ఆ విషయంలో ఎంతో గర్వపడుతున్నా

Prakash Raj Say Thanks To KTR And Telangana DGP - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. లాక్‌డౌన్‌తో అన్ని కంపెనీలు, దుకాణాలు మూత పడటంతో కార్మికులు కాలి నడకన తమ సొంత ఊ​ళ్లకు పయనమై పలు చోట్ల చిక్కుకపోయారు. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక ఏర్పాట్లు చేశాయి. ప్రభుత్వాలతో పాటు స్వచ్చంద సంస్థలు, పలువురు ప్రముఖులు ఈ వలస శ్రామికులకు కావాల్సిన ఏర్పాట్లను అందించాయి. ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కూడా  వలస కార్మికుల కోసం తనవంతు సాయాన్ని అందించారు. ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక మంది వలసకార్మికులకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం అందించి వారి ఆలనా పాలనా చూసుకున్నారు. 

కాగా వలస కార్మికులను వాళ్ల స్వస్థలాకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపుతున్నారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడుపుతూ వలస కార్మికులను తరలిస్తున్నారు. దీంతో ప్రకాష్‌ రాజ్‌ ఫామ్‌హౌజ్‌లో ఉన్న వలస కార్మికులు కూడా వారి స్వస్థలాలకు బయలుదేరారు. 

‘వలస శ్రామికులను సురక్షితంగా తరలిస్తున్నందుకు కేటీఆర్ గారికి, తెలంగాణ డీజీపీ గారికి కృతజ్ఞతలు. 44 రోజుల పాటు కొంతమంది కూలీలకు నా ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచ్చాను. వాళ్లందరూ ఇప్పుడు తనను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. వారి జీవిత కథల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. కష్టకాలంలో వారిని ఆదుకోగలిగిన ఒక తోటి వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అంటూ ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ప్రకాష్‌ రాజ్ తన ఫామ్‌హౌస్‌లో ‌ వారందరిని ప్రత్యేక బస్సుల ద్వారా రైల్వేస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను కూడా ట్వీట్‌లో జతపరిచారు. 

చదవండి:
సీతమ్మ కష్టం​ తీరింది
వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top