథకంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న కార్యక్రమాలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో ఎదురయ్యే సవాళ్లకు ఆధునికశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే సరైన పరిష్కారాన్ని చూపగలవన్నారు. ఉద్యాన పంటల ఉత్పత్తిలో మిగతా దేశాలతో పొలిస్తే మనం అగ్రగామిగా ఉన్నప్పటికీ రైతుల ఆదాయం పెరగకపోవడం అందరినీ నిరుత్సాహపరుస్తోందన్నారు.  

సంప్రదాయ పరిష్కారాలు అవసరం: సీఎస్‌ జోషి 
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి మాట్లాడుతూ.. భారత వ్యవసాయ రంగానికి సంప్రదాయ పరిష్కారాలు అవసరమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సాగు ఖర్చులు తగ్గించి, ఉత్పాదకత పెంపుపై దృష్టి నిలపాలన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో 30.29 లక్షల మంది రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడం, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబీకులకు అందించే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంపు, 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్‌ అందించడం, కోటి ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టులను చేపట్టామన్నారు.

పంటల పెట్టుబడి కోసం ప్రతీ సీజన్‌లో ఎకరాకు రూ.4 వేల వంతున 49.4 లక్షల మంది రైతులకు రూ.5011 కోట్లు అందించామన్నారు. రైతులను పంటమార్పిడి వైపు శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని సూచించారు. యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఏడుగురు ఆదర్శ రైతులకు ఉత్తమ రైతు అవార్డులను అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, వ్యవసాయ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు బంగారు పతకాలు, మెరిట్‌ సర్టిఫికెట్లను అందజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రచురించిన పలు పుస్తకాలు, సంచికలను విడుదల చేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కె.కోటేశ్వరరావు, పీజీ స్టడీస్‌ డీన్‌ మీనాకుమారి పాల్గొన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top