పురపోరులో రియల్‌ ఎస్టేట్ హవా..

Real Estate Playing Key Role In Municipal Elections - Sakshi

కొందరు మినహా అభ్యర్థులంతా రియల్టర్లే

సగం మంది కోటీశ్వరులే 

మహిళా రిజర్వ్‌ స్థానాల్లో సతీమణులను నిలిపిన నేతలు

ఒక్క ఓటుకు రూ.5 వేలు ఖర్చు చేసేందుకు రెడీ

సాక్షి, ఇబ్రహీంపట్నం : ఆదిబట్ల మున్సిపల్‌ ఎన్నికల్లో రియల్టర్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 15 వార్డులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, టీడీపీతో పాటు స్వతంత్రులను కలుపుకొని 49 మంది బరిలో నిలిచారు. వీరిలో సీపీఎం, టీడీపీ, ఒక స్వతంత్ర అభ్యర్థిని మినహాయిస్తే 46 మంది రియల్టర్లే. 15 సీట్లకు గాను మూడు ఎస్సీ, మరో మూడు బీసీ, ఒకటి ఎస్టీ సామాజికవర్గాలకు కేటాయించగా మిగతా 8 సీట్లు జనరల్‌ కేటాయించారు.

మహిళల స్థానంలో బరిలో నిలిచిన వారి భర్తలు రియల్‌ ఎస్టేట్‌లో ఆరితేరిన వారున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా ఎకరా రూ.2 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో చాలా మంది రియల్టర్లుగా అవతారమెత్తి పెద్దమొత్తంలో కూడబెట్టారు.  మున్సిపాలిటీ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో సగంమంది కోటీశ్వరులే. ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో మినహాయిస్తే మిగతావారంతా సంపన్నవర్గాలకు చెందినవారే. దీంతో ఒక్కో ఓటుకు రూ.5 వేలకు పైగా ఖర్చు చేసేందుకు సైతం వెనకాడటం లేదు. 

డబ్బులే పరమావధిగా.. 
ఎన్నికలంటే ప్రస్తుతం డబ్బులే పరమావధిగా మారింది. గతంలో ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీచేయాన్నా సదరు అభ్యర్థి గుణవంతుడా.. లేక ఉన్నత చదువులు అభ్యసించాడా.. ప్రజలకు సేవ చేస్తాడా..? అనే కోణంలో చూసి టికెట్లు ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో చూసినా డబ్బులే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నాయకులకు ఎన్నికల నాటికి టికెట్‌ దక్కకుండాపోతోంది.  

బరిలో బడా నేతలు.. 
ఆదిబట్ల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు పోటీచేస్తున్న ఓ నాయకుడు గతంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానానికి పోటీచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 12వేల ఓట్లు సాధించిన నేత మళ్లీ కౌన్సిలర్‌గా బరిలో దిగారు. మరో నేత ఎంపీపీగా, తన సతీమణి ప్రస్తుతం జెడ్పీటీసీ అయినప్పటికీ చైర్మన్‌ స్థానం జనరల్‌ కావడంతో కౌన్సిలర్‌గా పోటీకి దిగారు. ఇంత పెద్ద నేతలు కౌన్సిలర్లుగా పోటీకి దిగుతున్నారంటే ఆదిబట్ల చైర్మన్‌ సీటుకు ఎంతటి ప్రాధాన్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top