పరీక్షలు పెంచడమే మార్గం  

Rahul Potluri Exclusive Interview With Sakshi About Coronavirus

దేశంలో కనీసం 10 లక్షల మందిని పరీక్షించాకే ఓ నిర్ధారణకు రావాలి

అవసరాన్ని బట్టి క్వారంటైన్, ఐసోలేషన్‌ గడువు పెంచుకోవాలి

‘సాక్షి’తో ఆక్లామ్‌ వర్సిటీ స్టడీ యూనిట్‌ వ్యవస్థాపకుడు రాహుల్‌ పొట్లూరి

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో కరోనా నియంత్రణ జరగాలంటే ఆ వైరస్‌ సోకిందా లేదా అనే నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడమే మార్గమని యూకేకు చెందిన ఆక్లామ్‌ విశ్వవిద్యాలయ స్టడీ యూనిట్‌ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్‌ రాహుల్‌ పొట్లూరి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కనీసం 10 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరగాల్సి ఉందని, ఆ తర్వాతే దీనిపై ఓ నిర్ధారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అప్పుడే సామాజిక, ఆర్థిక మాంద్యాలను తగ్గించుకునే వీలు కలుగుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణపై 50 దేశాలు తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసిన ఆక్లామ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందంలో సభ్యుడు కూడా అయిన రాహుల్‌ పొట్లూరి భారతదేశంలో కరోనా నియంత్రణ మార్గాలపై మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ అంశంపై రాహుల్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

సంబంధాలను అధ్యయనం చేశాం
ప్రపంచంలోని పలుదేశాల్లో కరోనా కేసుల సంఖ్య, అక్కడ జరుగుతోన్న పరీక్షల సంఖ్య మధ్య ఉన్న సంబంధాన్ని విస్తృతంగా అధ్యయనం చేశాం. కరోనా కేసులు, మరణాల నిష్పత్తి చాలా వైవిధ్యంగా ఉందని మా పరిశోధనలో తేలింది. ఏ దేశాల్లో అయితే జనాభా ఆధారంగా కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉందో అక్కడ మరణాల రేటు తక్కువగా ఉంది. వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా చేయడం వల్లే పాజిటివ్‌ కేసులను నిర్ధారించి వారికి చికిత్స అందించి మరణించకుండా చర్యలు తీసుకునే వీలు కలిగింది. మరణాల సంఖ్యను నియంత్రించడంలో బాగా కృషి చేసింది దక్షిణ కొరియానే.

కనీసం ఒక శాతం పరీక్షలు చేయాలి
వివిధ దేశాల్లో ఈ వైరస్‌ వ్యాప్తిని పరిశీలించిన తర్వాత ఏ దేశంలోనైనా ఆ దేశ జనాభాలో 1 శాతం మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా అయితే మన దేశంలో కనీసం కోటిన్నర మందికి ఈ పరీక్షలు జరపాలి. కానీ సాధ్యాసాధ్యాల దృష్ట్యా మనదేశంలో పది లక్షల మందికైనా పరీక్షలు నిర్వహిస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరీక్షలను విస్తృతంగా నిర్వహించడం ద్వారా ఆరోగ్య ప్రణాళికలను అమలు చేయడమే కాకుండా హాట్‌స్పాట్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వైరస్‌ నిరోధానికి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమనుకంటే క్వారంటైన్‌ లేదా ఐసోలేషన్‌ గడువును కూడా పెంచుకోవచ్చు.

వ్యాక్సినేషన్‌ లేదు
కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్‌ లేనందువల్ల పరీక్షలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవడమే మార్గం. ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 లక్షల మంది ఈ వైరస్‌ బారిన పడి మరణించే ప్రమాదాన్ని తప్పించుకోవాలన్నా గణనీయంగా పరీక్షలు నిర్వహించడమే ఉత్తమ మార్గం. అందుకే మా పరిశోధన బృందం ప్రపంచంలో ఈ విధానం అమలు చేయాలని సిఫారసు చేస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top