మాంద్యంలోనూ నిధుల వరద!

Rs 17,285 Crore Spent On Irrigation Projects In Nine Months At Telangana - Sakshi

9 నెలల్లో సాగునీటిపై రూ.17,285 కోట్ల ఖర్చు

ప్రధాన ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా జాగ్రత్తలు

రుణాల రూపేణా రూ.9,851 కోట్ల సేకరణ, ఖర్చు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉన్నా.. ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా తీసుకున్న నీటి పారుదలకు మాత్రం నిధుల కొరత రానివ్వడం లేదు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నింటినీ నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసే లక్ష్యంగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూరుస్తూనే రుణాల రూపేణా సేకరించిన వాటినీ ఖర్చు చేస్తోంది. తొమ్మిది నెలల వ్యవధిలో ప్రాజెక్టులపై ప్రభుత్వం ఏకంగా రూ.17,285 కోట్ల నిధులు ఖర్చు చేయగా, మరో మూడు నెలల వ్యవధిలో ఐదారు వేల కోట్ల మేర వ్యయం చేయనుంది.

నెలకు రూ.1,920 కోట్లు.. 
2019–20 ఆర్థిక ఏడాదిలో తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఎక్కడా నిధుల కొరత లేకుండా చూస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో 9 నెలల వ్యవధిలో రూ.8,586 కోట్ల మేర ఖర్చు చేసింది. ఇందులో రుణాల ద్వారా రూ.5,945 కోట్ల మేర ఖర్చు చేయగా, ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2,641 కోట్లు ఖర్చు చేశారు. దీంతో మిడ్‌మానేరు వరకు గోదావరి నీటి ఎత్తిపోతల సాధ్యమైంది. మిడ్‌మానేరు దిగువన కొండపోచమ్మసాగర్‌ వరకు నీటిని తరలించే వ్యవస్థ ప్రస్తుతం సిద్ధంగా ఉంది. దీంతోపాటే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సైతం రూ.2,021 కోట్లు మేర ఖర్చు చేశారు. ఇందులో మెజార్టీ నిధులు భూసేకరణ, సహాయ పునరావాస పనులకు వెచ్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది జూన్‌ నాటికి గరిష్ట ఆయకట్టుకు నీరివ్వాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఫిబ్రవరి నాటికి తొలి పంప్‌హౌస్, మార్చి నాటికి రెండో పంప్‌హౌస్, మే చివరికి మూడో పంప్‌హౌస్‌ నిర్మాణ పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి సైతం రుణాల రూపేణా రూ.1,500 కోట్ల మేర ఖర్చు జరిగింది. వీటితో పాటే దేవాదులకు రూ.800 కోట్ల మేర, వరద కాల్వ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్ల మేర ఖర్చు చేశారు. చిన్న నీటి పారుదల రంగానికి సైతం పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు రూ.873 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రాష్ట్రం తన బడ్జెట్‌ నుంచి రూ.7,434 కోట్లు ఖర్చు చేయగా, రుణాల ద్వారా రూ.9,851 కోట్లు ఖర్చు చేసింది. నెలకు రూ.1,920 కోట్లకు తగ్గకుండా 9 నెలల్లో 17,825 కోట్లు ఖర్చు చేసినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అయినా ప్రాజెక్టుల పరిధిలో నిర్మాణ పనులు.. పూర్తయిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.10,000 కోట్ల మేర ఉండటం విశేషం. ఆర్థిక ఏడాది ముగిసే నాటికి మూడు నెలల వ్యవధిలో మరో రూ.5 వేల నుంచి రూ.6 వేల కోట్ల మేర ఖర్చు చేసే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top