‘పోలవరానికి’ నిరసనగా గిరిదీక్ష | protest against 'Polavaram' | Sakshi
Sakshi News home page

‘పోలవరానికి’ నిరసనగా గిరిదీక్ష

Jul 22 2014 2:09 AM | Updated on Jul 11 2019 9:08 PM

అమాయక ఆదివాసీలను అష్టకష్టాలకు గురిచేసే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు.

వీఆర్‌పురం: అమాయక ఆదివాసీలను అష్టకష్టాలకు గురిచేసే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో పాపికొండల ప్రాంతమైన కొల్లూరులో సోమవారం గిరిదీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ..  పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్న ప్రాంతం భారీ నిర్మాణాలకు అనువుగా లేదని నిపుణులు పదేపదే చెపుతున్నా కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
 
ప్రత్యామ్నాయ మార్గాలలో ప్రాజెక్ట్ నిర్మిస్తే ముంపు ప్రభావాన్ని పూర్తి స్థాయిలో తగ్గించవచ్చని ఇంజనీర్లు సూచిస్తున్నా.. పాలకులు మొండివైఖరి అవలంభించడం ఏంటని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణంతో రెండు లక్షల మంది నిరాశ్రయులవుతారని, అందుకే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ముంపు బాధితులకు న్యాయం జరిగేలా సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు విరుద్ధంగా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసిందని ఆరోపించారు.
 
ఈ ప్రాంతానికి వచ్చే ఆంధ్ర అధికారులకు సహాయ నిరాకరణ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భద్రాచంల ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహరెడ్డి, నాయకులు కె.బ్రహ్మచారి, రేణుక, కొక్కెరపాటి పుల్లయ్య, పూనెం సత్యనారాయణ, కారం శిరమయ్య, బొప్పెన కిరణ్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement