ఇక నుంచి కమీషన్‌ 15 శాతమే

Oyo 15 per cent commission for online booking companies - Sakshi

కాదంటే జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ నిలిపివేత 

లాభాలొస్తాయని నమ్మాం..రూ.లక్షల్లో నష్టపోయాం 

ఓటా, ఓయో ఆన్‌లైన్‌ సంస్థల కమీషన్‌ దందాపై రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ మండిపాటు

హైదరాబాద్‌: ఓటా, ఓయో ఆన్‌లైన్‌ బుకింగ్‌ సంస్థలకు ఇకనుంచి 15 శాతం కమీషన్‌ను మాత్రమే చెల్లిస్తామని, కాదంటే వచ్చేనెల 1 నుంచి దేశవ్యాప్తంగా హోటల్‌ ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను నిలిపివేస్తామని తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. ఈ రెండు సంస్థలు తమ వ్యాపారాన్ని నిలువునా ముంచేసి రోడ్డున పడేలా చేశాయని అసోసియేషన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని అసోసియేషన్‌ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ తమకు ఆన్‌లైన్‌ ద్వారా వ్యాపారాన్ని కల్పించి లాభపడేలా చేస్తామంటే బడ్జెట్‌ కేటగిరీ హోటల్స్‌ నిర్వాహకులమంతా ఈ సంస్థల్లో చేరామని తెలిపారు. ఇలా వ్యాపారాన్ని చూపించినందుకుగాను వారికి 10 నుంచి 18% కమీషన్‌ ఇచ్చామన్నారు. అయితే, ఈ కమీషన్‌ ఇప్పుడు 40 శాతానికి చేరు కుందని, దీంతో తాము భారీగా నష్టపోతున్నామన్నారు. దేశవ్యాప్తంగా హోటల్‌ యాజమాన్యాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. వీరి వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.  

25 నుంచి గదులు ఇచ్చేది లేదు 
తమ డిమాండ్లకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సంస్థలకు ఒప్పుకోకుంటే ఈ నెల 25 నుంచి తమ హోటల్స్, లాడ్జీల్లో గదులు ఇచ్చేది లేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. హోటల్‌ రూమ్‌ వాస్తవ ధర రూ.1,500 ఉంటే వినియోగదారుల నుంచి రూ.2 వేలు వసూలు చేసి తమకు మాత్రం కేవలం రూ.700 ఇస్తున్నారన్నారు.  రూమ్‌లపైనే కాకుండా ఫుడ్‌ వంటి వాటిపై కూడా తమ వద్ద  డబ్బులు గుంజుతున్నారని వాపోయారు.  రూ.వెయ్యిపైన వ్యాపారం జరిగితేనే పన్ను కట్టాలని, కానీ ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా తమకు రూ.600, 700 మాత్రమే వస్తోందని హైదరాబాద్‌ హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తెలిపారు. ఆఫర్లు అంటూ చూపించే వెబ్‌సైట్‌లను ప్రజలు నమ్మవద్దని, నేరుగా వస్తే తక్కువ ధరల్లోనే రూమ్‌లను ఇస్తామని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top