14 ఏళ్లు దాటితే నో ఎంట్రీ

Sanjeevaiah Park Entry Restrictions For Adults - Sakshi

పిల్లల పార్కుగా సంజీవయ్య పార్కు మార్పు

నేటి నుంచే అమలు

సాక్షి, సిటీబ్యూరో: హుస్సేన్‌ సాగర్‌ తీరాన 92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సంజీవయ్య పార్కు ఇక నుంచి సంజీవయ్య చిల్డ్రన్‌ పార్కుగా మారనుంది. ఇన్నాళ్లు ప్రేమపక్షుల సందడితో ఉన్న ఈ పార్కులో వారికి ప్రవేశమే లేకుండా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు అథారిటీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరానికి వచ్చిన ఇతర రాష్ట్రాలు, దేశాల సందర్శకులు సాగర్‌ తీరాన ఉన్న ఈ పార్కును సందర్శిస్తుండటం, అలాగే పిల్లలతో కలిసి వచ్చిన కుటుంబ సభ్యులకు ఇక్కడ ప్రేమ జంటలు చేసే చేష్టలపై బీపీపీఏ అధికారులకు ఫిర్యాదులు పోటెత్తడంతో ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఈ పార్కులోకి రోజూ వస్తున్న జంటలు వందల  సంఖ్యలో ఉంటున్నాయి.  వీరి ప్రవర్తన శృతిమించి తార స్థాయికి వెళ్లడమే కాదు పోలీసు స్టేషన్ల వరకు వెళ్లిన ఫిర్యాదులు అధికారుల్లో మార్పు తీసుకొచ్చింది. ఇన్నాళ్లూ కేవలం ఆదాయం కోసమే ఈ పార్కులో ఏం జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించిన అధికారులు ఇటీవల బీపీపీఏ ఓఎస్‌డీగా రాంకిషన్‌ బాధ్యతలు చేపట్టడంతో అనివార్యంగా మార్పు కనిపించింది. సంజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్‌ పార్క్, బటర్‌ ఫ్లై పార్కు, రోజ్‌ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మారిస్తే బాగుంటుందన్న ఆయన ప్రతిపాదనను హెచ్‌ఎండీఏ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌  ముందుంచడంతో పచ్చజెండా ఊపారు. పిల్లల్లో సైన్స్‌పై ప్రాక్టికల్‌గా అవగాహన కలిగించేందుకు ఇది ఎంతో దోహదం కానుంది.

ఇక ఎడ్యుకేషనల్‌ హబ్‌గా పార్క్‌...
న్యూఢిల్లీలో ఇండియాగేట్‌ వే దగ్గర ఉన్న చిల్డ్రన్‌ పార్క్‌ తరహాలోనే సంజీవయ్య పార్కును చిల్డ్రన్‌ పార్కుగా మార్చి విద్యార్థుల్లో పర్యావరణంపై మెళకువలు పెంచేవిధంగా బీపీపీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సంÜజీవయ్య పార్కుతో పాటుగా హెర్బల్‌ పార్క్, బటర్‌ ప్లై పార్కు,  రోజ్‌ గార్డెన్, జాతీయ జెండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మార్చారు.  కేవలం 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులు లేదంటే సంరక్షకులతో వస్తేనే ఎంట్రీ ఉంటుందని, 14 ఏళ్లలోపు దాటినవారికి ప్రవేశం ఉండదని హెచ్‌ఎండీఏ కార్యదర్శి, బీపీపీఏ ఓఎస్‌డీ రాంకిషన్‌ బుధవారం తెలిపారు. గురువారం నుంచే ఈ నిర్ణయం అమల్లో ఉంటుందన్నారు. అయితే ప్రస్తుతం పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.10 ఎంట్రీ ఫీజును వసూలుచేస్తున్నామని, ఇక నుంచి పిల్లలతో వచ్చే వారికి కూడా రూ.10 ఎంట్రీ ఫీజు ఉండేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బృందంగా వస్తే ప్రవేశం ఉచితంగా కల్పిస్తాం. విద్యార్థుల్లో మరింత విజ్ఞానాన్ని పెంచేందుకు లాభాపేక్షలేకుండా ఈ పార్కును నిర్వహిస్తాం. సైన్సు పట్ల పిల్లల్లో మరింత జిజ్ఞాస పెంచే విధంగా ఈ పార్కును తీర్చిదిద్ది ముఖ్యంగా విద్యార్ధులు, అధ్యాపకులను ఆకర్శించేందుకు చర్యలు చేపట్టాం.  అలాగే ఈ ఉద్యానవనంలో ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగం నిషేధించడంతో పాటు, పచ్చదనం–పరిశుభ్రత పట్ల విద్యార్ధుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు ఉంటాయి.  బయటి తినుబండారాలను లోనికి అనుమతించకుండా చర్యలు తీసుకుంటున్నామ’ని రాంకిషన్‌ తెలిపారు. అయితే ప్రస్తుతం రోజుకు 1500 మంది సందర్శకులు వస్తున్నారని గురువారం నుంచి ఈపార్కును పిల్లల కేంద్రంగా మార్చడం వల్ల కొంత ఆదాయంతగ్గినా ఫర్వాలేదని, విద్యార్థుల్లో సైన్స్‌పెంచడమే తమ ప్రాధాన్యత అనిరాంకిషన్‌ అన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top