ఎన్‌ఐఏలో ‘మావో’ సెల్‌ 

A separate section for investigating left-wing terrorist cases - Sakshi

వామపక్ష తీవ్రవాద కేసుల దర్యాప్తునకు ప్రత్యేక విభాగం 

కొత్త సెల్‌కు 22 పోస్టులు మంజూరు 

సత్వాజీ తమ్ముని కేసు, ఏపీ ఎమ్మెల్యే హత్య కేసులూ దర్యాప్తు 

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టుల కేసుల దర్యాప్తునకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. గతేడాది వరకు కేవలం దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిపైనే ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసేది. ఇందులో కశ్మీరీ చొరబాటుదారులు, ఈశాన్య భారతదేశంలోని తిరుగుబాటుదారులు, పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు, దేశంలో పాక్‌ గూఢచార సంస్థ (ఐఎస్‌ఐ) కార్యకలాపాలు, ఉగ్రవాదులకు ఆర్థికసాయం, దొంగనోట్ల చలామణి తదితర కేసులుండేవి. ఇక నుంచి మావోయిస్టు కేసులను కూడా ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది. 

ఈ విభాగం ఏం చేస్తుందంటే..? 
వాస్తవానికి ఇటీవల 75 కొత్త పోస్టులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు కేంద్ర హోంశాఖ మంజూరు చేసింది. ఇందులో 22 మంది అధికారులతో కూడిన ప్రత్యేక విభాగం ఎల్‌డబ్ల్యూఈ (వామపక్ష తీవ్రవాదం) కేసులను విచారించనుంది. దేశవ్యాప్తంగా ఇకపై మావోయిస్టులు పాల్పడే దాడుల కేసుల సంగతి ఎన్‌ఐఏ చూసుకుంటుంది. ఎందుకంటే భారీగా నగదు తరలింపు, అక్రమంగా ఆయుధాలు నిల్వచేయడం, పేలుడు పదార్థాలు కలిగి ఉండటం, ప్రజాప్రతినిధులను హత్యలు చేయడం తదితరాలన్నీ దేశ వ్యతిరేక చర్యల కిందకే వస్తాయి. అందుకే, కేవలం ఉగ్రకేసులనే దర్యాప్తు చేసే ఎన్‌ఐఏకు మావోయిస్టులకు సంబంధించిన కేసులను కూడా అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరో కారణం ఏంటంటే.. మావోయిస్టు కార్యకలాపాలన్నీ వివిధ రాష్ట్రాల సరిహద్దుల్లో జరు గుతుంటాయి. ఒక రాష్ట్రంలో దాడికి పాల్పడి మరో రాష్ట్రంలోకి దండకారణ్యాల ద్వారా వెళుతుంటారు. ఆయా రాష్ట్రాల పరిధుల సమస్యలు తలెత్తడంతో ఇలాంటి కేసుల దర్యాప్తు స్థానిక పోలీసులకు ఇబ్బందిగా మారుతోంది. అందుకే, జాతీయస్థాయిలో ఉన్న ఎన్‌ఐఏ అయితే ఇలాంటి చిక్కులు, పరిమితులు ఉండవు. అన్ని రాష్ట్రాల పోలీసులతో టచ్‌లో ఉంటూ కేసులను ఎలాంటి అడ్డుంకులు లేకుండా దర్యాప్తు చేసుకునే వీలుంటుంది. 

ఏమేం కేసులు డీల్‌ చేస్తోంది? 
గతంలో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న మక్కామసీదు, గోకుల్‌చాట్, లుంబినీపార్క్, దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులను ఎన్‌ఐఏ దర్యాప్తు చేసింది. 2012లో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలో ఓ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ మావోయిస్టు దళానికి చేరవేస్తున్న రూ.50 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల ఈ కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేశారు. 2017 ఆగస్టు లో రాంచి రైల్వేస్టేషన్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్‌ అలియాస్‌ సత్వాజీ తమ్ముడు నారాయణ తరలిస్తున్న నగదును పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును కూడా ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఏపీలోని అరకులో గతేడాది సెప్టెంబర్‌ 23న ఎమ్మెల్యే కిలారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు హతమార్చిన కేసు కూడా ఎన్‌ఐఏకు బదిలీ అయింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న నగదు అక్రమ రవాణా, చెలరేగే హింసలను బట్టి, కేసుల తీవ్రత ఆధారంగా వీటిని స్థానిక పోలీసులు లోతైన దర్యాప్తు కోసం ఎన్‌.ఐ.ఏకి బదిలీ చేయనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top