ఆరోపణలు చేస్తున్న వారికి.. రేవంత్‌ బహిరంగ సవాల్‌

Revanth reddy fires on TRS, BJP over IT Rides - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐటీ దాడుల తర్వాత తొలిసారి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి శనివారం మీడియా ముందుకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే ఐటీ అధికారులు దాడులు జరిపారని మండిపడ్డారు. మార్కెట్‌ విలువలు పెరగడంతోనే తన ఆస్తుల విలువ పెరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రెండు అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాలను పక్కన పెట్టుకొని, తన ఆస్తులేమైనా పెరిగాయోలేదే చూస్తే అర్థం అవుతుందన్నారు. హైదరాబాద్‌లోని తన నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ని 22 ఏళ్లుగా కిరాయిలకు ఇస్తున్నామని తెలిపారు. కిరాయికి వచ్చిన వారి పేర్ల మీద ఉన్న కంపెనీలు కూడా తనవే అని విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు పిల్లను ఇచ్చిన మామ పద్మనాభ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు బినామీలు అంటున్నారని నిప్పులు చెరిగారు. 

చాలా ఏళ్ల క్రితమే మాడ్గుల గ్రామానికి చెందిన తన మామ పద్మనాభరెడ్డి ఆయన తండ్రి దుర్గా రెడ్డి కోటీశ్వరులని, కావాలంటే ఆ ఊరు వెళ్లి విచారించమన్నారు. తాను పుట్టక ముందే, తన మామ పుట్టక ముందే వారి కుటుంబం 1940 కాలం నాటికే కోటీశ్వరులా కాదా విచారణ చేయండి అని తెలిపారు. అలాంటి వారిని తీసుకొచ్చి తన బినామీలుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

విదేశాల్లో ఖాతాలపై అవగాహన లేకుండా కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక రౌడీషీటర్ పీడీ యాక్ట్ తప్పించడానికి కేటీఆర్ చెప్పితే తనపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. హాంకాంగ్, మలేషియాకు నేను వెళ్లానా? చిల్లర ఆరోపణలు చేస్తున్న వారికి బహిరంగ సవాల్ విసురుతున్నానన్నారు. తన ఖాతాలు నిజమని నిరూపించకపోతే, మీరు మీ తల్లిదండ్రులకు పుట్టారో లేదో డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకోవాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను తనకుటుంబాన్ని మానసిక క్షోబకు గురిచేస్తున్నారని తెలిపారు. అదే పరిస్థితి మీకొస్తే పరిస్థితి ఆలోచించుకోవాలన్నారు. తనకు విదేశాల్లో ఖాతా తెరవడానికే అర్హతలేదన్నారు.

తనపోరాటాన్ని, చిత్తశుద్ధిని చూసే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తనకు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాఇచ్చారన్నారు. తనపై ఎన్ని కుట్రలు పన్నినా వెనక్కి తగ్గేదే లేదన్నారు. రేవంత్ తెలంగాణలో ప్రచారం చేస్తే ఓడిపోతారని సర్వేలలో తేలిందని, అందుకే ఎలాగైన మూడు, నాలుగు నెలలు తనను జైల్లో పెట్టాలని కుట్ర పన్నారని తెలిపారు. అందులో భాగంగానే మొదట ఐటి, ఈడీ, సీబీఐతో వరుస దాడులకు కుట్ర పన్నారన్నారు.

సీఎం కేసీఆర్ అభద్రతాభావంతో భయాందోళనకు లోనవుతున్నట్లు మూడు రోజులు నుండి పరిణామాలు చూస్తూ తెలుస్తుందన్నారు. పారదర్శకంగా జవాబు దారిగా ఉండాలనే ఇప్పుడు ప్రజలకు అన్ని విషయాలు చెబుతున్నానని తెలిపారు. రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టడానికి మూడు రోజులుగా తనకు అండగా నిలబడిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకి రేవంత్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top