
ఏం పాపం చేశామని ఓడించారు: పొన్నం
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఎన్నో ఉద్యమాలు చేశామని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఎన్నో ఉద్యమాలు చేశామని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో ఆదివారం పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన పార్టీలను గెలిపించారంటూ ఆయన పరోక్షం ఆ ప్రాంతంలోని కొన్ని పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏం పాపం చేశామని ఓడించారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు చేసిన హామీలన్నీ నెరవేర్చాలని పొన్నం ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైయ్యారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ, పి. బలరాం నాయక్లతోపాటు ఎంపీలు వివేక్, మధు యాస్కీ గౌడ్, పొన్నం ప్రభాకర్ తదితరులు ఓడిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీనే అంటూ ఆ పార్టీ నాయకులు ఆ ప్రాంతంలో ప్రచారం చేశారు. అయినా తెలంగాణ ప్రజలు మాత్రం టీఆర్ఎస్కు పట్టం కట్టారు. దాంతో తెలంగాణ ఏర్పాటు కోసం ఇంత చేసిన తాము ఓడిపోయామంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.