హైదరాబాద్‌ గాలి తిరిగింది!

Significantly Improved Air Quality In Hyderabad - Sakshi

గణనీయంగా మెరుగుపడిన వాయు నాణ్యత

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో కూడా..

630 అకాల మరణాల నివారణ.. 690 మిలియన్‌ డాలర్ల వైద్యఖర్చు ఆదా

‘గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ క్లీన్‌ ఎయిర్‌ రీసెర్చ్‌’ అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సహా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో వాయుకాలుష్యం తగ్గడం వల్ల 630 అకాల మరణాల (ప్రిమెచ్యూర్‌ డెత్స్‌) నివారణతో పాటు 690 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల మేర వైద్యసేవల ఖర్చు ఆదా అయినట్టు బ్రిటన్‌ సర్రే వర్సిటీ ‘గ్లోబల్‌ సెంటర్‌ ఫర్‌ క్లీన్‌ ఎయిర్‌ రీసెర్చ్‌’, ఇతర విభాగాలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశీలనలో తేలింది. ఈ నగరాల్లోని వాహనాలు, ఇతర రూపాల్లో వెలువడిన పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ (పీఎం 2.5) హానికారక స్థాయిలను ఈ పరిశోధకులు పరిశీలించారు.

ఐదేళ్ల వాయు కాలుష్య గణాంకాలతో బేరీజు
దేశంలో లాక్‌డౌన్‌ విధించిన మార్చి 25 నుంచి మే 11 వరకు ఉన్న వాయు నాణ్యత తీరును, అంతకుముందు ఐదేళ్ల ఇదే కాలానికి సంబంధించిన గణాంకాలతో పోల్చిచూసిన అనంతరం పరిశోధకులు ఈ అంచనాకు వచ్చారు. ఈ ఏడాదితో పాటు గత ఐదేళ్లకు సంబంధించిన సమాచారం, వివరాలను బేరీజు వేసినపుడు హైదరాబాద్‌తో సహా ఇతర నగరాల్లో వాయుకాలుష్య స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు ఈ పరిశీలన తేల్చింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని వాయునాణ్యతపై ఈ పరిశోధక బృందం పరిశీలన జరిపింది.

ఈ అధ్యయన వివరాలు ‘ద జర్నల్‌ సస్టెయినబుల్‌ సిటీస్‌ అండ్‌ సొసైటీ’లో ప్రచురితమయ్యాయి. ఈ పరిశీలన నిర్వహించిన కాలంలో హానికారక, విషతుల్యమైన వాయు కాలుష్యాలు ఢిల్లీలో 54 శాతం, ఇతర నగరాల్లో 24 నుంచి 32 శాతం వరకు, ముంబైలో 10 శాతం వరకు తగ్గినట్టు పరిశోధకులు వెల్లడించారు. ‘ఈ కాలంలో పీఎం 2.5 కాలుష్యం తగ్గుదల అనేది ఎక్కువ ఆశ్చర్యాన్ని కలగించకున్నా, ఈ కాలుష్యం తగ్గుదల శాతాలు భారీగా ఉండడం ద్వారా మనం భూగోళంపై వాహనాలు, ఇతర రూపాల్లో కాలుష్యాన్ని పెంచడం ద్వారా ఎంత ఒత్తిని పెంచుతున్నామనేది స్పష్టమైంది’ అని సర్రే వర్సిటీ అధ్యయనం ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్‌ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు.

లాక్‌డౌన్‌ పాఠాలు
లాక్‌డౌన్‌ సందర్భంగా వాయుకాలుష్యం తగ్గుదలకు సంబంధించి జరిపిన పరిశీలన.. నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత మెరుగుకు ఏయే చర్యలు చేపట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలను సూచిస్తోందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఆంక్షలు, ఇతరత్రా రూపాల్లో చేపట్టిన చర్యల ప్రభావాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవడంతో పాటు, మెరుగైన పరిస్థితుల సాధనకు ఎలాంటి విధానాన్ని రూపొందిస్తే మంచిదనే దానిపై సమీకృత విధానం ఉపయోగపడొచ్చునన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top