సంచార బయో టాయిలెట్లుగా ఆర్టీసీ పాత బస్సులు 

Old RTC Buses Turned As Mobile Bio Toilets - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ప్రయాణికుల సేవలో అలసి మూలపడిపోయిన పాత బస్సులు ఇక కొత్త అవతారమెత్తనున్నాయి. పట్టణాల్లో జనసమ్మర్థం ఉండే ప్రాంతాల్లో సంచార బయో టాయిలెట్లుగా మారబోతున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో కొన్ని ప్రారంభించగా.. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ సంచార బయో టాయిలెట్లను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో పురపాలక శాఖ వీటిని ఏర్పాటు చేయబోతోంది. ఆర్టీసీ వద్ద నిరుపయోగంగా ఉన్న పాత బస్సులను బయో టాయిలెట్లుగా మార్చి అన్ని పట్టణాల్లో అవసరమైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.

పట్టణాల్లోని బహిరంగ ప్రాంతాల్లో టాయిలెట్లు లేక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా అవస్థ పడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం సమయంలో ఈ అంశంపై మంత్రి కేటీఆర్‌ దృష్టి సారించారు. దేశంలోని కొన్ని ఇతర పట్టణాల్లో పాత బస్సులను సంచార శౌచాలయాలుగా మార్చి వినియోగిస్తున్న విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఆర్టీసీ వద్ద పాత బస్సులు ఉండటంతో వాటిని ఇలా వినియోగించవచ్చని నిర్ణయించి అధికారులతో చర్చించారు. దాదాపు 700 బస్సుల వరకు సిద్ధంగా ఉన్నాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. నగరంలోని కొన్ని ముఖ్య ప్రాంతాల్లో విధుల్లో ఉండే ఆర్టీసీ మహిళా సిబ్బంది కోసం ఛేంజ్‌ ఓవర్‌ గదులుగా పాత బస్సులను వాడాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ తీసుకుంది. ప్రయోగాత్మకంగా కొన్నింటిని రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. అదే తరహాలో ఇప్పుడు పాత బస్సులను సంచార మరుగుదొడ్లుగా మార్చారు. 

ఒక్కో బస్సులో నాలుగు టాయిలెట్లు.. 
ఒక్కో బస్సులో నాలుగు టాయిలెట్లు ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. ఇందులో ఒకటి ఇండియన్‌ మోడల్, మూడు వెస్ట్రన్‌ మోడల్‌ ఉంటాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ బయో టాయిలెట్లను త్వరలో రూపొందించబోతున్నారు. ఇప్పటికే నగరంలో ఆర్టీసీ సిబ్బంది కోసం రూపొందించిన సంచార శౌచాలయాలను చూసిన మంత్రి పువ్వాడ, అలాంటివి ఖమ్మంలో ఏర్పాటు చేయా లని నిర్ణయించి అధికారులను ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top