'నాన్న ఇచ్చిన ఆ డబ్బు నా జీవితాన్ని మార్చింది'

Sakshi Interview With Narayanpet MLA Sunki Rajendar Reddy In Mahabubnagar

ఎమ్మెల్యే సుంకి రాజేందర్‌రెడ్డి

కలలు అందరూ కంటారు. కానీ వాటిని సాకారం చేసుకునే వారు కొంతమందే ఉంటారు. అనుకున్నది సాధించాలంటే కష్టపడక తప్పదు. లక్ష్య సాధనలో ఎదురయ్యే  అవాంతరాలను అధిగమిస్తేనే అనుకున్నది సాధిస్తారు. సక్సెస్‌ అంటే షార్ట్‌కట్‌ కాదు.. లక్ష్యం దరి  చేరాలంటే ముళ్లబాటన నడవక తప్పదు.  కష్టపడితేనే జీవితంలో అనుకున్నది సాధించగలం అనే సిద్ధాంతాన్ని నమ్మారాయన. రూ.350 వేతనంతో జీవితం ప్రారంభించిన ఆయన ప్రస్తుతం 2 వేలకు పైగా మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదిగారు. నవోదయ ట్రస్టు ఏర్పాటు చేసి మెడికల్‌ కాలేజీలు.. విద్యాసంస్థలను నెలకొల్పారు. ప్రజలకు సేవ చేయాలన్న తపన కలిగిన ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సాధారణ కుటుంబంలో జన్మించి..వేలాది మందికి ఆదర్శంగా నిలిచిన నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో ‘సాక్షి’  పర్సనల్‌ టైమ్‌

సాక్షి,మహబూబ్‌నగర్‌ : మాది మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిల్‌కొండ మండలం శేరివెంకటాపురం గ్రామం. తండ్రి సుంకి రాజేశ్వర్‌రెడ్డి తల్లి యశోధరారెడ్డి. మేం ముగ్గురం అన్నదమ్ములం. ఓ అక్క. అక్క శ్రీలత, బావ వెంకట్‌రెడ్డి. అన్న విజయభాస్కర్‌రెడ్డి చనిపోయారు. మరో అన్న రవీందర్‌రెడ్డి వ్యాపారవేత్త. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం బైరంపురంనకు చెందిన డాక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి కుమార్తె స్వాతిరెడ్డితో 1994లో వివాహమైంది. మా కుమార్తె నందికారెడ్డి జిందాల్‌ గ్లోబల్‌ లా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని ప్రస్తుతం రాయచూర్‌లో ఉన్న నవోదయ సెంట్రల్‌ స్కూల్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. కుమారుడు అమృతరెడ్డి నవోదయ మెడికల్‌ కాలేజీలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. 

నాన్న కల సాకారం 
మా నాన్న రాజేశ్వర్‌రెడ్డి జనసంఘ్‌ పార్టీ నాయకుడు. ఎల్‌కే అద్వానీ, వాజ్‌పేయి, వెంకయ్యనాయడు, బంగారు లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ వంటి బీజేపీ సీనియర్లతో సత్సంబంధాలు ఉన్నాయి. పార్టీ అభీష్టం మేరకు 1973, 1978లో రెండు పర్యాయాలు మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజాసేవ చేయాలన్న నాన్న తపన నన్ను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రేరేపించింది. ప్రజల ఆదరణ, తల్లిదండ్రుల ఆశీర్వాదం, అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల అండదండలతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా.  

నాన్న ఇచ్చిన రూ.500తోనే దశ తిరిగింది 
నా చదువు మహబూబ్‌నగర్, రాయచూర్‌లో సాగింది. ఎస్సెస్సీ వరకు మహబూబ్‌నగర్‌లోని ఎంబీసీ స్కూల్‌ చదివా. పీయూసీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ రాయచూర్‌లో పూర్తయింది. స్కూల్‌లో నేను అబౌ యావరేజ్‌ స్టూడెంట్‌ను. బీ ఫార్మసీ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని ఎస్‌ఎల్‌ఎన్‌ కంపెనీలో రూ.350కు నైట్‌డ్యూటీ చేశా. ఇలా నాలుగునెలలు పని చేశా. తర్వాత 1986 డిసెంబర్‌15న మా నాన్న వద్ద రూ.500 తీసుకుని బెంగళూరుకు వెళ్లా.

ఆ సమయంలో చిగ్‌బలాపూర్‌ ఫార్మ కంపెనీలో అధ్యాపకుడిగా చేరి.. రెండేళ్ల పాటు ప్రిన్సిపల్‌గా పని చేశా. అదే సమయంలో అక్కడ దేవనపల్లిలో మూతబడుతోన్న రూరల్‌ కాలేజీ ఆఫ్‌ ఫార్మసీని లీజుకు చేసుకుని ఐదేళ్లు నడిపా. అదే సమయంలో రాయచూర్‌లో ఎం ఫార్మసీలో చేరా. లీజు పూర్తయిన తర్వాత షాపూర్‌లో ఎంఫార్మసీ కాలేజీ పెట్టాను. రాయచూర్‌లో బీం ఫార్మసీ ఏర్పాటు చేసి మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేసినా. ప్రస్తుతం నర్సరీ నుంచి పీజీ వరకు కాలేజీలు ఉన్నాయి.  

ఆ కల నెరవేరేదే కాదు 
రాయచూర్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజల కల. 2001లో రాయచూర్‌లో మెడికల్‌ ఏర్పాటుకు స్థలం కొన్న తర్వాత.. దాని నిర్మాణం కోసం నా వద్ద అవసరమైన డబ్బు లేదు. బెంగళూరులో బ్యాంకు నుంచి రూ.2.6కోట్ల అప్పు తీసుకున్న. కానీ కళాశాలలో అవసరమైన యంత్రాలు. పరికరాల కొనుగోళ్ల కోసం మళ్లీ డబ్బు అవసరమైంది. మళ్లీ బ్యాంకు నుంచి రూ.2.5కోట్ల అప్పు చేసిన. దాంతో మిషనరీలు కొనుగోలు చేసిన.

మెడికల్‌ కాలేజీని సందర్శించిన తనిఖీ బృందం నిర్వహణకు అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో కాలేజీలో బోధన, బోధనేతర సిబ్బందికి వేతనాలు, ఇతర ఖర్చులకు మళ్లీ డబ్బు అవసరం వచ్చింది. తర్వాత ఎక్కడా అప్పు చేయలేని స్థితిలో ఉన్న నా పరిస్థితి తెలుసుకున్న నా బాల్యమిత్రుడు విష్ణుమోహన్‌ నాకు రూ.కోటిన్నర ఇచ్చాడు. ఇలా బ్యాంకు అప్పు, విష్ణు ఇచ్చిన ప్రోత్సాహంతో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కల నెరవేరింది. 

నా కుటుంబమే నా బలం 
నా విజయం వెనక మా అమ్మ యశోధరారెడ్డి, నా భార్య స్వాతిరెడ్డి ఉన్నారు. నేను ఏ పని చేసినా.. నాకు ఏ ఆపదొచ్చినా ముందు అమ్మనే తలుచుకుంటా. నేను బీ ఫార్మసీ పూర్తి చేసిన తర్వాత మా చిన్నాన్నా, పెద్దనాన్న పిల్లలు.. నా స్నేహితులందరూ అమెరికాకు వెళ్లారు. ఆ సమయంలో నేనూ అమెరికాకు వెళ్దామని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో మా అమ్మ ‘ఎందుకు రా అమెరికాకు.. బంగారం తింటావా? ఇక్కడే ఉండి ఏదైనా చేసుకోవచ్చు కాదా?’ అని చెప్పింది. అమ్మ మాట కాదనకుండా ఇక్కడే ఉండిపోయా. ఎం ఫార్మసీ చేశా. తర్వాత మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతి కోసం మూడుసార్లు బృందాలు తనిఖీలు చేసినా అనుమతి రాలేదు.

అప్పుడు ఢిల్లీలో ఉన్న నేను ఫోన్లో అమ్మతో మాట్లాతే ఎంతో ధైర్యం చెప్పింది. ఆ ధైర్యంతోనే ముందుకెళ్లితే నాలుగోసారి అనుమతి లభించింది. ఇక నా భార్య స్వాతిరెడ్డి పాత్ర నా విజయం వెనక ఎంతో ఉంది. ఏప్రిల్‌ 2, 1994న నా వివాహం జరిగింది. 7న మేమిద్దరం హైదరాబాద్‌కు వెళ్లాం. అదే రోజు ఆమెను హైదరాబాద్‌లో వదిలేసి మెడికల్‌ కాలేజీ పని నిమిత్తం పది రోజుల కోసం కేరళ వెళ్లాను. జూన్‌లో రాయచూర్‌లో ఇళ్లు కిరాయికి తీసుకుని ఇక్కడికి తీసుకొచ్చా. నెలలో 20రోజులు బెంగళూరు, ఢిల్లీ, కేరళ వెళ్లేవాడిని. ఇప్పటికీ పలు సందర్భాల్లో బయటే ఉంటా. కానీ ఏనాడూ నా భార్య నన్ను ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అని ప్రశ్నించలేదు. నేను జీవితంలో పడుతున్న కష్టాలు చూసి నాకు ధైర్యం చెప్పేది. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. అలాగే నా పిల్లలు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను ఇబ్బందిపెట్టేవారు కాదు. 

రాయచూర్‌కు ఏదైనా చేయాలని.. 
ఎంతో ఆదరించిన రాయచూర్‌ను ఏదో చేయాలన్న తపన నాలో బలంగా ఉంది. అందుకే జిల్లాకేంద్రంలో 1,100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్న. మూడు పూటల ఉచిత ఆహార సదుపాయం అందుబాటులో ఉంది. ఇదే క్రమంలో సెంట్రల్‌ స్కూల్‌ ఏర్పాటు చేసి బెంగళూరులో రూ.6 లక్షల విలువ చేసే విద్యను రూ.37వేలకే అందిస్తున్న.  

అబద్ధానికి చోటు లేదు.. 
నా జీవితంలో ఇప్పటి వరకు అబద్ధం చెప్పలేదు. నేను చేసింది తప్పయినా.. ఒప్పయినా ఉన్నది ఉన్నట్టు చెబుతా. ఏ పని కోసం ఎక్కడికి వెళ్లినా స్వాతికి ఉన్నది ఉన్నట్లు చెప్పేవాడిని. ఆమె నన్ను నమ్మేది. ఇదే అలవాటు నా భార్య, మా పిల్లలకు వచ్చింది. వారూ అసలు అబద్ధమాడరు. అలాగే నవోదయ విద్యాసంస్థలో పని చేసే ఓ ఉద్యోగి అబద్ధం చెప్పరు. ఎవరైనా చెప్పినట్లు నిరూపిస్తే వారిని ఉద్యోగం నుంచి తీసేస్తా.   
వ్యవసాయం చేయాలని ఉంది.. 
కోయిల్‌కొండ మండలంలోని అన్ని గ్రామాలు సాగునీరు లేక ఇబ్బందులు పడేవారు. మండల ప్రజలకు నీళ్లు ఇస్తేనే రాజకీయాల్లోకి వస్తానని చెప్పాను. దానికి చంద్రబాబు ఒప్పుకోవడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. 2014లో తొలిసారిగా పోటీ చేసిన నేను టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ తెలంగాణలో టీడీపీ ప్రాభావం కోల్పోతుండడంతో నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరాను. విద్యావేత్తగా.. ఎమ్మెల్యేగా ఆయా వర్గాలకు సేవ చేస్తున్న నాలో వ్యవసాయం చేయాలనే కోరిక ఉంది. పదవీ విరమణ 55ఏళ్లకు అనుకున్నా.. ఆ తర్వాత వ్యవసాయం చేయాలని ఉంది. అందుకోసం రాయచూర్‌లో కృష్ణాఒడ్డున, కోయిల్‌కొండ మండలం శేరివెంకటాపురంలో మాకు వ్యవసాయ భూమి ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top