భవనాలపై ‘విద్యుత్‌’ నిఘా

Power Department Checkings in Apartments And Buildings - Sakshi

15 మీటర్ల కంటే తక్కువ ఎత్తులోపు భవనాల్లో విద్యుత్‌ అధికారుల తనిఖీ

రంగంలోకి చార్టెడ్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఇంజనీర్లు

ప్రభుత్వానికి ప్రతిపాదించిన తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌

సాక్షి, సిటీబ్యూరో:  నగరంలో ముప్పై ఏళ్ల క్రితమే అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ మొదలైంది. ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి . విద్యుత్‌ భద్రతకు సంబంధించి ఇప్పటి వరకు ఓ స్పష్టమైన విధివిధానాలు అంటూ ఏమీ లేకపోవడం, నాసిరకం వైరింగ్‌ పనులతో కొనుగోలు దారులు నష్ట పోవాల్సి వస్తుంది. తరచూ షార్ట్‌సర్క్యూట్‌లు వెలుగు చూడటమే కాకుండా ఇంట్లో విలువైన గృహోపకరణాలు, వాణిజ్య సముదాయాల్లోని విలువైన వస్తువులు దగ్ధం అవుతుండటంతో పాటు ఒక్కోసారి మనుషుల ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి నష్టాలకు చెక్‌ పెట్టాలని తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌ స్పెక్టరేట్‌ భావించింది. ఆ మేరకు విద్యుత్‌ భద్రత కోసం పలు విధివిధానాలు కూడా రూపొందించింది. 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తు, 650 ఓల్టేజ్‌ల కంటే తక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న బహుళ అంతస్తుల భవనాలకు విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు విషయంలో ఈ విధివిధానాలు అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ తరహా సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.   

తనిఖీల బాధ్యత చార్టెడ్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఇంజనీర్స్‌కు  
ప్రస్తుతం 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న గృహ, వాణిజ్య సముదాయాలు...650 వోల్టేజ్‌ కన్న ఎక్కువ విద్యుత్‌ వినియోగం ఉన్న భవనాల్లో విద్యుత్‌ భద్రతను తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ పరిశీలిస్తుంది. విద్యుత్‌ డిమాండ్, ఎంపిక చేసుకున్న లోడు, విద్యుత్‌ లైనింగ్, వైరింగ్‌ కోసం ఉపయోగించిన కేబుల్స్, స్విచ్‌ బోర్డుల ఎంపిక, ఫీజు బాక్స్‌లు, ఎర్తింగ్‌ వంటి అంశాలను పరిశీలించి...పూర్తి భద్రత ఉందని నిర్ధారించుకున్న తర్వాతే ఆయా భవనాలకు నో అ బ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తుంది. చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్స్‌పెక్టరేట్‌ జారీ చేసిన ధృవీకరణ పత్రం ఆధారంగానే డిస్కం ఆయా భవనాలకు విద్యుత్‌ మీటరు జారీ చే స్తుంది. 650 కంటే తక్కువ ఓల్టేజ్‌ వాడే మధ్య తరహా భవనాలను తనిఖీ చేయకపోవడంతో బిల్డర్లు నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు నాసిరకం కేబుళ్లను వాడుతున్నారు. భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోకపోవడం....సామర్థ్యానికి మించిన విద్యుత్‌ వాడుతుండటం వల్ల విద్యుత్‌ వేడికి కేబుళ్లు దగ్ధమవుతున్నాయి. షార్ట్‌సర్క్యూట్‌లకు కారణమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ నష్టాలు వాటిళ్లుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అమాయకులు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారం ఇ వ్వకూడదని తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రికల్‌  ఇన్‌స్పెక్టరేట్‌ భావించింది. ఆ మేరకు తక్కువ ఎత్తులో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాల్లో తనిఖీ బాధ్యతను చార్టె డ్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఇంజనీర్స్‌కు అప్పగించడం ద్వారా విద్యుత్‌ భద్రతను మెరుగుపర్చవచ్చని యోచిస్తుంది.  

షార్ట్‌సర్క్యూట్‌లు నివారించేందుకే
నగరంలో లక్షల సంఖ్యలో నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాలను తనిఖీ చేయడం కేవలం ఒక చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్స్‌పెక్టర్‌తో కావడం లేదు. ఇక్కడ అవసర మైన సిబ్బంది లేకపోవడం కారణం. ఉన్నవాళ్లపై కూడా పని భారం పెరుగుతోంది. తక్కువ ఎత్తులో నిర్మించే బహుళ అంతస్తుల భవనాల తనిఖీ బాధ్యతను చార్టెడ్‌ సేఫ్టీ ఇంజనీర్‌ ఏజెన్సీకి అప్పగించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. వైరింగ్‌ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పెంచడం ద్వారా విద్యుత్‌ షార్ట్‌ స ర్క్యూట్‌ల జరిగే అగ్నిప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అవకాశం ఉంది. ఒక వేళ ఈ పత్రాలు జారీ చేసే విషయంలో ఎవరైనా చార్టెడ్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఇంజనీర్‌ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే..అట్టి ఇంజనీరు లైసెన్సును రద్దు చేసే అధికారం చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టరేట్‌ కు ఉంటుంది. వీరికి ప్రభుత్వం నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఇది ఒక ప్రైవేటు ఏజెన్సీ మాత్రమే. వీరు ఇచ్చిన సర్టిఫికెట్‌పై విద్యుత్‌ అధికారులు సంతృప్తి చెందిన తర్వాతే కనెక్షన్‌ జారీచేస్తా రు.   –  ఏజీ రమణప్రసాద్,చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top