పల్లె ప్రణాళిక.. రూ.2వేల కోట్లు! | Rs 2 thousand crore for village planning | Sakshi
Sakshi News home page

పల్లె ప్రణాళిక.. రూ.2వేల కోట్లు!

Jul 26 2014 11:51 PM | Updated on Mar 28 2018 11:05 AM

‘మన ప్రణాళికలు’ అంచనాలను మించుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.2వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా గుర్తించారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘మన ప్రణాళికలు’ అంచనాలను మించుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.2వేల కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా గుర్తించారు. ప్రతి గ్రామంలో సగటున మూడు పనులను ఎంపిక చేసిన యంత్రాంగం.. వాటిలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, స్కూళ్లు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలను ప్రాధమ్యాలుగా పరిగణించింది. మండల పరిధిలో ప్రాధాన్యత గల అంశాలపై కసరత్తు చేసిన యంత్రాంగం భారీ ప్రణాళికలు రూపొందించింది.

 ‘మన ఊరు- మన ప్రణాళిక, మన మండలం- మన ప్రణాళిక’లపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన అధికారగణం, వాటి అంచనాలకు తుది రూపు ఇవ్వడంపై దృష్టి సారించింది. 688 గ్రామ, 33 మండలాల ప్రణాళికల వివరాలను శనివారం నాటికి నివేదించాలని నిర్దేశించినప్పటికీ, కేవలం 20 మండలాలకు సంబంధించిన సమాచారం మాత్రమే జిల్లా పరిషత్ యంత్రాంగానికి చేరింది. ప్రణాళికబద్ధ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామ, మండల, జిల్లాస్థాయి ప్రణాళికలు తయారుచేయాలని ఆదేశించింది.

 దీంట్లో ప్రధానంగా ఊరుమ్మడి సమస్యలను ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ధేశించింది. ఈ క్రమంలో 13వ తేదీ నుంచి గ్రామ, ఆ తర్వాత మండల ప్రణాళికల రూపకల్పనపై యంత్రాంగం తలమునకలైంది. చాలా గ్రామాల్లో వ్యక్తిగత అవసరాలపై అర్జీలు అందినప్పటికీ, వాటిని పక్కనపెట్టిన అధికారులు.. కేవలం సామాజిక అవసరాలూ.. అందులోనూ ప్రభుత్వం నిర్ధేశించిన అంశాలనే  పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో శివారు గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పనకు పెద్దఎత్తున వినతులు అందాయి.

 20 మండలాల్లో రూ.1302 కోట్లు !
 ఇప్పటివరకు 20 మండలాలకు సంబంధించి అందిన ప్రణాళికల ప్రకారం రూ.1,302 కోట్లు అవసరమవుతాయని జిల్లా పరిషత్ తేల్చింది. దీంట్లో గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.846.41 కోట్లు, మండల స్థాయిలో రూ.456 కోట్ల అంచనాలు రూపొందించింది. వీటిలో అత్యధికంగా కీసర రూ.149 కోట్లు, ఘట్‌కేసర్ రూ.150 కోట్లు, మొయినాబాద్ రూ.54.56 కోట్లతో గ్రామ ప్రణాళికలు నివేదించారు.

 అలాగే మండలస్థాయిలో అత్యధికంగా మొయినాబాద్ నుంచే ప్రతిపాదనలు అందాయి. సుమారు రూ.85.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్ధేశిత ప్రతిపాదనలు పంపారు. ఆయా గ్రామాల్లో రోడ్డు సౌకర్యం, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేసినప్పటికీ, వాటికయ్యే అంచనా వ్యయంపై ఇంకా ప్రతిపాదనలు రూపొందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement