నిధుల జాడేది..? | Sakshi
Sakshi News home page

నిధుల జాడేది..?

Published Mon, Jun 30 2014 3:32 AM

నిధుల జాడేది..? - Sakshi

- పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడి ఏడాది
- ఏజెన్సీలో పరిస్థితి అగమ్యగోచరం
- రూ.20 కోట్ల నిధులకు మోక్షమే లేదు
- ఉత్సవ విగ్రహాల్లా సర్పంచ్‌లు
 సాక్షి, ఖమ్మం:
గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడి ఏడాది అయింది. పంచాయతీల ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఎక్కడా అభివృద్ధి జాడలు కనిపించడం లేదు. డ్రైనేజీలు, మంచినీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. నిధులు లేక పనులు చేయించడం లేదని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలను ఆలస్యంగా నిర్వహించిన గత ప్రభుత్వం.. నిధుల విడుదలకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇక కొత్త ప్రభుత్వమైనా ఎప్పుడు నిధులు విడుదల చేస్తుందోనని పంచాయతీ పాలకవర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
 
జిల్లాలోని 758 గ్రామ పంచాయతీలకు గత ఏడాది జూన్ 30న ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏజెన్సీలో 372 పంచాయతీలుండగా మిగిలినవి మైదాన ప్రాంతంలో ఉన్నాయి. గత ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీల్లో సమస్యలు తిష్టవేశాయి. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఎన్నో సమస్యలు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పలు పథకాల కింద నిధులు అందాల్సి ఉండగా, స్టేట్ ఫైనాన్స్, టీఎఫ్‌ఎసీ నిధులు అరకొరగానే విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది.

పాలకవర్గాలు ఏర్పడిన రెండు నెలల తర్వాత (2013 అక్టోబర్‌లో) జిల్లాకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు (ఎస్‌ఎఫ్‌సీ) రూ.3.86 కోట్లు, టీఎఫ్‌సీ నిధులు రూ.11.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులను గ్రామాల్లో తాగునీటి సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాలు, గ్రామీణ రహదారుల నిర్మాణం, వీది లైట్ల కోసం వెచ్చించాలి. అయితే సర్పంచులు అధికారం చేపటే ్టనాటికే పల్లెల్లో పుట్టెడు సమస్యలు ఉండగా, వాటి పరిష్కారానికి ప్రభుత్వం పిసరంతగా విడుదల చేసిన ఈ నిధులు ఎటూ సరిపోలేదు. దీనిపై సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు పలుమార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేదు.

ఇంతలోనే మున్సిపల్, పరిషత్, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఈ నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఈ ఎన్నికలు ఉంటాయని తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తుగా ఈ ఏడాది ప్రారంభంలో నిధుల విడుదల విషయమే ఆలోచించచకపోవడం గమనార్హం. ఇలా గ్రామాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నా సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా ఉంటున్నారే తప్ప.. ఏమీ చేయలేకపోతున్నారు.
 
రూ.20 కోట్లకు మోక్షమెప్పుడో..?
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు నేటికీ మోక్షం లేదు. ‘ఇదిగో వస్తున్నాయి.. అదిగో వస్తున్నాయి..’ అని అధికారులు చెపుతున్నా..  పంచాయతీల ఖజానాకు మాత్రం ఈ నిధులు చేరడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో గ్రామ పంచాయతీలకు రూ.19.79 కోట్లు విడుదల కావాలి. అయితే ఇందులో జనరల్ ఫండ్ కింద రూ.15.18 కోట్లు, ఏజెన్సీలోని 372 పంచాయతీలకు రూ.4.61 కోట్లు మంజూరైనట్లు అధికారులు కాగితాల్లో చూపిస్తున్నారు.

కానీ ఇప్పటి వరకు పంచాయతీల ఖాతాల్లో మాత్రం ఈ పైసలు పడలేదు. ఇదేంటని సర్పంచులు వారిని ప్రశ్నిస్తే ఖజానా ఖాళీ అనే సమాధానమే వస్తోంది. బీఆర్‌జీఎఫ్ పథకం కింద జిల్లాలో అన్ని పంచాయతీలకు రూ.13 కోట్ల ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నిధులను తాగునీరు, పారిశుధ్యం కోసం ఖర్చు చేయాలి. అయితే ఇప్పటి వరకు ఈ నిధులు కూడా పంచాయతీలకు చేరలేదు.

ప్రధానంగా ఏజెన్సీలో ప్రస్తుతం మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు, మంచినీటి మోటార్లు కాలిపోవడం, చేతి పంపులు పనిచేయకపోవడంతో గిరిపుత్రులు తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వ లేకపోవడం, ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయించలేకపోతున్నామని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు.
 
కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపైనే సర్పంచులు కోటి ఆశలు పెట్టుకున్నారు. పలు గ్రామాల్లో అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. రానున్నది వర్షాకాలం కావడంతో ఈ రోడ్లపై నడిచే వీలుండదు. అలాగే డ్రైనేజీ, మంచినీటి వ్యవస్థలను మెరుగు పర్చాల్సి ఉంటుంది. అయితే వీటన్నింటికీ తక్షణమే నిధులు విడుదల చేయాలని సర్పంచ్‌లు డిమాండ్ చేస్తున్నారు.

మంచినీటి పైపులైన్లకు మరమ్మతులు చేయించకపోతే వర్షాకాలంలో ఆ నీరు కలుషితమై ప్రజలు మంచం పట్టే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే ఈ నెలరోజుల్లో అన్ని పనులు పూర్తి అవుతాయని అంటున్నారు.
 
నిధులుంటేనే అభివృద్ధి.. కొక్కిరపాటి పుల్లయ్య, సర్పంచ్, అశ్వారావుపేట
ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అరకొరగా నిధులు విడుదల చేస్తుండడంతో పాలన, అభివృద్ధి కుంటుపడింది. పంచాయ తీ చట్టం ప్రకారం సర్పంచ్‌లకు 29 రకాల విధులు ఉన్నప్పటికీ వాటిని ఆచరణలో పెట్టలేకపోతున్నాం. పంచాయతీల్లో వచ్చే ఇంటి పన్నులతో అభివృద్ధి చేయాలంటే సాధ్యం కావడం లేదు. ఈ నిధులు ఒక్కోసారి సిబ్బంది వేతనాలకే సరిపోతోంది. ఇక  పారిశుధ్యం, డ్రైనేజీ పనులు చేయించాలంటే నిధులు ఉండటం లేదు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే అది సాధ్యమవుతుంది. కొత్త ప్రభుత్వమైనా నిధులు విడుదల చేసి పంచాయతీల అభివృద్ధికి బాటలు వేయాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement