ప్రమాదమని తెలిసినా.. | railway tracks journey Risk in miryalaguda | Sakshi
Sakshi News home page

ప్రమాదమని తెలిసినా..

Oct 16 2014 2:25 AM | Updated on Sep 2 2017 2:54 PM

ప్రమాదమని తెలిసినా..

ప్రమాదమని తెలిసినా..

మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంకు తండా గ్రామ పరిధిలోని కుర్యాతండాలో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మిర్యాలగూడకు 10 కిలో మీటర్ల దూరంలో నాగార్జునసాగర్

 కుర్యాతండా(మిర్యాలగూడ రూరల్) : మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంకు తండా గ్రామ పరిధిలోని కుర్యాతండాలో 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. మిర్యాలగూడకు 10 కిలో మీటర్ల దూరంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ అవతలివైపున ఉంది తండా. ఈ తండా వాసులు  మిర్యాలగూడకు రావాలంటే ముందుగా కాపలా లేని రైల్వే క్రాసింగ్ దాటి, సాగర్ ఎడమకాల్వపై ఉన్న రైల్వే వంతెన మీదుగా ప్రయా ణం సాగించాల్సి వస్తోంది. కాగా తండాకు మరో డొంకదారి ఉంది. కానీ ఈ మార్గం గుండా వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి రావడంతో తండావాసులంతా రైల్వే వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. తండాలో 50మంది విద్యార్థులు నిత్యం మిర్యాలగూడ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలకు వచ్చి వెళ్తున్నారు. వీరంతా సాగర్ కాల్వపై ఉన్న రైల్వే వంతెన మీదుగా వచ్చి ఆటోలలో పట్టణానికి చేరుకుంటున్నారు. నడిచి వెళ్లేటప్పుడు ట్రాక్‌పైకి రైలు వచ్చినా, పట్టుతప్పినా కాల్వలో పడిపోయే ప్రమాదం ఉండడంతో ఉదయం, సాయంత్రం పిల్లలను వంతెన దాటించడం తల్లిదండ్రులకు దినచర్యగా మారింది.
 
 ఎడమకాల్వపై బ్రిడ్జి నిర్మాణం అయ్యేనా...
 ప్రయాణ కష్టాలు తీర్చాలని తండా వాసులు పలుమార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ ఆధునికీకరణలో భాగంగా కుర్యాతండాకు వెళ్లేందుకు వీలుగా ఎడమ కాల్వపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.65 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణం చేపడతామని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారు. కానీ నేటి వరకు పనులు ప్రారంభం కాలేదు. అధికారులు వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని తండావాసులు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement