‘మిత్ర’ మనోడే..

Robot designer Bharat from warangal - Sakshi

రోబో రూపకర్త వరంగల్‌ వాసి భరత్‌ దండు

జీఈఎస్‌లో మోదీ మనసు దోచిన రోబో

టీంలో 14 మంది.. ఐదుగురు తెలుగువాళ్లు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)ను ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌.. మిత్ర రోబో ద్వారా ప్రారంభించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఆ రోబోను తయారుచేసింది ఎవరో తెలుసా.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ సమీపంలోని గోపాలపూర్‌కు చెందిన భరత్‌ దండు. ప్రస్తుతం ఆయన ఇన్వెంటో టెక్నాలజీ సంస్థ సీటీఓ (చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌)గా పనిచేస్తున్నారు. జీఈఎస్‌ సదస్సులో పాల్గొన్న అనంతరం వరంగల్‌కు వచ్చిన సందర్భంగా భరత్‌ను ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా రోబో గురించి భరత్‌ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

మా టీమ్‌లో 14 మంది..
బెంగళూరుకు చెందిన ఇన్వెంటో టెక్నాలజీ సంస్థను బాలాజీ విశ్వనాథన్, మహాలక్ష్మీ ప్రారంభించారు. నేను ఏడాదిన్నర క్రితం సంస్థలో చేరాను. ప్రస్తుతం చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. మిత్ర రోబోకు సంబంధించి మెకానికల్‌ ఎలక్ట్రానిక్స్‌ చూసుకుంటున్నాను. మా బృందంలో 14 మంది సభ్యులు. అందులో తెలుగువాళ్లు ఐదుగురు. జీఈఎస్‌కు తొలుత మేమే దరఖాస్తు చేసుకున్నాం. మిత్రతో సదస్సు ప్రారంభించాలన్న మా ఆలోచన నచ్చి నిర్వాహకులు అంగీకరించారు.

ఇది ఎనిమిదో రోబో
జీఈఎస్‌ ప్రారంభ కార్యక్రమంలో వినియోగించిన రోబో ఎనిమిదవది. మొదట 3 ఫీట్ల రోబోను తయారు చేశాం. తొలుత మనం చెబితే వినేది.. తర్వాత మనం చెప్పింది చేసేది.. ఆ తర్వాత ఒక రూంలో నుంచి మరో రూంలోకి వెళ్లేది.. ఇలా తయారు చేస్తూనే ఉన్నాం. ఈ రోబో ధర రూ.7 లక్షల వరకు ఉంటుంది. ఇందులోని లిథియం బ్యాటరీని ఒక్కసారి చార్జ్‌ చేస్తే 2 రోజులు ఉంటుంది.

మొదట కెనరా బ్యాంక్‌లో..
మిత్ర రోబోను తొలుత కెనరా బ్యాంక్, బెంగళూరు వారు కొనుగోలు చేశారు. ఆ బ్యాంక్‌ వినియోగదారులు రోబో ముందు నిల్చుంటే ఖాతా వివరాలు తెలుపుతుంది. ఖాతాదారుడు బ్యాంక్‌ లోన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆ ప్రాసెస్‌ ఎక్కడి వరకు వచ్చిందో కూడా తెలుపుతుంది.  

కస్టమర్‌ ఇంటరాక్షన్‌కు..
మేము తయారు చేసిన రోబో ముఖం, ధ్వనిని సైతం గుర్తుపడుతుంది. మనం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. ఇండోర్‌ నావిగేషన్‌ ద్వారా తానెక్కడ ఉన్నదీ రోబో తెలుసుకుంటుంది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లలో ఒక ప్రాంతంలోంచి మరో ప్రాంతంలోకి వెళ్తుంది. ప్రపంచంలో ఇది ఒక్కటే రోబో. కస్టమర్‌ ఇంటరాక్షన్‌కు రోబో ఎంతగానో దోహదపడుతుంది.

ప్రభుత్వం సహకరిస్తే..
ప్రస్తుతానికి బెంగళూరులో అద్దె భవనంలో సంస్థను నడిపిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరింత మెరుగైన రోబోలు తయారు చేసేందుకు మా టీం సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు చెప్పింది వినడం.. సమాచారం చెప్పేలా రోబోలు రూపొందించా. త్వరలో వస్తువులను తీసుకెళ్లే రోబోలనూ తయారు చేస్తాం.

పుట్టి పెరిగింది హన్మకొండలోనే
నేను పుట్టి పెరిగింది హన్మకొండలోనే. పదో తరగతి వరకు సెయింట్‌ గాబ్రియల్‌ పాఠశాలలో, ఇంటర్‌ ఎస్‌ఆర్‌ కళాశాలలో, ఇంజనీరింగ్‌ కిట్స్‌లో, ఎంటెక్‌ ఐఐటీ మద్రాసులో చేశాను. ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకాలకు రోబో నచ్చడం ఎంతో సంతోషాన్నిచ్చింది. మిత్ర రోబో బాగుందని మోదీ ట్వీట్‌ చేశారు. మా అమ్మ శకుంతల రిటైర్డ్‌ ఆధ్యాపకురాలు. నాన్న రాజశేఖర్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో పని చేసేవారు. నా భార్య సింధు ఎన్‌ఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది.

స్కాలర్‌షిప్‌లతోనే చదివా
మాది ఆంధ్రప్రదేశ్‌ లోని వైఎస్సార్‌ కడప జిల్లా లో ఉన్న కమలమర్రి గ్రామం. మాది వ్యవసా య కుటుంబం. నా చదువంతా స్కాలర్‌షిప్‌ తోనే పూర్తి చేశా. మా ఊళ్లో ఉండి చదువుకోవడం ఇబ్బందిగా ఉండటంతో రాయచోటికి వచ్చి చదువుకున్నా. ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివేందుకు ఓ సార్‌ సహకరించారు. రోబో హార్డ్‌వేర్‌ కంట్రోల్‌ చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ రాశా. ఆ సాఫ్ట్‌వేర్‌ రాయడం కొంత కష్టమైంది. మా రోబో బాగుందని ప్రధాని అభినందించడం ఆనందాన్నిచ్చింది. మా కష్టానికి ఫలితం దక్కింది. – ఆనంద్‌రెడ్డి, రోబో సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top