తాగిన మైకంలో లారీ నడుపుతున్న డ్రైవర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు.
నిడమనూరు (నల్లగొండ జిల్లా) : తాగిన మైకంలో లారీ నడుపుతున్న డ్రైవర్ ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఒక ప్రయాణికుడు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నీలంనగర్ గ్రామ సమీపంలో జరిగింది.
వివరాల ప్రకారం.. దేవరకొండ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురికి గాయాలు కాగా, వారిని దేవరకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లారీ డ్రైవర్ పారిపోతుండగా గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.