కోడి పందేల జాతర

Sankranthi Kodi Pandalu Khammam - Sakshi

కోడి పందేలకు వేళయింది. ఏటా సంక్రాంతి పండగకు రూ.లక్షల్లో కోడి పందేలు.. రూ.కోట్లలో పేకాట. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఆటలో ఏడాదిపాటు చెమటోడ్చి పండించిన పంట కష్టం ఒక్కసారి పోగొట్టుకున్న అభాగ్యులెందరో. వీధిన పడిన కుటుంబాలు మరెన్నో. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీ రాష్ట్రంలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో జూదాన్ని అరికట్టడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. డిసెంబర్‌ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు పందేలకు సీజన్‌గా చెప్పుకుంటారు.

నెల రోజులపాటు ఏ నలుగురు జూదగాళ్లు కలిసినా పందెం ఎక్కడ జరుగుతుంది.. పేకాట ఎక్కడ నడుస్తుందనే సంభాషణలే. ఇందులోనే సంకలో పుంజు పెట్టుకొని తిరిగేవాళ్లు. కేవలం గంట వ్యవధిలోనే పందెంరాయుళ్లు ఒకేచోట కలుసుకోవడం.. అక్కడికక్కడే పందెం వేసుకోవడం.. మళ్లీ స్థలం మార్చడం నిత్యకృత్యం. పది రోజుల నుంచే అక్కడక్కడా పందేలు జరుగుతున్నాయంటే ఎంత డబ్బు చేతులు మారుతుందో అర్థం చేసుకోవచ్చు.    

సత్తుపల్లి: ఆంధ్రా సరిహద్దు మామిడి తోటలన్నీ పందెం బిర్రులుగా మారుతున్నాయి. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు బిర్రులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.కోట్లలో కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చకచకా చేసుకుంటున్నారు. ఆంధ్రా ప్రాంతంలో అయితే పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. సురక్షితంగా పందేలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో పందెంరాయుళ్లు ఆంధ్రాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో జరిగే పందెం బిర్రులన్నీ సత్తుపల్లి పరిసర ప్రాంత జూదగాళ్లతోనే నడుస్తాయి.

రూ.కోట్లలో పేకాట..  
కో
డిపందెం మాటున రూ.కోట్లలో పేకాట నడుస్తున్నట్లు సమాచారం. కోడిపందేలు ఒక ఎత్తయితే.. రాత్రి, పగలూ తేడా లేకుండా విద్యుత్‌ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయటా(పేకాట) నిర్వహించడంతో రెప్పపాటులో రూ.కోట్లు చేతులు మారి జూదరులు వీధినపడిన సంఘటనలు కోకొల్లలు. ఇవే కాకుండా.. గుండుపట్టాలతో జూదం నిర్వహిస్తారు. దీనికి తగినట్లుగా ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే పది రోజుల నుంచే ఆంధ్రా సరిహద్దుల్లో పేకాట జోరుగా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కుక్కుట శాస్త్రమంటే..  
ముసుగు పందేలలో కుక్కుట శాస్త్రం చూసుకొని పందెం వేస్తుంటారు. ఏ సమయంలో.. ఏ నక్షత్రంలో.. ఏ రంగుపుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్నిబట్టి కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి పందెం వేయడం ఆనవాయితీగా వస్తోంది. కోడి పందేలు జరిగే ప్రదేశం.. కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం.. పందెం రోజు జరిగే నక్షత్రం.. శుక్లపక్షంలో నెగ్గే కోళ్లనుబట్టి పందేలు వేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోళ్ల పందెం ఏ దిశగా జరుగుతుందో పుంజు యజమాని తన కోడిపుంజును ఆ దిక్కుకు తీసుకెళ్లే విషయంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పందెంరాయుళ్ల విశ్వాసం. 

ఆ మూడు రోజులు ఫుల్‌ జోష్‌..  
భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు సంక్రాంతి పందేలకు అడ్డూ అదుపూ ఉండదు. సత్తుపల్లి శివారులోని చింతలపూడి మండలంలో ఐదారుచోట్ల పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సత్తుపల్లి ప్రాంతంలోని కొందరు పందెం బిర్రులు తీసుకొని మరీ పందేలు నడిపిస్తారు. ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం, సీతానగరం, పోతునూరు, చింతంపల్లి, ధర్మాజిగూడెం, కళ్ల చెరువు, వెంకటాపురం, పంచాలకుంట, ప్రగడవరం, గోకారం, కృష్ణా జిల్లా తిరువూరు, కాకర్ల, విస్సన్నపేటల్లో పందేలు జోరుగా జరుగుతాయి. ఇంకా పెద్దపెద్ద పందేలు కొప్పాక, భీమవరంలో భారీ సెట్టింగ్‌ల మధ్య నిర్వహిస్తారు.
 
పందెంకోళ్ల రకాలు..  
పందెంకోళ్లు సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నల్ల సవల ఇలా అనేక రకాలు ఉన్నాయి. ప్రాంతాలనుబట్టి పేర్లు మారిపోతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. పూర్వ కాలంలో కోడిపందేల కోసం యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. పల్నాటి చరిత్ర, బొబ్బిలి యుద్ధంలో కోడిపందేల చరిత్ర ఆనవాళ్లు కనిపిస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top