రైతుల ఖాతాల్లో రూ.700 కోట్లు జమ

Rs. 700 crore in the accounts of the farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సొమ్ము చేరుతోంది. రబీ రైతుబంధు సొమ్ము రెండో రోజు మంగళవారం నాటికి రూ.700 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.  మొత్తం 52 లక్షల మందికి రబీ పెట్టుబడి సొమ్ము అందజేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వారందరి బ్యాంకు ఖాతాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు 17 లక్షల మంది రైతుల ఖాతాలు సేకరించి క్షుణ్నంగా పరిశీలించారు.

ఇప్పటివరకు ఆరున్నర లక్షల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు. దీంతో రైతులు బ్యాంకుల వద్దకు క్యూలు కడుతున్నారు. దీపావళి నాటికి రైతులందరి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గత ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులకు పెట్టుబడి చెక్కులను గ్రామసభల్లో అందజేసిన సంగతి తెలిసిందే. దాదాపు 51 లక్షల మంది రైతులకు రూ. 5,200 కోట్ల వరకు ప్రభుత్వం అందజేసింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రబీలో చెక్కుల రూపం లో ఇవ్వకూడదని, హడావుడిగా పంపిణీ చేయకూడదని  ఈసీ స్పష్టం చేసింది. దీంతో రైతుల ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమ చేయాలని తెలిపింది. దీంతో వ్యవసాయశాఖ రైతుల బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ–కుబేర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా రైతులకు పెట్టుబడి సొమ్ము బ్యాంకులకు పంపిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top