
మూడు నెలల్లో పాస్‌పోర్టు సేవలు
జిల్లా కేంద్రంలో మరో మూడు నెలల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభమవుతుందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
► ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
► పాస్‌పోర్టు సేవా కేంద్రంతో పలువురికి ప్రయోజనం
► ఖమ్మంలో అధునాతన హంగులతో ఏర్పాటు
ఖమ్మం వ్యవసాయం: జిల్లా కేంద్రంలో మరో మూడు నెలల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రం ప్రారంభమవుతుందని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయనున్న ఖమ్మం ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఎంపీ పొంగులేటితోపాటు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రీజినల్ పాస్‌పోర్టు అధికారి విష్ణురెడ్డి, హైదరాబాద్ పోస్టుమాస్టర్ జనరల్ కల్నల్ ఎలీషాల బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా తపాలా కార్యాలయంలో ఉన్న సౌకర్యాలు వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయనున్న అన్ని సౌకర్యాలపై బృందం చర్చించింది.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి ఖమ్మంలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ.. ప్రయత్నాలు చేస్తూనే ఉన్నానని తెలిపారు. ఖమ్మంతోపాటు పొరుగున ఉన్న జిల్లాల ప్రజలు పాస్‌పోర్టు కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని, వ్యయప్రయాసలు పడాల్సి వస్తోందన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నత విద్యాసంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున.. చదువు కోసం విద్యార్థులు, పనుల నిమిత్తం వ్యాపారులు విదేశాలకు వెళ్లాల్సి ఉంటుందని, ఇటువంటి అవసరాలను గుర్తించి ఇక్కడ పోస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరామన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని సాధించామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న హంగులన్నీ ఇక్కడికి తెస్తున్నామని తెలిపారు. ఖమ్మంకు ఐటీ హబ్ తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని ఆయన గుర్తు చేశారు. కాగా.. ఖమ్మంలో పాస్‌పోర్టు కేంద్రాన్ని మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, మంత్రి సుష్మాస్వరాజ్‌కు, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నగరానికి వన్నె..: ఎమ్మెల్యే అజయ్
రాష్ట్ర ప్రభుత్వం నగరానికి వన్నె తెచ్చే అనేక కార్యక్రమాలను చేపడుతోందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి ఫలితంగా నగరంలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటైందన్నారు. దేశంలో రెండోదశలో మొత్తం 149 పాస్‌పోర్టు కేంద్రాలు మంజూరు కాగా.. వాటిలో ఖమ్మం ఒకటన్నారు. పాస్‌పోర్టు రీజినల్ అధికారి విష్ణురెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఈస్టర్న్ ప్రాంతంలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను గుర్తించి.. నగరంలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తపాలా, పాస్‌పోర్టు విభాగాలు సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాయన్నారు.
హైదరాబాద్ పోస్టు మాస్టర్ జనరల్ కల్నల్ ఎలీషా మాట్లాడుతూ పాస్‌పోర్టు సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసే ప్రయత్నంలో భాగంగా ఖమ్మంలో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, గ్రంథాలయ చైర్మన్ హజీజుల్ హక్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.